ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ప్రత్యేక సేవా టికెట్ల పేరిట నకిలీ టికెట్‌ను రూపొందించి విక్రయించిన సైబర్ నేరస్తుడిని అరెస్టు చేసినట్లు సైబర్ క్రైం డీసీపీ కృష్ణప్రసన్న తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితుడి వివరాలను డీసీపీ కృష్ణప్రసన్న మీడియాకు వివరించారు. గుంటూరుకు చెందిన వంగల రాజేష్ నకిలీ పత్రాలు తయారు చేసి విక్రయిస్తుంటాడు. హైదరాబాద్‌లో రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని తెలిసిన వారి నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో రాజేష్ నిందితుడు. గతంలో ఇతనిపై హైదరాబాద్‌లో కేసు నమోదయింది. దసరా ఉత్సవాల ప్రత్యేక ఆర్జిత సేవా టికెట్ కావాలని కావలికి చెందిన భక్తురాలు రాజేష్‌తో రూ.3500కు ఒప్పందం కుదుర్చు కుంది. నిందితుడు ఆన్‌లైన్‌లో నమూనా టికెట్ ను డౌన్‌లోడ్ చేసి, మొబైల్ ఎడిటింగ్ యాప్‌ను ఉపయోగించి భక్తురాలి పేరు, తేదీలతో నకిలీ టికెట్ తయారు చేసి ఆమెకు పంపాడు. అయితే టికెట్‌పై దేవస్థాన ధ్రువీకరణ క్యూఆర్ కోడ్, అధికారి సంతకం లేకపోవడాన్ని గుర్తించి వెంటనే దేవస్థాన అధికారులకు టికెట్‌ను పంపారు. ఆలయ అధికారులు వెంటనే అప్రమత్తమై సీపీ రాజశేఖరబాబుకు ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడి జాడను టెక్నికల్ ఎనాలసిస్ ద్వారా తెలుసుకుని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు అతని వద్ద నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, ఇతర నకిలీ గుర్తింపు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భక్తులు దసరా ఉత్సవాల సేవా, దర్శన టికెట్లను దేవస్థాన అధికారిక కౌంటర్లు, వెబ్‌సైట్ ద్వారానే కొనుగోలు చేయాలని సూచించారు. వాట్సాప్ ద్వారా ఫార్వర్డ్ అయిన టికెట్లు, అనధికార వ్యక్తుల నుంచి టికెట్లు కొనుగోలు చేయవద్దని సూచించారు. అనుమానాస్పద టికెట్లు, ఆఫర్లు కనిపిస్తే వెంటనే దేవస్థాన అధికారులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. సమావేశంలో ఏసీపీ భానుప్రకాష్‌రెడ్డి, ఎస్‌ఐ రామకృష్ణ పాల్గొన్నారు.


