విశాఖ తీరంలో హిందూస్థాన్ షిప్‌యార్డు చారిత్రక ఘట్టం
ఒకేసారి సీజీ ప్లాట్‌ఫామ్, ఎల్‌జీటీ నవ్య, సముద్ర రత్నాకర్ నౌకల డాకింగ్
నాలుగు గంటలపాటు సాగిన హైఓల్టేజ్ ఆపరేషన్
సాక్షి, విశాఖపట్నం: సాగర నగరి విశాఖ తీరంలో ఉన్న హిందూస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ (హెచ్‌ఎస్‌ఎల్) చరిత్రలో అరుదైన ఘట్టాన్ని ఆవిష్కరించింది. అత్యంత క్లిష్టమైన షిప్ రిపేర్ సవాల్‌ను హెచ్‌ఎస్‌ఎల్ షిప్ రిపేర్ కాంప్లెక్స్ అధిగవిుంచగలదని ఆదివారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభమైన హైఓల్టేజ్ ఆపరేషన్ చాటిచెప్పింది. షిప్‌యార్డులో ఒకేఒక్క డ్రై డాక్.. కానీ, అందులోకి అడుగుపెడుతున్నవి ఏకంగా మూడు భారీ నౌకలు. ఇండియన్ కోస్ట్‌గార్డ్‌కి చెందిన ‘సీజీ ప్లాట్‌ఫామ్’.. దాని వెనుక భారీ గ్యాస్ క్యారియర్ ‘ఎల్‌జీటీ నవ్య’.. తర్వాత సముద్ర గర్భంలో పరిశోధనలు జరిపే అత్యంత ప్రతిష్టాత్మక వెసల్ ‘సముద్ర రత్నాకర్’ క్యూకట్టి ఉన్నాయి. సాధారణంగా ఒక్క భారీ నౌకను డాక్ చేయడానికే సర్వశక్తులూ ఒడ్డాలి.
అలాంటిది ఈ మూడింటినీ ఒకే ప్రాంగణంలో, ఒకే సమయంలో నిలపడం అంటే కత్తిమీద సామే. ఎందుకంటే.. వాటి మధ్య ఉన్న ఎడం కేవలం నాలుగంటే నాలుగు మీటర్లు మాత్రమే. ఏ చిన్న అల తాకినా, అనుకోని గాలివాటం వచ్చినా వేల టన్నుల నౌకలు పరస్పరం ఢీకొంటే పెను ప్రమాదం సంభవించేది. దీనికితోడు.. ‘సముద్ర రత్నా కర్’ అడుగుభాగానికి, నేల కాంక్రీట్ ఫ్లోర్‌కి మధ్య ఉన్న వ్యత్యాసం.. కేవలం 40 సెంటీమీటర్లే. లెక్కల్లో ఒక్క సెంటీమీటర్ తేడా వచ్చినా నౌక కిందభాగం ధ్వంసమై.. పెద్ద ప్రమాదమే సంభవిస్తుంది. కానీ, ఎక్కడా ఎలాంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా డాక్‌మాస్టర్ ఏజీఎం శ్యాంసుందర్ సారథ్యంలో ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేశారు.
నాలుగు గంటలపాటు ఆపరేషన్..
భారీ డాక్ బ్లాకులను ఎక్కడా టైమింగ్ మిస్సవ్వకుండా నీటి లోపల అమర్చారు. భారీ తాళ్లు బిగిస్తూ, నౌకల కదలికలను సెంటీమీటర్ల వారీగా నియంత్రిస్తూ నీటి మట్టాన్ని క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. ఏ చిన్న పొరపాటు జరిగినా.. వందల కోట్ల నష్టం వాటిల్లేది. కానీ, ఎక్కడా ఎలాంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా ఈ మూడు భారీ నౌకల్ని ఖచ్చితమైన ప్రాంతాల్లో ల్యాండ్ చేశారు. నాలుగు గంటలపాటు సాగిన ఈ సంక్లిష్టమైన ఆపరేషన్‌పై ఒకానొక దశలో అందరూ టెన్షన్‌తో ఊపిరిబిగబట్టారు. చివరికి.. ఆపరేషన్ విజయవంతం కావడంతో ఒక్కసారిగా హర్షధ్వానాలతో షిప్‌యార్డు డాక్ ప్రాంతం మొత్తం మార్మోగిపోయింది. దీంతో.. అత్యంత క్లిష్టమైన షిప్ రిపేర్ సవాళ్లను సైతం హెచ్‌ఎస్‌ఎల్ షిప్ రిపేర్ కాంప్లెక్స్ అధిగవిుంచగలదని ఈ ఆపరేషన్ చాటిచెప్పిందని సీఎండీ రియర్ అడ్మిరల్ చంద్రశేఖరన్ రఘురామ్ వెల్లడించారు.


