ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ విజయం సాధించింది. ఏబీవీపీ నేత యష్ దబాస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆయనకు మెుత్తంగా 24,576 ఓట్లు వచ్చాయి. వైస్ ప్రెసిడెంట్ పోస్టును ఇండిపెండెంట్ అభ్యర్థి దీపాన్షు గెలుచుకున్నారు. కార్యదర్శిగా రియాచావ్డి (ఏబీవీపీ) సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన లక్ష్ రాజ్ సింగ్ (ఏబీవీపీ ) ఎన్నికయ్యారు.
ప్రధాన విద్యార్థి సంఘాల మధ్య హోరాహోరీగా జరిగిన పోటీ అనంతరం ఈ ఫలితాలు వెలువడ్డాయి. అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ), ఏఐఎస్ఏ-ఎస్ఎఫ్ఐ కూటములు ఈ ఎన్నికల్లో పోటీచేశాయి. ఈ రోజు (శనివారం) ఉదయం 8 గంటలకు నార్త్ క్యాంపస్‌లోని యూనివర్సిటీ స్పోర్ట్స్ స్టేడియం మల్టీపర్పస్ హాల్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అనేక రౌండ్ల పాటు పోటీ హోరాహోరీగా సాగగా చివరకు ఏబీవీపీ అభ్యర్థి యష్ దబాస్‌ను విజయం వరించింది.
కాగా ఈ విజయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందించారు. పంజాబ్, మంగళూరు, కేరళ, ఢిల్లీ విశ్వవిద్యాలయాలలో ఏబీవీపీ గెలిచిందని దీనిపై రాహుల్ గాంధీ సిగ్గుతో తల దించుకోవాలని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. "ఢిల్లీ విశ్వవిద్యాలయ ఎన్నికలలో ఏబీవీపీ ఘన విజయం సాధించింది. స్వార్థ ప్రయోజనాలతో నడిచే, యువత సంరక్షకులమని చెప్పుకునే వారి దుర్మార్గపు ప్రయత్నాలన్నీ విద్యార్థులను తప్పుదోవ పట్టించడంలో విఫలమయ్యాయి.భారతదేశపు విద్యార్థులు, జెన్-జీ భారత్‌కి అదే విధంగా ప్రధాని మోదీకి మద్దతుగా నిలుస్తున్నారు.ఏబీవీపీ కార్యకర్తకు..విజేతలైన అభ్యర్థులందరికీ నా అభినందనలు." అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేళారు.


