పక్షుల కడుపులో ప్లాస్టిక్‌ కొండ | Discovery of 894 plastic pieces in bird chick stomach | Sakshi
Sakshi News home page

పక్షుల కడుపులో ప్లాస్టిక్‌ కొండ

Sep 22 2026 5:59 AM | Updated on Sep 22 2026 5:59 AM

Discovery of 894 plastic pieces in bird chick stomach

సముద్రంలో తేలియాడే ప్లాస్టిక్‌ తింటున్న పక్షులు

పక్షి పిల్ల కడుపులో 894 ప్లాస్టిక్‌ ముక్కల గుర్తింపు

అధ్యయనంలో వెలుగుచూసిన ఆందోళనకర అంశాలు

భారత్‌ సముద్రాల్లోనూ మైక్రో ప్లాస్టిక్‌ ఆనవాళ్లు

కాలుష్యంతో పాటు తెగిపోయిన వలలు శాపంగా మారుతున్న వైనం

సాక్షి, అమరావతి: ప్లాస్టిక్‌ కాలుష్యం మూగజీవుల పాలిట పెనుముప్పుగా మారుతోంది. సముద్రంలో తేలియాడే ప్లాస్టిక్‌ను ఆహారంగా భావిస్తున్న పక్షులు.. చివరకు వాటినే తమ పిల్లలకు ఆహారంగా అందిస్తున్నాయి. ఆస్ట్రేలియాకు తూర్పున టాస్మాన్‌ సముద్రంలో ఉన్న లార్డ్‌ హోవ్‌ దీవిలో సేబుల్‌ షియర్‌ వాటర్‌ పక్షులపై 2010 నుంచి 2026 వరకు శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్ట్రేలియాకు చెందిన జెన్నిఫర్‌ ఎల్‌.లేవర్స్, అలిక్స్‌ ఎం.డి. జెర్సీ, జాక్‌ రివర్స్‌–ఆటీ, అలెగ్జాండర్‌ ఎల్‌.బాండ్‌ నేతృత్వంలోని పరిశోధక బృందం పక్షి పిల్లల్లో ప్లాస్టిక్‌ ఆనవాళ్లపై 16 ఏళ్లుగా సేకరించిన సమాచారాన్ని తాజాగా వెల్లడించింది.

పక్షి పిల్లల్లోనూ వందల కొద్దీ ప్లాస్టిక్‌ ముక్కలు
ఆ శాస్త్రవేత్తల బృందం 2025లో ఓ పక్షి పిల్లను పరి­శీలించగా.. దాని కడుపులో 894 ప్లాస్టిక్‌ ముక్కలు బయ­టపడ్డాయి. వాటి బరువు 64.21 గ్రాములు. 2026లో మరో పక్షి కడుపులో 644 ముక్కలు ఉండగా.. వాటి బరువు 67.4 గ్రాములుగా గుర్తించారు. 75 నుంచి 85 శాతం సముద్ర పక్షుల్లో ప్లాస్టిక్‌ ఉన్నట్టు గు­ర్తించారు. ఒక్కో పక్షి కడుపులో ఉన్న ప్లాస్టిక్‌ ముక్కల సంఖ్య, వాటి మొత్తం బరువు ఇటీవల సంవత్సరాల్లో వేగంగా పెరిగింది. 2012లో ఓ పక్షి కడుపులో 276 ప్లాస్టిక్‌ ముక్కలు ఉండగా.. వాటి బరువు 64.1 గ్రాములు. దాదాపు దశాబ్దం పాటు ఇదే అత్యధికంగా నమోదైంది. అయితే, 2023లో 403 ముక్కలు, 2024లో 407 ముక్కలు గుర్తించారు. 2025లో ఏకంగా 894 ము­క్క­లు బయటపడటంతో గత రికార్డులన్నీ బద్దలయ్యా­యి. 2026లో మరో పక్షి కడుపులో 644 ముక్కలు గుర్తించినా.. వాటి బరువు 67.4 గ్రాములు ఉండటం మరో ఆందోళనకర అంశం అని పరిశోధకులు పేర్కొన్నారు.

చేపలు దొరక్క.. ప్లాస్టిక్‌ వైపు
సేబుల్‌ షియర్‌ వాటర్‌ పక్షులు పిల్లలకు ఆహారం అందించేందుకు టాస్మాన్‌ సముద్రంలో చాలా దూరం వెళ్తాయి. ఒక్కోసారి ఆహారం కోసం 3 నుంచి 11 రోజుల వరకు సముద్రంపై సంచరిస్తాయి. ఈ సమయంలో చేపలు దొరక్క తేలియాడే వస్తువులను ఆహారంగా పొరబడే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. ఆకలితో ఉన్న పెద్ద పక్షులు ప్లాస్టిక్‌ను ఆహారంగా భావించి మింగి.. తిరిగి తమ పిల్లలకు అందించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఒకసారి అందించే ఆహారంలో 30 ప్లాస్టిక్‌ ముక్కలు?
2025లో 894 ప్లాస్టిక్‌ ముక్కలు మింగిన పక్షి విషయంలో పరిశోధకులు మరో ఆసక్తికరమైన అంచనా వేశారు. ప్లాస్టిక్‌.. పక్షికి ఆహారంతో పాటు ఒకే స్థిరమైన రేటులో అందిందని భావిస్తే.. పిల్లకు అందే ప్రతి ఆహార సరఫరాలో సుమారు 30 ప్లాస్టిక్‌ ముక్కలు ఉండి ఉండవచ్చని అంచనా వేశారు. ప్లాస్టిక్‌ కాలుష్యం సముద్ర పక్షుల ఆహార వ్యవస్థలో ఎంతగా భాగమైందో ఈ అధ్యయనం వెల్లడించింది.

పక్షుల ఆరోగ్యం గుల్ల
ప్లాస్టిక్‌ తినడం, పక్షుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. కడుపు, ఇతర అవయవాలపై మచ్చలు ఏర్పడటం, శరీరం తీవ్రంగా క్షీణించడం, రెక్కల ఎదుగుదల దెబ్బ తినడం వంటి సమస్యలు వస్తున్నట్టు గుర్తించారు. గత దశాబ్దంతో పోలిస్తే పక్షి పిల్లల బరువు సుమారు 25 శాతం తగ్గినట్లు అధ్యయనం పేర్కొంది.

బాటిల్‌ మూతలు.. ప్లాస్టిక్‌ గుళికలు
పక్షుల కడుపుల్లో కనిపించిన ప్లాస్టిక్‌లో బాటిల్‌ మూ­తలు, పారిశ్రామిక ప్లాస్టిక్‌ గుళికలు (నర్డిల్స్‌) కూ­డా ఉన్నాయి. 2012లోనే బాటిల్‌ మూతలు, న­రి­్డల్స్‌ ఒక్కొక్కటి మొత్తం ప్లాస్టిక్‌ ముక్కల్లో సు­మారు 4 శాతం చొప్పున ఉన్నాయి. 2025 నాటికి ఈ రెండూ కలిపి 5.7 శాతాన్ని దాటాయని వెల్లడించారు. ముఖ్యంగా 2024 నుంచి 2026 మధ్య బాటిల్‌ మూతలు, ప్లాస్టిక్‌ గుళికల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల నమోదైనట్టు పేర్కొన్నారు.

భారత్‌కూ హెచ్చరిక
ఆస్ట్రేలియాలో వెల్లడైన సముద్ర ప్లాస్టిక్‌ కాలుష్యం భారత్‌కూ హెచ్చరికగా నిలుస్తోందని శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. భారత సముద్రాల్లోనూ మైక్రో ప్లాస్టిక్‌ కాలుష్యంపై పరిశోధనలు ఇప్పటికే ఆందోళనకర విషయాలను వెల్లడించాయి. అరేబియా సముద్రంలో సూక్ష్మ సముద్ర జీవుల్లో మైక్రో ప్లాస్టిక్‌ కణాలు గుర్తించినట్టు పరిశోధకులు వెల్లడించారు. సముద్రంలో పడేసిన ప్లాస్టిక్‌ అక్కడితో ఆగిపోకుండా.. చిన్న సముద్ర జీవుల నుంచి పెద్ద జీవుల వరకు అన్నిటికీ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.

‘ఘోస్ట్‌ గేర్‌’ గండం
చేపలు పట్టేందుకు ఉపయోగించే వలలు సైతం సముద్ర జీవులతో పాటు పక్షులకు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. తెగిపోయిన, పనికిరాక పారేసిన వలలు, తాళ్లు, ఉచ్చులు, ఫిషింగ్‌ లైన్లు సముద్రంలో ఏళ్ల తరబడి ఉండటంతో వాటిలో చిక్కుకుని జీవులు విలవిల్లాడుతున్నాయి. దీన్నే ‘అబాండన్డ్, లాస్ట్‌ అండ్‌ డిస్కార్డెడ్‌ ఫిషింగ్‌ గేర్‌’ లేదా ‘ఘోస్ట్‌ గేర్‌’ అంటారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. భారత్‌లో ఉన్న 11,098 కిలోమీటర్ల తీరరేఖ వెంబడి చేపల వేటకు ఉపయోగించే నైలాన్, పాలిథిన్‌ వలల వ్యర్థాల్లో చేపలు, తాబేళ్లు, సముద్ర పక్షులు, ఇతర జీవులు చిక్కుకుని మృత్యువాత పడే ప్రమాదం ఉందని హెచ్చరించాయి.

మరోవైపు నౌకల రాకపోకలకు కూడా ఇవి అడ్డంకిగా మారుతున్నాయని గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 6.4 లక్షల టన్నుల ఫిషింగ్‌ గేర్‌ పోతున్నట్టు అంచనా. సముద్ర వ్యర్థాల్లో చిరిగిపోయిన వలల వాటా సుమారు 10 శాతం వరకు ఉంటుందని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement