పోలీసులు కొట్టడం వల్లే సాయికృష్ణ బలి | Sai Krishna died due to police assault: SIT charge sheet in lock-up death case | Sakshi
Sakshi News home page

పోలీసులు కొట్టడం వల్లే సాయికృష్ణ బలి

Sep 22 2026 5:43 AM | Updated on Sep 22 2026 5:43 AM

Sai Krishna died due to police assault: SIT charge sheet in lock-up death case

లాకప్‌డెత్‌ కేసులో సిట్‌ ఛార్జిషిట్‌ 

కృష్ణలంక సీఐ నాగరాజు సహా ఏడుగురు నిందితులు 

శ్మశానవాటికలో రహస్యంగా దహనం చేసిన ప్రదేశం గుర్తింపు 

సాక్షుల వాంగ్మూలాలు, ఆధారాలు న్యాయస్థానంలో సమర్పణ

విజయవాడ లీగల్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు గాదె సాయికృష్ణను పోలీసులు అక్రమంగా నిర్బంధించి, తీవ్రంగా కొట్టడం వల్లే మరణించాడని సిట్‌ నిర్ధారించింది. సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో సిట్‌ అధికారులు సోమవారం 2వ అదనపు జ్యుడీ­షియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో చార్జి­షీటు దాఖలు చేశారు. కృష్ణలంక మాజీ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ఎస్‌వీవీ నాగరాజుతో పాటు మొత్తం ఏడుగురు నిందితులపై తీవ్ర ఆరోపణలను నమో­దు చేశారు.

 పోలీసుల దాడిలోనే సాయికృష్ణ మరణించాడని చార్జిషీటులో పేర్కొన్నారు. సాయికృష్ణ మిస్సింగ్‌  నుంచి మరణం వరకు చోటుచేసుకున్న పరిణామాలను ఇందులో స్పష్టంగా వివరించారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపణల తరువాత కృష్ణలంక పోలీసులు వ్యవహరించిన తీరు కూడా చార్జిషిటులో పేర్కొన్నారు. సిట్‌ విచారణాధికారి స్వయంగా హాజరై న్యాయస్థానంలో చార్జిషీటు దాఖలు చేశారు.  

నాగరాజే ప్రధాన నిందితుడు 
ఈ కేసులో ప్రధాన నిందితుడు అప్పటి సీఐ నాగరాజు ఆదేశాల మేరకు ఇతర నిందితులు సాక్ష్యా­­లను తారుమారు చేయడంలో ముఖ్యపాత్ర వహించారని పేర్కొన్నారు. నాగరాజు స్నేహి­తుడు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, ఏ–4 నిందితుడు గులివిందుల సురేష్‌ రాణిగారితోటలో పాడుబడ్డ భవనంలో గాదె సాయికృష్ణను చూసినట్టు సురేష్‌ రిమాండ్‌ రిపోర్టులో సిట్‌ అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే. సాయికృష్ణ మృతదేహాన్ని స్వర్గపురికి తరలించి, అనంతరం రహస్యంగా దహనం చేశారని పేర్కొన్నారు. మృతదేహాన్ని తరలించిన రెండు వాహనాలను సీజ్‌ చేసినట్టు తెలిపారు. 

శ్మశాన­వాటికలో సాయికృష్ణను దహనం చేసిన ప్రదేశా­న్ని గుర్తించినట్టు చార్జిషీటులో పొందుపరిచారు. సాయికృష్ణ హత్య కేసులో ఇప్పటివరకు పోలీసులు ఏడుగురి ప్రమేయం ఉన్నట్టు పేర్కొంటూ వారి అరెస్టు, కస్టడీలోని అంశాలు, అందుకు సంబంధించిన ఫోరెన్సిక్‌ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలతో చార్జిషిటును విచారణాధికారి న్యాయస్థానంలో సమర్పించారు. పోలీసు స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీ, హార్డ్‌ డిస్క్ లను డిలీట్‌ చేశారని, అలాగే సాయికృష్ణ కస్టడీలో ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను ఫోన్ల నుంచి తొలగించారని సిట్‌ ఆధారాలను సమర్పించింది. సాయికృష్ణ పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుని గోవా పారిపోయాడనే తప్పుడు కథనాన్ని సృష్టించేందుకు అతని మొబైల్‌ ఫోన్‌ను గోవా పంపించి డ్రామా ఆడారని దర్యాప్తులో తేలింది. 

బెయిల్‌పై విచారణ వాయిదా 
సాయికృష్ణ అదృశ్యం కేసులో రిమాండ్‌లో ఉన్న ఏ–7 నిందితుడు వెంకటరాజు తరఫున న్యాయవాది జి.సాంబశివరావు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. న్యాయమూర్తి సెలవులో ఉన్నందున బెయిల్‌ పిటిషన్‌పై ఇరుపక్షాల విచారణ నిమిత్తం 8వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఈనెల 23వ తేదీకి వాయిదా వేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement