అందుకే ఈ అరాచకాలా..? | KSR's Comments On AP Politics, DSC Allegations, Liquor Case, Satya Prasad Statement | Sakshi
Sakshi News home page

అందుకే ఈ అరాచకాలా..?

Sep 22 2026 11:39 AM | Updated on Sep 22 2026 11:58 AM

KSR's Comments On AP Politics, DSC Allegations, Liquor Case, Satya Prasad Statement

అధికారం ఉంటే ఎలాగైనా చేయవచ్చని ఏపీలో కూటమి ప్రభుత్వం రుజువు చేస్తున్నట్లుగా ఉంది. తమ హయాంలో జరిగిన స్కామ్‌ల కేసులను పోలీసు వ్యవస్థ ద్వారానే ఎత్తివేయించుకోవడం, అదే పోలీసులను ప్రయోగించి విపక్ష వైఎస్సార్‌సీపీ నేతలపై కల్పిత కేసులు పెట్టడం ఒక ప్రత్యేకతగా కనిపిస్తుంది. బహుశా గతంలో ఏ ప్రభుత్వం ఇంత అరాచకంగా వ్యవహరించి ఉండకపోవచ్చన్నది ఎక్కువ మంది భావన.

2014-19 టరమ్‌లో జరిగిన స్కిల్ స్కామ్‌తో సహా ఆయా కేసులను ఎత్తివేసేలా పావులు కదపడం, అదే సమయంలో వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిందంటూ ఒక కల్పిత మద్యం కేసును సృష్టించి, అవసరమైనప్పుడల్లా దానిని ప్రచారానికి వాడుకోవడం ఈ ప్రభుత్వం అలవాటుగా మార్చుకున్నట్లుంది. అంతేకాదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోని విద్యాశాఖలో జరిగిన టీచర్ల నియామక స్కామ్‌ను కప్పిపుచ్చడానికి ప్రభుత్వం నానా పాట్లు పడుతోంది. ఇదే కాదు.. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సాయికృష్ణ అనే యువకుడిని లాకప్ డెత్ చేసిన కేసు మూలలోకి వెళ్లకుండా కథ నడిపిస్తున్న తీరు కూడా ఆసక్తికరంగా కనిపిస్తుంది.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక జనాన్ని ఏమార్చే పనిలో ఉంటోంది. మరో వైపు ప్రభుత్వంలో జరుగుతున్న స్కామ్‌లు, పోలీసు శాఖ ద్వారా జరుగుతున్న అరాచకాలు కూటమి ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. వీటికి తోడు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని ఈడి కూడా తేల్చడంతో ప్రభుత్వ పెద్దలు అపచారం చేసినట్లయిందని ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడింది. ఇవన్ని వెరసి ప్రభుత్వం ప్రజలలో పరపతి బాగా కోల్పోతోందన్న భావన వచ్చినప్పుడల్లా దానిని డైవర్ట్ చేయడానికి వైఎస్సార్‌సీపీపై ఏవేవో పిచ్చి ఆరోపణలు చేయడం, ఆ పార్టీ నేతలపై పిచ్చి కేసులు పెట్టడం చేస్తున్నారు.

డీఎస్సీ అక్రమాలపై ఆధార సహితంగా మాజీ ముఖ్యమంత్రి జగన్, వైఎస్సార్‌సీపీ ఇతర నేతలు ఆరోపణలు చేస్తుండడంతో చంద్రబాబు, లోకేష్‌లు గుక్క తిప్పుకోలేకపోతున్నారు. ఎంత బుకాయించాలని చూస్తున్నా, స్కామ్ వివరాలు, కొత్త సమాచారం ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉంది. హర్యానాలో జరిగిన టీచర్ల ఎంపిక స్కామ్‌తో పోల్చుతూ కొందరు మేధావులు విశ్లేషణలు ఇస్తున్నారు. గతంలో హర్యానా ముఖ్యమంత్రి చౌతాలా, ఆయన కుమారుడు, కొందరు అధికారులు జైలుకు వెళ్లిన ఘటన తీరుతెన్నులను పోల్చుతూ ప్రముఖ మేధావి, ఫ్రొఫెసర్ రామచంద్రయ్య ఒక వీడియో చేశారు. ప్రస్తుతం ఏపీలో కూటమి అధికారంలో ఉండడంతో, కేసు విచారణ దశకు వెళ్లకుండా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిని వేధిస్తూ కాలం గడుపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ప్రజలు డీఎస్సీ స్కామ్ గురించి మరీ ఎక్కువగా చర్చించుకోకుండా ఉండాలన్న లక్ష్యంతో అవసరమైనప్పుడల్లా మద్యం స్కామ్ అంటూ తెరపైకి తీసుకువచ్చి ఎల్లో మీడియాతో విస్తృత ప్రచారం చేయిస్తున్నారు. తాజాగా బెవరేజ్ కార్పొరేషన్‌లో ఓఎస్డీగా పనిచేసిన సత్యప్రసాద్ అనే ఉద్యోగి వాంగ్మూలం పేరుతో ఒక కథను సృష్టించారని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. సత్యప్రసాద్ కూడా ఈ కేసులో ఒక నిందితుడే. కాని ఆయన అరెస్టు కాకుండా చూసి, అతనిని నయానో, భయానో అప్రూవర్‌గా మార్చుకుంది. ఈ కేసును విచారిస్తున్న సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఈ రెండేళ్లలో రకరకాల విన్యాసాలు చేసిందన్న అభిప్రాయం కలుగుతోంది. అనేక మందిని ఈ కేసులోకి తీసుకురావడం, అరెస్టులు చేయడం, ఎప్పటికప్పుడు ఒక కొత్త స్టోరీని అల్లడం చేస్తోందన్న భావన ఉంది. 

మద్యం తయారీదార్ల నుంచి లంచాలు తీసుకున్నారన్నది సిట్ అబియోగం. ఇందుకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు ఇచ్చారా అంటే అదేమి లేదు. ఎవరో రహస్య లేఖ రాస్తే వెంటనే పోలీసులను రంగంలోకి దించి విచారణ ఆరంభించారు. ఈ లంచం డబ్బును ఒకసారి రియల్ ఎస్టేట్‌లో పెట్టారని, మరోసారి సినిమాలు తీశారని, ఇంకోసారి విదేశాలకు తరలించారని, వేరొక సారి ఆ డబ్బును గత ఎన్నికలలో ఓటర్లకు పంచడానికి వెచ్చించారని ఆరోపణలు చేశారు. సత్య ప్రసాద్‌తో కోర్టులో కూటమి పెద్దలు కోరుకున్న విధంగా వాంగ్మూలం ఇప్పించారన్నది వైఎస్సార్‌సీపీ అభియోగం.

ఇదీ చదవండి: ‘హూ ఈజ్‌ మోదీ’ నుంచి గ్రేట్‌ అని భజన దాకా.. బాబు వ్యూహం అదేనా?

మాజీ మంత్రి పేర్ని నాని ఈ కేసుపై పార్టీ వాదనను సమర్ధంగా వినిపించారు. సత్యప్రసాద్ వాంగ్మూలంలో చెప్పిన అంశాలలోని వైరుధ్యాలపై పలు ప్రశ్నలు సంధించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి వద్ద మద్యం డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్లకు సమావేశం జరిగిందని సత్యప్రసాద్ చెప్పారట. ఆయన వద్ద దీనికి ఆధారం ఏమైనా ఉందా అంటే అదేమీ కనిపించదు. 

కొంతకాలం క్రితం హైదరాబాద్‌లో ఒక కాలేజీలో 11 కోట్ల డబ్బు దొరికిందని పోలీసులు హడావుడి చేశారు. అది ఈ కేసులో ఒక నిందితుడైన రాజ్ కసిరెడ్డిదని ఆరోపించారు. దానిని ఆయన తోసిపుచ్చి ఆ డబ్బును కోర్టులో పెట్టాలని, నెంబర్లు నోట్ చేయాలని కోరగా, కోర్టు ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది. దాంతో పోలీసు అధికారులు ఆ డబ్బును బ్యాంక్‌లో జమ చేసేశామని చెప్పడంతోనే ఈ కేసులో డొల్లతనం బహిర్గతం అయింది. తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పిన ఒక కానిస్టేబుల్‌కు ప్రమోషన్ ఇవ్వడం, అందుకు ఇష్టపడని మరో కానిస్టేబుల్‌ను తీవ్రంగా వేధించడం చేశారట. నెలకు ఏభై, అరవై కోట్లు వసూలు చేసేలా నిర్ణయించుకున్నారని, దానిని జగన్‌కు చేర్చేవారని లాజిక్ లేకుండా సత్యప్రసాద్ కోర్టుకు తెలిపారట. అది నిజమే అయితే అది ఎలా జరిగింది. సిసిటీవీ ఫుటేజ్ ఉందా? అంటే అదేమీ కనిపించదు.

నిజంగానే మూడువేల కోట్ల డబ్బు ఎన్నికలలో పంచిఉంటే ఏ ఒక్క ఎన్నికల పర్యవేక్షణ అధికారి అయినా తన రిపోర్టులో తెలిపారా అని జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ ప్రశ్నించారు. ఇలాంటి పిచ్చి కేసులు పెట్టి ఏమి సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. ఏ కేసు అయినా కేవలం అప్రూవర్ ఇచ్చే వాంగ్మూలం తోనే బలంగా ఉంటుందనుకుంటే పొరపాటని శ్రవణ్ అన్నారు. డబ్బు ఎక్కడనుంచి ఎక్కడకు వెళ్లింది? డబ్బును సీజ్ చేశారా? నిజంగానే మద్యం డిస్టిలరీల వారు లంచాలు ఇచ్చి ఉంటే వారందరిపైన కూడా కేసులు పెట్టాలి కదా అని ఆయన అడిగారు.

ఇక సత్యప్రసాద్ ఇంతకుముందు రెండుసార్లు వాంగ్మూలం ఇచ్చినప్పుడు జగన్ పేరే ఎందుకు ప్రస్తావించలేదు? అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. గతంలో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డిని కూడా వేదించి అప్రూవర్‌గా మార్చుకునే యత్నం చేశారు. తొలుత అంగీకరించినా, ఆ తర్వాత ఆయన ఒప్పుకోకపోవడంతో కొత్త కేసులు పెట్టి వేదిస్తున్నారట. స్కిల్ స్కామ్‌లో డబ్బు ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్లింది? చివరికి టీడీపీ ఆఫీస్‌కు ఎలా చేరింది? బ్యాంకు స్టేట్ మెంట్‌లతో సహా సీఐడీ అప్పట్లో అభియోగాలు మోపింది. అంతేకాక సంబంధిత ఫైళ్లలో చంద్రబాబు సంతకాలు కూడా ఉన్నాయి. అలాంటి కేసులో ఏమీ జరగలేదని సీఐడీ కూటమి అధికారంలోకి వచ్చాక ఎలా నివేదిక ఇచ్చిందో తెలియదు. పైగా ఈ కేసు మూలం ఈడి దర్యాప్తుతో మొదలైంది. అయినా ఇప్పుడు ఈడి ఎక్కడా సీన్‌లో కనిపించదు.

మాజీ మంత్రి అంబటి రాంబాబు డీఎస్సీ స్కామ్‌కు సంబంధించి లోకేష్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే ఆయనకు మద్యం కేసులో నోటీసులు రావడం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. అమరావతికి సంబంధించిన స్కామ్‌లు కొన్నిటిలో కొందరు ఐఏఎస్ అధికారులు వాంగ్మూలాలు ఇచ్చినా, అవన్ని ఇప్పుడు ఎలా పూర్వపక్షం అవుతున్నాయో అర్థం కావడం లేదని ఈ కేసులను గమనిస్తున్న ఒక ప్రముఖుడు అన్నారు. న్యాయ వ్యవస్థ వీటిని ఎలా అనుమతిస్తుందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. 

సాయికృష్ణ లాకప్ డెత్ కేసును వీలైనంతమేర సాగదీస్తున్న సిట్ అధికారులు ఇంతవరకు ఎందుకు అతనిని హింసించారు అన్న మూలాలలోకి వెళ్ళినట్లు సమాచారం లేదు. ఏ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు అతనిని మార్కాపురం నుంచి పట్టుకువచ్చారు? పై అధికారులను విచారించే పరిస్థితి ఉందా? లేదా? ఇలాంటి సందేహాలు ఎన్నో వస్తున్నాయి ఏ కేసునైనా నిష్పక్షపాతంగా చేస్తే అభ్యంతరం ఉండదు. అధికారంలో ఉన్నవారిపట్ల ఒకరకంగా, విపక్షంవారిపై మరో రకంగా వ్యవహరిస్తేనే సమస్య. ఇది వ్యవస్థలకు కూడా మంచిది కాదు. అన్నిటికి మించి సత్యప్రసాద్ మానసిక పరిస్థితిపై ఒక డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ కూడా ఆసక్తికరంగా ఉంది. అప్పుడు ఆయన వాంగ్మూలం చెల్లుతుందా? లేదా? అన్నది చూడాలి.

మరో విషయం ఏమిటంటే మద్యం కేసులో ప్రభుత్వం తరపున వాదించే ఒక లాయర్ ఏకంగా జడ్జినే బెదిరించిన ఘటన గతంలో జరిగింది. అయినా ఆయనకు ఏమీ కాలేదు. ఇలా రకరకాల సందేహాలతో, సంశయాలతో కొనసాగుతున్న కల్పిత మద్యం కేసు ద్వారా వైఎస్సార్‌సీపీ నేతలను ఇబ్బంది పెట్టి తమపై వచ్చిన ఆరోపణల నుంచి తప్పించుకోవచ్చని పాలకులు భావిస్తున్నారేమో తెలియదు. కాని అది అన్నివేళలా సాధ్యపడకపోవచ్చు.

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement