సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం చేసే కొన్ని పనులు కొన్నిసార్లు జీవితాల్నే తలక్రిందులు చేస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతున్న ఘటనే ఇందుకు నిదర్శనం. వ్యక్తిగత జీవితం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా తక్కువేనని, హఠాత్తుగా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును మార్చేస్తాయని ఈ ఘటన నిరూపిస్తోంది. వివాహానికి ముందు ఏర్పాటు చేసిన బ్యాచిలర్ పార్టీలో స్నేహితులు ఇచ్చిన ఓ సర్ప్రైజ్ వీడియో కారణంగా ఏకంగా పెళ్లే రద్దయిన ఈ ఉదంతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది.
త్వరలో వివాహం చేసుకోబోయే ఓ యువతికి, ఆమె స్నేహితులు బ్యాచిలర్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో కాబోయే వధువుకు ఊహించని విధంగా ఒక సర్‌ప్రైజ్ ఇవ్వాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా పార్టీ జరుగుతుండగా, వధువు మాజీ ప్రియుల చేత శుభాకాంక్షలు చెప్పిస్తూ వీడియోలు తీశారు. బ్యాచిలర్ పార్టీలో స్నేహితురాలిచ్చిన ఈ సర్ప్రైజ్ చూసి వధువు షాక్ అవగా, ఆ సమయంలో ఆమె ఇచ్చిన రియాక్షన్‌ను వీడియో తీశారు. అంతటితో ఆగకుండా ఆ సర్ప్రైజ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎక్స్ వేదికగా భవేష్ గుజరాతి అనే యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. క్షణాల్లో అది నెట్టింట తెగ వైరల్ అయింది.
పెళ్లి రద్దు చేసుకున్న వరుడు..
అయితే, సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టిన ఈ వీడియో కాస్తా నేరుగా కాబోయే పెళ్లికొడుకు దృష్టికి వెళ్లింది. కాబోయే భార్య బ్యాచిలర్ పార్టీలో మాజీల వీడియోలను ప్రదర్శించడం, పైగా అది పబ్లిక్‌గా వైరల్ కావడంతో ఆ వరుడు,అతని కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి, అసంతృప్తికి గురైన అతను.. నేను ఇంత మంచి అమ్మాయిని వివాహం చేసుకోలేను అంటూ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశాడు.
వీడియో డిలీట్ చేసిన వధువు..
ఈ అనూహ్య పరిణామాన్ని అసలు ఊహించని ఆ వధువు ఒక్కసారిగా కంగుతింది. క్షణాల వ్యవధిలో పెళ్లి క్యాన్సిల్ కావడంతో దిగ్భ్రాంతికి గురైన ఆమె, వెంటనే ఇన్‌స్టాగ్రామ్ నుండి ఆ వివాదాస్పద సర్ప్రైజ్ వీడియోను తొలగించింది.
వ్యక్తిగత జీవితానికి, సరదా సరదాలకూ ఒక హద్దు ఉంటుంది.. చిలిపి చేష్టలతో జీవితాలనే పాడు చేసుకుంటారు. ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టాలని చూస్తే ఇలాగే ఉంటుంది అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం ఇంత దూరం వస్తుందని ఆ అమ్మాయి ఊహించి ఉండదు అని కొందరు అభిప్రాయపడుతుంటే, ఇలాంటి సర్ప్రైజ్‌లు అవసరమా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
This video reportedly reached the groom, and he called off the wedding. She has since deleted the video from her Instagram. https://t.co/30iXcfXdvL
— Bhavesh Gujrati (@Bhaveshlivelife) September 9, 2026


