టీడీపీ నేతకు కష్టాలు
● ఖాళీ స్థలానికి పన్ను వేసేందుకు
రూ.30 వేలు డిమాండ్
● గొట్టాల రోడ్డు బాధితుడి ఆవేదనతో
జీఎంసీ అవినీతి బట్టబయలు
● ‘పై అధికారులకు ఇవ్వాలి’ అంటూ
దర్జాగా డిమాండ్ చేస్తున్న సిబ్బంది
● లంచాల మత్తులో మునిగిపోయిన రెవెన్యూ విభాగం
నెహ్రూనగర్: అధికారానికే దిక్కులేదు. కూటమి నేతలను పీడిస్తున్నారు. పనులు కావాలంటే పైసాలు పడాల్సిందే. ఇదీ గుంటూరు నగర కార్పొరేషన్‌లో తీరు. నిబంధనల ప్రకారం కార్పొరేషన్‌కు పన్ను కడతామని దరఖాస్తు చేసుకున్నా, అధికారులు మాత్రం ‘ముందు మా జేబులు నింపితేనే మీ స్థలానికి పన్ను వేస్తాం’ అంటూ నిస్సిగ్గుగా డిమాండ్ చేయండంతో టీడీపీ నేత ఒకరు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు.
అధికారానికి కనికరం లేదు!
గొట్టాల రోడ్డు, జామియా నగర్ మదర్సా సమీపంలో ఉన్న 218 గజాల ఖాళీ స్థలానికి వీఎల్‌టీ(ఖాళీ స్థలం పన్ను) అసెస్‌మెంట్ కోసం బట్టా ప్రసాద్ అనే వ్యక్తి సచివాలయాన్ని ఆశ్రయించారు. అయితే, 17వ వార్డు సచివాలయ అడ్మిన్ సెక్రటరీ ఏకంగా రూ.30 వేలు ఇస్తేనే పని జరుగుతుందని తేల్చి చెప్పారు. తాను అధికార టీడీపీలో నాయకుడినని, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పక్కన తిరుగుతానని నిబంధనల ప్రకారం పని చేయాలని ఎంత బతిమాలినా సదరు ఉద్యోగి కనికరించలేదు. ‘నువ్వు ఏ పార్టీ నేతవైతే మాకేంటి? పై అధికారులకు వాటాలు ఇవ్వాలి.. ట్యాక్స్ వేయాలంటే లంచం కట్టాల్సిందే’ అంటూ తగ్గలేదు. సొంత పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ సిబ్బంది వేధింపులు భరించలేక సదరు నాయకుడు సోమవారం జీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.
ఇక సామాన్యుల పరిస్థితేంటి..
అధికార పార్టీకి చెందిన నాయకుడి వద్దే ఇంత దర్జాగా రూ.30 వేలు డిమాండ్ చేశారంటే.. ఎలాంటి పలుకుబడి లేని సామాన్య, మధ్యతరగతి ప్రజలను లంచాల కోసం ఏ స్థాయిలో పీడిస్తున్నారో ఊహించుకోవచ్చు. ఇళ్ల నిర్మాణ అనుమతులు, ట్యాప్ కనెక్షన్లు, ఖాళీ స్థలాల పన్నుల కోసం జీఎంసీ, సచివాలయాల చుట్టూ తిరిగే సాధారణ పౌరులను నిలువునా దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడిగినంత ముట్టజెప్పకపోతే ఫైళ్లను నెలల తరబడి తొక్కిపెట్టి మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు..
నగరంలో అధికారిక లెక్కల ప్రకారమే 10,110 ఖాళీ స్థలాలకు రూ.121.39 కోట్ల డిమాండ్ ఉండగా, కేవలం రూ.84 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. వేల సంఖ్యలో ఉన్న స్థలాలను పన్ను పరిధిలోకి తెస్తే కార్పొరేషనన్‌కు వందల కోట్ల ఆదాయం వస్తుంది. కానీ రెవెన్యూ అధికారులు, అడ్మిన్ సెక్రటరీలు ఖాళీ స్థలాల యజమానులతో కుమ్మకై ్క.. పన్ను వేయకుండా వదిలేసేందుకు వేల నుంచి లక్షల్లో లంచాలు దండుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. పైగా ఎవరైనా నేరుగా వచ్చి పన్ను వేయమన్నా లంచాలు అడుగుతున్నారు. ఈ కమీషన్ల దందా కింది స్థాయి నుంచి పై అధికారుల దాకా చేరుతుండటంతోనే.. ఎవరైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా రాజీ ప్రయత్నాలు చేసి రెవెన్యూ సిబ్బందిని కాపాడుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.


