శ్వేతపత్రం గేమ్‌ ఇందుకేనా చంద్రబాబు ? | Chandrababu Strategy To Roll Back Welfare Schemes, YSRCP Questions White Paper On AP Finances And Unfulfilled Promises | Sakshi
Sakshi News home page

శ్వేతపత్రం గేమ్‌ ఇందుకేనా చంద్రబాబు ?

Aug 7 2026 10:15 AM | Updated on Aug 7 2026 10:43 AM

Chandrababus Strategy to Roll Back Welfare Schemes

సాక్షి, అమరావతి: ఏపీ ప్రజలను ఎలా గందరగోళ పరచాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది. రెండేళ్ల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్దిక పరిస్థితిపై  శ్వేతపత్రం ఇవ్వవలసిన అవసరం ఏమి వచ్చింది? రానున్న రోజుల్లో ప్రజల నడ్డి విరిచే విధంగా అదనపు భారం పడే అవకాశం ఉంటుందా? లేక తను ఇచ్చిన వాగ్దానాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం సాధ్యం కాదని సంకేతం ఇవ్వడమా? టీడీపీ, జనసేన కలిసి  బాండ్ల రూపంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేసినట్లు భ్రమ పడాలనా? ఉద్యోగులు ఇకపై తమ డిమాండ్లను అడగకుండా బెదిరించడమా? 2024 ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన రీతిలో ఈ రెండేళ్లలో ఎంత సంపద సృష్టించారో ఎందుకు చెప్పలేకపోతున్నారు? పైగా అప్పులు చేయకపోతే సంక్షేమ స్కీములు ఇవ్వలేమన్న సందేశం ఎందుకు ఇవ్వవలసి వచ్చింది. 

జగన్ టైమ్ లో రెండేళ్ల కరోనా ఉన్నా,ఎన్నడైనా ఆర్ధిక పరిస్థితిపై ప్రజలను బేజారెత్తించేలా మాట్లాడారా? ఆయన టైమ్ లో ఓడరేవులు, మెడికల్ కాలేజీలు,ఊరూరా సచివాలయ భవనాలు  వంటి ఎన్నిటినో నిర్మించి సంపద సృష్టిస్తే, కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్లలో చేసిన ప్రగతి ఏమిటి?ప్రైవేటువారు తప్ప, ప్రభుత్వం ఏమి చేయలేదన్నట్లుగా చంద్రబాబు మాట్లాడడం బలహీనతగా కనిపించదా?అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కూడా  గత ప్రభుత్వంపైన విమర్శలు చేసి తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారా?లేదా?ఏతావాతా చూస్తే ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఏభై ఏళ్లకే ఎస్సి,ఎస్టి,బిసి లకు పెన్షన్, ఉద్యోగులకు పిఆర్సి వంటివి ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఈ శ్వేతపత్రం కధను నడిపారా?అన్న  ప్రశ్న  వస్తోంది.అయితే ఆ విషయం మనసులో పెట్టుకుని పైకి మాత్రం సంక్షేమ కార్యక్రమాలు ఆపబోమని చెబుతున్నా,ఏదో జరగబోతోందన్న అనుమానం కలుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎపిలో ఎక్కడకు వెళ్లినా జన ప్రభంజనం కనిపిస్తుండడంతో, చంద్రబాబు తన  మానిఫెస్టోలోని కొన్నిటిని అయినా, కొంతమేర అయినా అమలు చేశారనిపిస్తుంది. 

గతంలో ఆయన  ఉమ్మడి ఎపి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాని, విభజిత ఎపికి 2014 టరమ్ లో   సి.ఎమ్.గా పనిచేసినప్పుడు కాని ఎలా వ్యవహరించారో గుర్తు చేసుకోండి.2014 ఎన్నికలకు ముందు రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చాక కొద్ది మొత్తం చేసి  ఆశకు హద్దు ఉండాలని వ్యాఖ్యానించారు. పలుహామీలను ఎగవేశారన్న విమర్శను ఎదుర్కున్నారు. 1995 లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్.టి.రామారావును కుర్చీ నుంచి దించేసి తాను సి.ఎఎమ్ అయ్యాక చేసిన డబుల్ గేమ్ ఒక ఉదాహరణ అవుతుంది. అప్పట్లో కిలో సబ్సిడి బియ్యం ధర రెండు రూపాయలు ఉండేది. ఎన్.టి.ఆర్. మద్య పాన నిషేధం అమలు చేశారు.ఇలాంటివి మరికొన్ని కూడా ఉన్నాయి. ఎన్.టి.ఆర్. 1996 జనవరిలో మరణించారు. అదే సంవత్సరం లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల ప్రచారంలో తాము గెలిస్తేనే ఈ స్కీములన్నీ కొనసాగించగలగుతామని  చెప్పేవారు.మద్య నిషేధం మరింత గట్టిగా అమలు చేస్తానంటూ హెల్త్ పర్మిట్లను కూడా రద్దు చేశారు. ఎన్నికలు పూర్తి అయ్యాక రాష్ట్ర ఆర్దిక పరిస్థితి బాగోలేదంటూ జనానికి చెప్పడం ఆరంభించారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటూ సమావేశాలు పెట్టించారు.

ఆయన కూడా స్వయంగా కొన్నిటిలో పాల్గొనేవారు. ఉదాహరణకు ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులతో జరిగిన మీటింగ్ లో మద్య నిషేధంపై అభిప్రాయం అడిగారు.మద్య నిషేధాన్ని సరిగా అమలు చేయలేకపోతున్నామని, అక్రమ మద్యం రాష్ట్రంలోకి వస్తోందని చెప్పేవారు. 1994 ఎన్నికలకు ముందు ప్రజలను , వివిధ వర్గాలవారిని అడిగి వాగ్దానాలు ఇవ్వలేదు .ఎన్.టి.రామారావు వాటిని అమలు చేసిన నేపధ్యంలో తనపై వ్యతిరేకత రాకుండా ఉండడానికి చంద్రబాబు ఈ వ్యూహం అమలు చేసేవారు.తదుపరి కిలో రేషన్ బియ్యాన్ని 5.50 రూపాయలకు పెంచారు. మద్య నిషేధాన్ని ఎత్తివేశారు. ఇలా పలు నిర్ణయాలను తిరగదోడారు. అయితే ఇదంతా ప్రజల ఆమోదంతోనే జరిగిందన్న భావన కల్పించడానికి యత్నించారు. సరిగ్గా అదే పంధాలో ప్రస్తుతం కూడా  ఆయన వెళ్లే  యత్నం చేస్తున్నారా అన్న సందేహం వస్తుంది.అప్పటి రాజకీయ పరిస్థితులు, సమాచార వ్యవస్థ, ఇప్పుడున్న పరిస్థితి, సోషల్ మీడియా వేరు.అందువల్ల కొంత జంకుతున్నట్లు అనిపిస్తుంది. 2024 ఎన్నికలకు ముందు కూడా ఆకాశమే హద్దుగా వరాలు ప్రకటించారు.అదేమంటే సంపద సృష్టించడం తెలుసునని అన్నారు.

 తీరా చూస్తే  పరిస్థితి భిన్నంగా ఉంది.  జగన్ టైమ్ లో రెండేళ్ల కరోనా ఉన్నప్పటికీ మొత్తం ఐదేళ్లలో సుమారు 35వేల కోట్ల అదనపు ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూర్చగలిగితే ,ఈ రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం కేవలం 600 కోట్ల అదనపు ఆదాయమేనని వైసిపి నేతలు లెక్కలు చెబుతున్నారు. అయినా గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని, దాని ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందన్న ప్రచారం చేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారు. ఆ విధ్వంసం ఏమిటో ఎంతకీ చెప్పకపోవడం విశేషం.చంద్రబాబు ఈసారి ఒక సంగతి చెప్పారు. రెండు హామీలు తప్ప మిగిలినవి అమలు చేశామని అన్నారు.ఇంతకుముందు అన్ని చేసేశామని, ఎవరైనా ఇంకేమైనా అడిగితే వారి నాలుక మందమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మాత్రం రెండు హామీలు అమలు చేయలేదని అంగీకరించడం విశేషం. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు.దానికి ప్రత్యామ్నాయంగా పి-4 అమలు చేస్తున్నామని కొన్నాళ్లు చెప్పినా ప్రజలు విశ్వసించడం లేదన్న సంగతి అర్దం అయి ఉండాలి. 

అలాగే 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని, 23 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని అన్నా,కేంద్రం వాటిలో ఉన్న సత్యం ఏమిటో చెప్పేసింది. కేవలం ఏడువేల కోట్ల లోపే పెట్టుబడులు వచ్చాయని, వాటివల్ల 22 వేల ఉద్యోగాలు వస్తాయని ఒక జవాబులో వెల్లడించింది. చంద్రబాబు అప్పట్లో ఇచ్చిన హామీల ప్రకారం ఏడాదికి సుమారు లక్షన్నర కోట్లు సంక్షేమ స్కీములకు వెచ్చించాలని అంచనా.కాని రెండేళ్లకు కలిపి అంత చేశానని ఆయన  తెలిపిన లెక్కలను బట్టి అర్ధం అవుతుంది. మొదటి సంవత్సరం ఒక్క పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడం తప్ప మరే స్కీమ్ అమలు చేయలేదు. ఆ తర్వాత అమలు చేస్తున్నా,అనేక పరిమితులు, కోతలు పెడుతున్నారన్న విమర్శ ఉంది. ఇక ఉద్యోగ సంఘాలు తమకు చేసిన వాగ్దానాల గురించి అడుగుతుంటే,ఇప్పటికే మొత్తం రాష్ట్ర ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలకే పోతున్నదని  ప్రకటిస్తున్నారు. అంటే ఇది ఒకరకంగా వారిని బెదిరించడమే అవుతుంది కదా అని అంటున్నారు.

ఆయన ఎన్నికల మానిఫెస్టోని దగ్గర పెట్టుకుని ఎందుకు  మాట్లాడరో ప్రజలు  అర్ధం చేసుకోలేరా? అప్పుల గురించి నేరుగా వివరణ ఇచ్చినట్లు కనిపించలేదు. కాగా ద్రవ్యలోటు అన్నది మిద్య అని,కాకి లెక్కలు అని  చంద్రబాబు వ్యాఖ్యానించడం విన్నవారికి మతిపోయినంత పని అయింది. అంటే బడ్జెట్ మిద్య, సంపద సృష్టి అన్నది మిద్య అని అనుకోవాలా? ఇంతకీ ఈ శ్వేత్రపత్రం విడుదలలో అసలు లక్ష్యం ఏమిటో తెలియడానికి మరికొంత సమయం పడుతుందేమో చూడాలి.

కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement