జరిగిన ఘటనను వివరిస్తున్న నివేదిత
గుంతకల్లులో పట్టపగలే సినీ ఫక్కీలో దుండగుల బీభత్సం
40 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు అపహరణ
ఆధారాలు లభించకుండా కారంపొడి చల్లిన వైనం
గుంతకల్లు: బందిపోటు దొంగలను తలదన్నేలా పట్టపగలే ఇంట్లోకి చొరబడి దోచుకున్న ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గుంతకల్లులోని కసాపురం రోడ్డులో డిగ్రీ కళాశాల వెనుక వైపు గల కోయనగర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మనోజ్‌కుమార్, నివేదిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఏడాదిలోపు పాప ఐశ్వర్య ఉంది. వీరి ఇంటికి సమీపంలోనే మనోజ్‌కుమార్ తల్లిదండ్రులు వెంకటేష్ , పద్మావతి నివాసం ఉంటున్నారు. ఉద్యోగరీత్యా మనోజ్ ఆదివారం హైదరాబాద్ వెళ్లాడు. వ్యక్తిగత పనుల కారణంగా తండ్రి వెంకటేష్ వేరే ఊరికి వెళ్లాడు. దీంతో తమ వద్ద ఉన్న మొత్తం బంగారాన్ని తీసుకుని కోడలికి తోడుగా ఉండేందుకు పద్మావతి కుమారుడు మనోజ్ ఇంటికి వచ్చింది.
ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 4గంటల సమయంలో ముగ్గురు యువకులు ముఖానికి మాసు్కలు ధరించి, చేతికి గ్లౌజులు వేసుకుని హఠాత్తుగా మనోజ్ ఇంట్లోకి చొరబడ్డారు. వచ్చిరాగానే మనోజ్ భార్య నివేదిత గొంతును టవల్‌తో బిగించారు. నివేదిత కుమార్తె అయిన పసిపాప ఐశ్వర్య గొంతుపై కత్తి పెట్టారు. బెడ్‌రూమ్‌లో నిద్రిస్తున్న పద్మావతి అలికిడికి లేచి వస్తుండగా ఆమెను లోపలికి నెట్టి బెడ్‌రూమ్‌కు గడియ బిగించారు. బెదిరిపోయిన నివేదిత మంగళసూత్రంతో పాటు గొలుసు, చేతికి వేసుకున్న బంగారు గాజులు ఇచ్చేసింది.
బీరువా సైతం తెరవాలని ఆమెను దొంగలు చితకబాదారు. చేతిపై కత్తితో గాట్లు పెట్టారు. బీరువా తెరవకపోతే చిన్నపాపను చంపేస్తామని గొంతుపై కత్తిపెట్టి మరీ బెదిరించారు. ఈ క్రమంలో చేసేదేమీ లేక బీరువా తాళం చెవి ఉన్న చోటును దొంగలకు చెప్పింది. దీంతో వారు బీరువాలోని బంగారు నెక్లెస్‌లు, చైన్లు, బ్రాస్‌లెట్లు, రింగులు తదితర మొత్తం 40 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.2 లక్షల నగదు తీసుకున్నారు. దొంగతనం తర్వాత దొంగలు ‘పోలీసు జాగిలాలు వాసన పసిగట్టకుండా’ కారంపొడిని ఇల్లంతా చల్లారు. కసాపురం ఎస్‌ఐ వెంకటస్వామి తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.


