సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్నా, ఐదు కిలోమీటర్ల పరిధిలో 78 గ్రామాలకు బ్యాంకు సౌకర్యంలేదు. ఈ గ్రామాల ప్రజలు బ్యాంకుకు వెళ్లాలంటే ఐదు కిలోమీటర్లపైన ఉన్న మండలానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే వీటిలో ఇప్పటివరకు ఏడు గ్రామాలకు మాత్రమే బ్యాంకు సౌకర్యం కల్పించారు. మరో 49 గ్రామాలకు బ్యాంకు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మిగిలిన 22 గ్రామాల్లో బ్యాంకుల ఏర్పాటు సాధ్యంకాదని తేల్చారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 15 గ్రామాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకు సౌకర్యంలేదు.
కర్నూలు జిల్లాలో 14 గ్రామాలకు, శ్రీ సత్యసాయి జిల్లాలో 12 గ్రామాలకు, పల్నాడు జిల్లాలో 8 గ్రామా లకు, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో ఐదేసి గ్రామాలకు, ప్రకాశంలో నాలుగు గ్రామాలకు, నెల్లూరు జిల్లాలో మూడు గ్రామాలకు, శ్రీకాకుళం, ఏలూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో రెండేసి గ్రామాలకు, బాపట్ల, చిత్తూరు, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కో గ్రామం చొప్పున ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకు సౌకర్యం లేదు.


