రౌడీ దళాన్ని దించినా డీఎస్సీపై పోరు ఆగదు | YS Jagan Slams CBN Lokesh Over DSC Protest Attack | Sakshi
Sakshi News home page

రౌడీ దళాన్ని దించినా డీఎస్సీపై పోరు ఆగదు

Sep 22 2026 12:10 PM | Updated on Sep 22 2026 12:12 PM

YS Jagan Slams CBN Lokesh Over DSC Protest Attack

సాక్షి, తాడేపల్లి: శాంతియుత ర్యాలీలపై టీడీపీ గూండాల దాడి వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ అత్యవసర సమావేశం నిర్వహించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో.. నిన్న జరిగిన పరిణామాలను నేతలు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.  

ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, దాడులపై గవర్నర్‌ను కలిసి వివరించాలని సమావేశంలో వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తుండటంతో సహించలేకపోతున్నారని.. అందుకే తమ పార్టీ ఆందోళనలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని  ఆయన అన్నారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నందుకే దాడులు చేస్తున్నారని, నిన్నటి ర్యాలీతో ఈ అంశం మరోసారి చర్చలోకి వచ్చిందని అన్నారు.

డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలు జరగడంతో వైఎస్సార్‌సీపీ ఆందోళనలు నిర్వహిస్తోంది. అవకతవకలపై సీబీఐ దర్యాప్తుతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామాను కూడా డిమాండ్‌ చేస్తోంది. అయితే సోమవారం విజయవాడలో శాప్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమాల సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరిగాయి. 

‘రౌడీ దళాన్ని దించారు’
చంద్రబాబు, లోకేశ్‌ తమపై దాడులకు కొందరిని ప్రోత్సహిస్తున్నారని వైఎస్‌ జగన్‌ అన్నారు. ‘యువగళం టీం కాదు.. రౌడీ దళం’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాంతియుతంగా జరుగుతున్న కార్యక్రమంలోకి రౌడీలను పంపి అలజడి సృష్టించారని, పోలీసుల వద్ద నుంచి లాఠీలు లాక్కుని రాళ్లతో దాడులు చేశారని మండిపడ్డారు. దాడుల్లో తమ పార్టీ నేతలు, కార్యకర్తలు గాయపడినా సంయమనం పాటించారని జగన్‌ చెప్పారు. తమవారిపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా.. వైఎస్సార్‌సీపీ నేతలపైనే కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. గతంలోనూ తమ పార్టీపై జరిగిన పలు దాడుల్లో ఇదే తరహా వ్యక్తులు ఉన్నారని, ఇందుకు ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

పోలీసుల తీరుపైనా ఆగ్రహం
శాంతియుత నిరసన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకుంటున్నారని వైఎస్‌ జగన్‌ విమర్శించారు. రాష్ట్రాన్ని జంగిల్‌ రాజ్‌ కన్నా దారుణంగా మార్చారని చెప్పారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసులు చట్టాన్ని పక్కన పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తమ పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అప్పటిదాకా పోరాటం ఆగదు
డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వైఎస్‌ జగన్‌ ఉద్ఘాటించారు. చంద్రబాబు, లోకేశ్‌ల బెదిరింపులకు భయపడి వెనక్కి తగ్గేది లేదన్నారు. ప్రజల తరఫున పోరాటాల్లో వైఎస్సార్‌సీపీ తగ్గేది లేదని, నిజాయితీగా పరీక్షలు రాసిన అభ్యర్థులకు అండగా ఉంటామని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement