ముగ్గురు హ్యాకర్లలో తెలుగు యువకుడు
న్యూఢిల్లీ: ముగ్గురు భారతీయ టెక్నాలజీ నిపుణులు ‘ఓపెన్ ఏఐ’ వ్యవస్థలను విజయవంతంగా హ్యాక్ చేశారు. ఆంత్రోపిక్‌కు సంబంధించిన క్లాడ్ టూల్స్ ఉపయోగించి ఓపెన్ ఏఐ సిస్టమ్స్‌లోకి ప్రవేశించారు. అందులోని లోపాన్ని గుర్తించారు. కృత్రిమ మేధ సేవలు అందించే ‘ఓపెన్ ఏఐ’ఇటీవల నిర్వహించిన ‘బగ్–»ౌంటీ’ ప్రోగ్రామ్‌లో భాగంగానే వారు ఈ వ్యవస్థలను హ్యాక్ చేశారు. ఈ ముగ్గురు టెక్ నిపుణులు మోహన్ పెద్దపాటి, హర్ష్ జైశ్వాల్, రాహుల్ మియానీ సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ ‘హ్యాక్‌ట్రాన్ ఏఐ’లో పనిచేస్తున్నారు. వీరిలో మోహన్ పెద్దపాటి తెలుగు యువకుడే కావడం విశేషం.
ఈ ముగ్గురూ ‘బగ్–బౌంటీ’లో భాగంగా ఓపెన్ ఏఐ ఉద్యోగుల ఖాతాలను, అలాగే ఆ కంపెనీ ప్రైవేట్ గిట్‌హబ్ ఎన్విరాన్‌మెంట్‌ను యాక్సెస్ చేయగలిగారు. ఓపెన్ ఏఐ ప్రైవేట్ రిపోజిటరీకి యాక్సెస్ పొంది, లోపాన్ని కనిపెట్టినందుకు ముగ్గురు నిపుణుల బృందానికి 6,500 డాలర్ల(రూ.5.5 లక్షలు) బçహుమతి లభించింది. మోహన్ పెద్దపాటి హ్యాక్‌ట్రాన్ ఏఐకి సంబంధించిన సీటీఓ, సహ వ్యవస్థాపకుడు. వెబ్ ఎక్స్‌ప్లాయిటేషన్, సోర్స్‌కోడ్ రివ్యూ, మొబైల్ అప్లికేషన్ సెక్యూరిటీలో నైపుణ్యం కలిగిన సెక్యూరిటీ పరిశోధకుడు. ఆంధ్రప్రదేశ్‌లో నూజివీడు ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్ అభ్యసించాడు.


