ఐదు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ.. వాయుగుండంగా మారిన అల్పపీడనం
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంవాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది విశాఖ–గోపాలపూర్ మధ్య బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాములోపు తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. పూరీకి 310 కి.మీ, కళింగపట్నంకు 390 కి.మీ, విశాఖకు 470 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉన్నట్లు వివరించింది. దీని ప్రభావంతో 22న ఓ మోస్తరు వర్షాలు, 23, 24 తేదీల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో 23న కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు.
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చారు. 24న కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్.. అల్లూరి, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. మిగిలిన కోస్తా జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఈ మూడ్రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ప్రభుత్వం హెచ్చరించింది. కోస్తా తీరం వెంబడి గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, సోమవారం కాకినాడ జిల్లా శంఖవరంలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.


