ప్రభుత్వ కార్యాలయమా.. పార్టీ ఆఫీసా? | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కార్యాలయమా.. పార్టీ ఆఫీసా?

Sep 22 2026 5:22 AM | Updated on Sep 22 2026 5:22 AM

ప్రభుత్వ కార్యాలయమా.. పార్టీ ఆఫీసా?

శాప్‌ కార్యాలయంలోనే యువగళం సభ్యుల మకాం శాప్‌ చైర్మన్‌ డైరెక్షన్‌లో డీఎస్సీ–2025 ఉపాధ్యాయులు వైఎస్సార్‌ సీపీని రెచ్చగొట్టేలా నినాదాలు...ప్లకార్డుల ప్రదర్శనలు

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్ర ప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) కార్యాలయం సోమవారం టీడీపీ కార్యాలయంగా మారింది. డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలను శాప్‌ అధికారులకు వివరించి వారి నుంచి సమాధానం రాబట్టేందుకు వైఎస్సార్‌ సీపీ చేపట్టిన శాంతియుత ర్యాలీ, అనంతరం శాప్‌ అధికారులకు వినతిపత్రం అందజేసే కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి శాప్‌ చైర్మన్‌ రవినాయుడు ఈ విధంగా ప్రభుత్వ కార్యాలయాన్ని పార్టీ కార్యాలయంగా మార్చివేశారు. శాప్‌ కార్యాలయం ఆవరణలోనే షామియానాలు, కుర్చీలు వేసి యువగళం సభ్యులను, అదేవిధంగా డీఎస్సీ–2025 ఉపాధ్యాయులను మోహరించారు. శాప్‌ చైర్మన్‌ అనుసరించిన తీరుతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది.

కుట్ర జరిగిన తీరుతెన్నులిలా...

విద్యాశాఖా మంత్రి లోకేష్‌ మెప్పు పొందేందుకు శాప్‌ చైర్మన్‌ రవినాయుడు డీఎస్సీ–2025లో ఉద్యోగాలు పొందిన వారితో నగరంలో ఆదివారం ప్రత్యేకంగా రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం వారికి భోజనాలు, రాత్రికి బస ఏర్పాటు చేసి నగరంలోనే ఉంచారు. సోమవారం ఉదయం వారందరినీ బస్సులు, కారుల్లో వారు బస చేసిన హోటల్‌ నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం ఆవరణలోని శాప్‌ కార్యాలయానికి తీసుకువచ్చారు. కార్యాలయ ఆవరణలోనే షామియానాలు, కుర్చీ లు, డీజే స్థాయిలో మైక్‌సెట్‌ ఏర్పాటు చేశారు. నగరంలో సెక్షన్‌ 30 అమలులో ఉందని అందు వల్ల వైఎస్సార్‌ సీపీ నాయకులు చేపట్టిన శాంతియుత ర్యాలీకి అనుమతి ఇవ్వలేమని ప్రకటించిన పోలీస్‌ శాఖకు శాప్‌ కార్యాలయం ఆవరణలో జరుగుతున్న ఈ వ్యవహారం పాపం... వారి కంటికి కనిపించలేదో... లేదా టీడీపీ వారికి పోలీస్‌ శాఖ విధించిన సెక్షన్‌ 30 నుంచి మినహాయింపు ఉందా అనే సందేహం కలుగుతోంది.

‘శాప్‌’ పరువును క్లీన్‌బౌల్డ్‌ చేసిన

చైర్మన్‌ రవినాయుడు తీరు

క్రీడాకారులకు, క్రీడా సంఘాలకు అందుబాటులో ఉండాల్సిన శాప్‌ కార్యాలయాన్ని టీడీపీ కార్యాలయంగా మార్చి శాప్‌ పరువును చైర్మన్‌ రవి నాయుడు రోడ్డున పడేశాడనే (క్లీన్‌ బౌల్డ్‌) అభిప్రాయం ఇప్పటికే క్రీడాకారుల్లో వినిపిస్తోంది. శాప్‌ కార్యాలయం ఆవరణలో సోమవారం జరిగిన పరిణామాలు ఈ అభిప్రాయానికి మరింత బలాన్ని చేకూర్చాయి. శాప్‌ కార్యాలయం ఆవరణలో డీఎస్సీ అభ్యర్థులతో ఆందోళన చేయించడమే కాకుండా వైఎస్సార్‌ సీపీ శాంతియుతంగా చేపట్టిన కార్యక్రమంపైకి టీడీపీ యువగళం సభ్యులను పంపి దాడి చేయించడం ఇందుకు నిదర్శనం. టీడీపీ యువత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్లగూర సాయి చరణ్‌, తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సొంగా సంజయ్‌, శాప్‌ డైరెక్టర్‌ సంతోష్‌తో పాటుగా యువగళం ప్రతినిధులు శాప్‌ కార్యాలయం ఆవరణలోనే ఉండి డీఎస్సీ–2025 టీచర్లకు డైరెక్షన్‌ ఇవ్వడం గమనార్హం.

వెనక్కు తగ్గని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

డీఎస్సీ–2025 ఉపాధ్యాయుల ముసుగులో టీడీపీ గూండాలు బందరు రోడ్డుపై శాంతి యుతంగా నిరసన చేస్తున్న వైఎస్సార్‌ సీపీ నాయకులపై కర్రలతో దాడులు, వాటర్‌ బాటిల్స్‌ విసురుతూ, జగన్‌ను విమర్శిస్తూ నినాదాలు ఇస్తున్నా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు మాత్రం శాంతియుతంగానే సమాధానం చెప్పారు. ఉదయం 10 గంటలకు మొదలైన నిరసన కార్యక్రమం మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ ఒక్క వైఎస్సార్‌ సీపీ నాయకుడు, కార్యకర్త టీడీపీ గూండాల దాడులకు వెనక్కు తగ్గకుండా కార్యక్రమం పూర్తయ్యేంత వరకు అక్కడే ఉన్నారు. డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.

ఆ నాలుగు ఎల్లో చానల్స్‌కే అనుమతి

శాప్‌ కార్యాలయం ఆవరణలో డీఎస్సీ ఉపాధ్యాయులతో మాట్లాడేందుకు ఎవరినీ వారి దగ్గరకు అనుమతించలేదు. కేవలం ఎల్లో చానల్స్‌గా పేరు పొందిన ఆ నాలుగు చానల్స్‌ ప్రతినిధులను మాత్రమే పోలీసులు లోపలకు అనుమతించారు. మిగిలిన చానల్స్‌ ప్రతినిధులు రోడ్డుపైనే నిలబడాల్సిన పరిస్థితి. డీఎస్సీ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా బ్యాడ్జీలను తయారు చేయించారు. ఆ బ్యాడ్జీలు ఉన్న వారిని మాత్రమే లోపలకు అనుమతించారు.

శాప్‌ కార్యాలయం గేటు లోపల డీఎస్సీ ఉపాధ్యాయులు,

గేటు బయట వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

ర్యాలీగా వస్తున్న వైఎస్సార్‌ సీపీ వికలాంగ విభాగం నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement