కాకినాడ: మండలంలోని అరట్లకట్ట యూనియన్ బ్యాంక్ కరస్పాండెంట్ నూలు వీరవెంకట రామ త్రిమూర్తి సత్యసతీష్ (32) తన ఇంట్లోని ఫ్యాన్‌కు ఆదివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యానిమేటర్ నాగమణి ఇచ్చిన డ్వాక్రా గ్రూపుల సొమ్ము ఎప్పటికప్పుడు బ్యాంకుకు చెల్లించినా, యానిమేటర్‌తో కలసి యూనియన్ బ్యాంక్ అధికారులు సొమ్ము బకాయి ఉన్నట్టు తనపై లేనిపోని నిందారోపణలు చేశారని వీడియో రికార్డ్ చేసి అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన మరణం తర్వాత నిజానిజాలు తెలుసుకుని తన భార్య, బిడ్డకు న్యాయం చేయాలని సదరు వీడియోలో కోరాడు. మృతుడి భార్య స్వాతి రోజా కథనం ప్రకారం..
అరట్లకట్ట గ్రామంలో సతీష్ తన భార్య స్వాతి రోజాతో డిజిటల్ సెంటర్ నిర్వహిస్తూ, యూనియన్ బ్యాంక్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు. వారికి కుమార్తె మహాలక్ష్మి సౌధ ఉంది. వీరంతా ఈ నెల 20న ఉదయం ఇంద్రపాలెంలో సతీష్ అత్తారింటికి వెళ్లారు. రాత్రి 10:30 గంటలకు సతీష్ అరట్లకట్ట వచ్చేశారు. అతను ఇంట్లో ఉరేసుకున్నట్లు సోమవారం ఉదయం తమ బంధువులు ఫోన్ చేసి చెప్పారని స్వాతి రోజా అన్నారు. దీనికి కారణం యానిమేటర్ నాగమణి, బ్యాంక్‌లో పనిచేస్తున్న సిబ్బందేనని ఆమె ఆరోపించారు.
బ్యాంకు అధికారులు ముందు రూ.20 వేలు కట్టాలని, తర్వాత రూ.1.20 లక్షలు అంటే కట్టారని వివరించింది. అయినా రూ.ఐదు లక్షలు కట్టాలంటున్నారని, తన భర్త చెప్పి బాధపడే వారని రోదించింది. దీనిపై విచారణ జరపి, న్యాయం చేయాలని కరప పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కరప పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


