గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) ద్వారా ప్రజల నుంచి అందే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి తావులేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదుల పరిష్కారంలో ప్రజా సంతృప్తిని ప్రధాన ప్రామాణికంగా తీసుకుని, గ్రీవెన్స్ పరిష్కారంలో జిల్లాను రాష్ట్రంలో ముందంజలో నిలపడానికి అధికారులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, జేసీ ఇలక్కియ, డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహంతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి అందిన అర్జీని కేవలం రికార్డుల్లో పరిష్కరించినట్లు చూపించడం కాకుండా, అర్జీదారుని సమస్య వాస్తవంగా పరిష్కరించబడిందా? అర్జీదారు ఆ పరిష్కారంతో సంతృప్తి చెందారా? అనే అంశాలే అర్జీ పరిష్కారానికి అసలు గీటురాయిగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్జీ పరిష్కార ప్రక్రియలో అధికారులు కేవలం కార్యాలయాల్లో ఫైళ్లను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం కాకుండా, అవసరమైన సందర్భాల్లో క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించాలని సూచించారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు, సర్వేయర్లు తదితర అధికారులు అర్జీలపై సమగ్రంగా విచారణ చేపట్టి, అవసరమైతే సంబంధిత ప్రాంతాలను స్వయంగా సందర్శించాలని కలెక్టర్ సూచించారు. అర్జీల పరిష్కారంలో ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.
పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేయాలి: ఏఐవైఎఫ్
పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 11వేల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ కార్యకర్తలు పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు పూర్తి స్థాయి నోటిఫికేషన్ ఇవ్వాలని అర్జీ ద్వారా కలెక్టర్‌ను కోరారు. అర్జీ అందజేసిన వారిలో లంకా గోవిందరాజులు, యుగంధర్ తదితరులు ఉన్నారు.


