నా పేరు కృష్ణ.. 39 ఏళ్లగా జూలోనే ఉంటున్నాను! | World Elephant Day | Sakshi
Sakshi News home page

నా పేరు కృష్ణ.. వయసు నలభై ఎనిమిదేళ్లు.. 39 ఏళ్లగా జూలోనే!

Sep 22 2026 11:07 AM | Updated on Sep 22 2026 11:09 AM

World Elephant Day

ప్రపంచ ఏనుగుల గౌరవ దినోత్సవం సందర్భంగా ‘కృష్ణ’ చెప్పిన కథ 

నేను కృష్ణను. వయసు నలభై ఎనిమిదేళ్లు. నా జీవితంలో 39 ఏళ్లగా విశాఖ జూలోనే ఉంటున్నాను. మీరు నన్ను చూడగానే భయపడతారని తెలుసు. కానీ నా కథ వింటే మీ మనసు మారొచ్చు. నేను పుట్టింది ఏ అడవిలోనో, ఎప్పుడో గుర్తు లేదు. తెలిసొచ్చేసరికి ఇక్కడే ఉన్నాను. మా జాతి పేరు ఎలిఫాస్‌ మాక్సిమస్‌ అని పిలుచుకుంటారు. మేం పూర్తి శాకాహారులం. చెట్ల బెరడు, కాండం, పండ్లు, గ్రాసం.. ఇదే మా ఆహారం. మీరు నమ్మరేమో, రోజుకి 265 కిలోల వరకు తింటా..అరటి దవ్వ, గడ్డి, చెరకు, పుచ్చకాయలు, రాగి, కేటిల్‌ ఫీడ్, బెల్లం...ఇంకా 150 లీటర్ల నీళ్లు తాగుతాను. నా తొండం ఒక్కసారికి పది లీటర్ల నీళ్లు పీల్చుకోగలదు, తెలుసా?   

నిజం చెప్పాలంటే.. నాకు ఒక్కోసారి తల తిరుగుతుంది. బీపీయో..షుగర్‌ లెవెల్స్‌లో తేడా ఉందో తెలియదు.. ఒక్కోసారి ఏమౌవుతుందో నాకే తెలియదు. ఆ సమయాల్లో నా మావటి మాట కూడా వినిపించదు. దగ్గర్లో ఉన్న రాళ్లు తీసి విసిరేస్తాను. అందుకే నన్ను సందర్శకులకు దూరంగా, నా సొంత గదిలోనే ఉంచుతారు. కొన్నిసార్లు ఒంటరిగా అనిపిస్తుంది, కానీ నా మావటివాళ్లకు నా భాష తెలుసు, నాకు వాళ్ల భాష తెలుసు. 

నా పక్కనే రాజు ఉంటాడు. ఇరవై ఆరేళ్ల కుర్రాడు. 2015లో పార్వతీపురం మన్యం అడవుల నుంచి పొలాల్లోకి వచ్చి మనుషులకు చిక్కాడు. వాడు ఇప్పుడు సందర్శకులను అలరిస్తుంటాడు. సరస్వతి అమ్మ, 61 ఏళ్లు, దాని కూతురు లక్ష్మీ..వాళ్లిద్దరూ చిత్తూరు కుప్పం క్యాంపు నుంచి వచ్చారు. 

మా నలుగురినీ చూసుకోడానికి ఇద్దరు కీపర్లు, ఇద్దరు మావటివాళ్లు ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటలకే వస్తారు. మా చుట్టూ శుభ్రం చేస్తారు, మా ప్రవర్తన గమనిస్తారు.. నేను హుషారుగా ఉన్నానా, ఆహారం తింటున్నానా అని పరిశీలిస్తారు. ఏమైనా తేడా కనిపిస్తే వెంటనే డాక్టర్లకు చెబుతారు. ప్రతి ఆరేళ్లకోసారి కట్టిన కొలనులో నన్ను స్నానం చేయిస్తారు మావటివాళ్లే. 

ఒక్క విషయం నన్ను బాధపెడుతుంది. మా జాతి రోజురోజుకీ తగ్గిపోతోంది. దేశంలో వేల సంఖ్యలో ఉన్న మేము, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 250 కూడా లేము. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, చిత్తూరు అడవుల్లో మిగిలిన నా బంధువులు గుంపులుగా తిరుగుతూ, ఆహారం దొరక్క పొలాల్లోకి వస్తారు. అక్కడ రైతులు మమ్మల్ని శత్రువుల్లా చూస్తారు. కానీ మేము విధ్వంసం కోసం రాము..ఆకలితో వస్తాం. నన్ను చూసుకోవడం మాటలు కాదని జూ అధికారులకు తెలుసు. మమ్మల్ని దత్తత తీసుకోడానికి ఏడాదికి రూ.4.30 లక్షలు అవసరం. 

ఇది పెద్ద మొత్తమే, అందుకే చాలామంది వెనుకాడతారు. కానీ దత్తత తీసుకున్నవారికి ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఇస్తారు, తెలుసా? మంగళవారం ప్రపంచ ఏనుగుల గౌరవ దినోత్సవం. ఆ రోజు జూలో పిల్లలకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు పెడతారు. నా గురించి, నా జాతి గురించి వాళ్లకు చెబుతారు. అది నాకు సంతోషమే. ఎందుకంటే మమ్మల్ని అర్థం చేసుకున్న మనుషులే మా భవిష్యత్తును కాపాడగలరు.

నేను భారీగా, భయంకరంగా కనిపించొచ్చు. కానీ నా మనసులో ఉన్నది కేవలం..బతకాలన్న కోరిక, నా వాళ్లతో ఉండాలన్న ఆరాటం. మీరు ఒక్కసారి నా కళ్లలోకి చూడండి..అక్కడ మీకు కనిపించేది భయం కాదు, జ్ఞాపకాల మౌనం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement