ఉత్సవ కమిటీ సభ్యులపై కర్రలతో దాడి చేస్తున్న కొల్లి శేషు, ఆయన వర్గీయులు
పెనుమాకలో అర్ధరాత్రి అరాచకం
వైఎస్సార్‌సీపీ శ్రేణులతోపాటు రెడ్డి సామాజిక వర్గీయులపై దాడులు
కర్రలు, రాడ్లు, కారం, మందు బాటిళ్లతో వీరంగం
తాడేపల్లి రూరల్: విద్యాశాఖ మంత్రి, సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, ఆ పార్టీ రౌడీషీటర్లు రెచ్చిపోయారు. గణేశుడి గ్రామోత్సవాన్ని అడ్డుకుని కర్రలు, రాడ్‌లు, మద్యం సీసాలతో దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు, రెడ్డి సామాజిక వర్గీయులే లక్ష్యంగా అర్ధరాత్రి నుంచి 4 గంటలపాటు అరాచకం సృష్టించారు. సీఐ వీరేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు సైతం వత్తాసు పలకడంతో టీడీపీ రౌడీల ఆగడాలకు అడ్డులేకుండా పోయింది.
తాడేపల్లి మండలం పెనుమాకలో వినాయకుడి గుడివద్ద రెడ్డి సామాజిక వర్గం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గణేశ్ నిమజ్జనం ఏర్పాట్లు చేసుకున్నారు. స్వామివారి గ్రామోత్సవం పంచాయతీ కార్యాలయం వద్దకు రాగా.. అప్పటికే దారికాచిన టీడీపీ మండల ఉపాధ్యక్షుడు కొల్లి శేషు ఆధ్వర్యంలో అల్లరిమూకలు ఊరేగింపును అడ్డుకుని గొడవకు దిగారు. తిరుగు ప్రయాణంలో కొల్లి శేషు ఆధ్వర్యంలో తాడేపల్లి, ప్రకాష్ నగర్ ప్రాంతాల నుంచి వచి్చన రౌడీషిటర్లు భారీగా అల్లరి మూకలు గణేశ్ ఊరేగింపును మళ్లీ అడ్డుకున్నాయి. పోలీసులు కూడా ముందుకు వెళ్లడానికి వీల్లేదంటూ హల్‌చల్ చేశారు. కమిటీ సభ్యులపై సీఐ బూతులతో విరుచుకుపడ్డారు.
ధర్నాకు దిగిన ఉత్సవ కమిటీ సభ్యులు
పోలీసులు, టీడీపీ రౌడీమూకల ఆగడాలకు నిరసనగా కమిటీ సభ్యులైన పెనుమాక సొసైటీ చైర్మన్ గోవిందరెడ్డి, మిగిలిన సభ్యులు ధర్నాకు దిగారు. దీంతో రెచి్చపోయిన టీడీపీ మూకలు కర్రలు, రాడ్‌లు, కారంతో వెంటాడుతూ చితకబాదారు. టీడీపీ నాయకుడు కొల్లి శేషు రోడ్డుపై కారు అడ్డుపెట్టి రెడ్డి సామాజిక వర్గీయులను దుర్భాషలాడారు. సీఐ టీడీపీ శ్రేణులు, టీడీపీ రౌడీలను నియంత్రించకుండా ఉత్సవ కమిటీ సభ్యులపై పలుమార్లు లాఠీచార్జి చేయడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉండవల్లిలో కొండవీటి వాగు వద్ద విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుంటే, కొల్లి శేషు కొందరు రౌడీషిటర్లతో ఆ ప్రాంతానికి చేరుకుని వైఎస్సార్‌సీపీ శ్రేణులను, రెడ్డి సామాజిక వర్గీయులను కవి్వస్తూ దుర్భాషలాడారు. అక్కడ ఉన్న పోలీసులు కట్టడి చేయకపోగా కొల్లి శేషుకు వత్తాసు పలికారు.


