ఇంత అవమానమా? | Deputy CM Pawan Kalyan Pithapuram Tour Incident | Sakshi
Sakshi News home page

ఇంత అవమానమా?

Sep 22 2026 8:21 AM | Updated on Sep 22 2026 8:21 AM

Deputy CM Pawan Kalyan Pithapuram Tour Incident

పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సోమవారం జరిపిన నియోజకవర్గ పర్యటనలో స్థానిక నాయకులకు, కార్యకర్తలకు చోటు దక్కలేదు. దీంతో, వారందరూ అసంతృప్తితో వెనుదిరిగారు. చాలా కాలం తరువాత ఆయన పిఠాపురం రావడంతో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం ఎదురు చూశారు. కానీ, పవన్‌ పర్యటనలో ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులకు, ఎన్నికల తరువాత పార్టీలో చేరిన వారికే పెద్ద పీట వేయడంతో స్థానిక నాయకులకు భంగపాటు తప్పలేదు. 

  • చెప్పిందొకటి.. చేసిందొకటి.. 
    తొలుత ప్రకటించిన ఆయన పర్యటన షెడ్యూల్‌లో చివరి నిమిషంలో మార్పులు జరిగాయి. పిఠాపురం మండలం ఫకృద్దీన్‌పాలెం మైసమ్మ చెరువు, పట్టణంలోని పీఠికాపుర వనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం, ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి వెళ్లారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం కొత్తపల్లి మండలం కొండెవరం, నాగులపల్లిలోని సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను పవన్‌ కల్యాణ్‌ ప్రారంభించాల్సి ఉంది. ఆ దిశగా అధికారులు వారం రోజులుగా ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, ఆ కార్యక్రమాలు జరగలేదు. జనసేన కొత్తపల్లి మండల నాయకుల మధ్య నెలకొన్న విభేదాలే దీనికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. 

    పడిగాపులు పడినా దర్శనాల్లేవ్‌ 
    పవన్‌కు వినతిపత్రాలు అందించేందుకు పలువురు వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులు ఆయన బస చేసిన ఆర్‌అండ్‌బీ అతిథి గృహం బయట గంటల తరబడి పడిగాపులు పడ్డారు. అయినప్పటికీ, పవన్‌ కల్యాణ్‌ దర్శనాలు మాత్రం వారికి లభించలేదు. 

  • పిఠాపురం జగ్గయ్య చెరువు ప్రాంతానికి చెందిన అంధురాలు మఠం జ్యోతి ఎఫ్‌కే పాలెంలో పవన్‌ను కలిసి, ఫించన్‌ ఇప్పించాలని కోరేందుకు ప్రయత్నించింది. కానీ ఆమెను పవన్‌ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. అక్కడే ఉన్న పోలీసులు ఆమెను అడ్డుకుని పక్కకు లాగేశారు. దీనిపై జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. 

  • పిఠాపురం బ్రాహ్మణ కాలనీ వద్ద తమ సమస్యలు వినాలంటూ పట్టుబట్టినా వినకుండా పవన్‌ వెళ్లిపోవడంతో స్థానిక మహిళలు అసంతప్తి వ్యక్తం చేశారు. వారికి కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ నచ్చజెప్పి ఫోన్‌ నంబర్‌ ఇచ్చి సముదాయించారు. 

  • పీఠికాపుర వనం ప్రారంభత్సవం వద్ద స్థానిక జనసేన నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీ కోసం పని చేసిన తమను పట్టించుకోవడం లేదంటూ వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

  • పవన్‌ కల్యాణ్‌ మంగళవారం కొత్తపల్లి మండలంలో పర్యటిస్తారని అధికారులు ప్రకటించారు. షెడ్యూల్‌ ప్రకారం గొల్లప్రోలు మండంలో కూడా ఆయన పర్యటించాల్సి ఉంది. కానీ అన్ని శిలాఫలకాలనూ కొత్తపల్లిలోని సభా వేదిక వద్దనే ప్రారంభిస్తారనే ప్రచారం జరుగుతోంది. 

     కాగా, పవన్‌ పర్యటనకు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ దూరంగా ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement