నో చీప్‌ పాలిటిక్స్‌.. ఉదయ్‌నిధికి విజయ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ | No Credit Politics Only Cauvery Rights: Vijay Hits Back at Udhayanidhi | Sakshi
Sakshi News home page

నో చీప్‌ పాలిటిక్స్‌.. ఉదయ్‌నిధికి విజయ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Aug 7 2026 11:03 AM | Updated on Aug 7 2026 11:15 AM

No Credit Politics Only Cauvery Rights: Vijay Hits Back at Udhayanidhi

కావేరి జల వివాదం, కర్ణాటక ప్రతిపాదిస్తున్న మేకెదాటు ఆనకట్ట అంశంపై తమిళనాడు అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగింది. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతుండగా.. ఆ అవసరం లేదంటూ ముఖ్యమంత్రి విజయ్‌ తేల్చేశారు. అలాగే కావేరి వివాదంపై కర్ణాటకతో చర్చలకు తానే ప్రతిపాదించానని క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్‌కు ‘చీప్‌ పాలిటిక్స్‌’ అంటూ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

తమిళనాడు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం.. ‌అసెంబ్లీలో ప్రతిపక్షాల విమర్శలకు విజయ్‌ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మేకెదాటు అంశాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని ప్రతిపక్షాలకు సూచించారు. “మేకెదాటు ఆనకట్ట విషయంలో చౌకబారు రాజకీయాలు(చీప్‌ పాలిటిక్స్‌) చేయాలని నేను అనుకోవడం లేదు. కావేరి జలాల విషయంలో మా వైఖరిని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ ద్వారా తెలియజేశాం. నది జలాల హక్కులు, మేకెదాటు అంశంలో మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదు” అని విజయ్‌ అన్నారు.

అఖిలపక్షం నిర్వహించాల్సిన అవసరం లేదని.. కావేరి జలాల విషయంలో తమ ప్రభుత్వం రాష్ట్ర హక్కులను కాపాడేందుకు చివరి వరకు పోరాడుతుందని, ఎలాంటి రాజీకి వెళ్లబోమని కుండబద్ధలు కొట్టారు. అలాగే తమిళనాడు ప్రజల ప్రయోజనాల కోసం ఎలాంటి అవమానాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను అని పేర్కొన్నారు. 

క్రెడిట్‌ కోసం పాకులాడం..
గతంలో ఎవరు ఏం చేశారన్న విషయాలను ప్రస్తావిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని తాము భావించడం లేదని సీఎం చెప్పారు. “ఎవరు క్రెడిట్‌ తీసుకుంటారు? ఎవరికీ రాజకీయ ప్రయోజనం కలుగుతుంది? అనే దానిపై మాకు ఆసక్తి లేదు. కావేరి సమస్య పరిష్కారానికి ఏం చేయాలో మాకు తెలుసు. ఈ అంశాన్ని న్యాయపరమైన మార్గాల్లోనే ముందుకు తీసుకెళ్తాం” అని ఆయన స్పష్టం చేశారు.

అఖిలపక్ష భేటీకి ఉదయనిధి డిమాండ్‌
అయితే మేకెదాటు ప్రాజెక్టుపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. కర్ణాటక కావేరి నదిపై మేకెదాటు ఆనకట్ట నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో.. తమిళనాడు ప్రభుత్వం అన్ని పార్టీలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. అసెంబ్లీలో ఉదయనిధి మాట్లాడుతూ.. ఇది రాజకీయ అంశం కాదని, రైతుల జీవనాధారానికి సంబంధించిన సమస్య అని పేర్కొన్నారు.

“అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించడం లేదు? మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రధానికి లేఖ రాసినందుకు ప్రస్తుత సీఎం విమర్శించారు. ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలి. ఇది ప్రజల జీవనాధారానికి సంబంధించిన విషయం” అని ఉదయనిధి అన్నారు. కావేరి అంశంపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

పేపర్‌ కౌంటర్‌
కురువై (కావేరి డెల్టాలో వేసే ప్రత్యేక వరి సాగు) పంట సేకరణకు, కరువు నష్టపరిహారానికి మధ్య తేడా కూడా తెలియదా? కేవలం పేపర్లు చదివితే సరిపోదు.. రైతుల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలి అంటూ సీఎం విజయ్‌కు చురకలు అంటించారు. అయితే.. దీనికి ఆ తర్వాత మాట్లాడిన విజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కేవలం ఒక విషయం గురించి మాట్లాడటం కాదు.. మొత్తం వాస్తవాలు తెలుసుకోవాలి. ముందు వెనకా మొత్తం పేపర్లు చదివి ఉంటే అసలు పరిస్థితి ఏమిటో అర్థమయ్యేది అంటూ ఆయన బదులిచ్చారు.

సీఎం కర్ణాటక పర్యటనపై గందరగోళం
మేకెదాటు వివాదంపై తమిళనాడు సీఎం విజయ్‌ కర్ణాటకకు వెళ్లి చర్చలు జరుపుతారన్న వార్తలు కూడా రాజకీయంగా చర్చకు దారితీశాయి. అయితే దీనిపై ప్రభుత్వంలోని కొందరు మంత్రులు భిన్నమైన ప్రకటనలు చేసినట్లు ఉదయనిధి అసెంబ్లీలో ప్రస్తావించారు. “వ్యవసాయ మంత్రి సీఎం కర్ణాటక వెళ్తారని చెప్పారు. మరోవైపు ఇద్దరు మంత్రులు అలాంటి పర్యటన లేదని చెప్పారు. కర్ణాటక నేతలు కూడా తమిళనాడు సీఎం రావడం తమకు ఇష్టం లేదని, నీళ్లు విడుదల చేయడానికి సిద్ధంగా లేమని చెబుతున్నారు” అని ఉదయనిధి అన్నారు.

డెల్టా రైతుల పరిస్థితిపై ఉదయనిధి ఆందోళన
కావేరి నీటి కొరత ప్రభావం డెల్టా జిల్లాల రైతులపై పడుతోందని ఉదయనిధి పేర్కొన్నారు. సీఎం విజయ్‌ స్వయంగా డెల్టా ప్రాంత రైతులను కలుసుకుని వారి సమస్యలు వినాలని కోరారు. గత ప్రభుత్వం హయాంలో 6.8 లక్షల ఎకరాల్లో సాగు జరిగితే.. ప్రస్తుత ప్రభుత్వంలో కేవలం 1.5 లక్షల ఎకరాల్లోనే సాగు జరిగిందని ఆయన ఆరోపించారు.

ఉదయనిధి అరెస్టు.. కావేరి వివాదం మరింత వేడి
ఇదిలా ఉండగా.. కావేరి వివాదం నేపథ్యంలో సీఎం విజయ్‌, నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఉదయనిధి స్టాలిన్‌ అరెస్టు కావడం కూడా రాజకీయ వివాదానికి దారితీసింది. తన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించినవి కాదని, కావేరి నది పరిరక్షణ కోసమే మాట్లాడానని ఉదయనిధి స్పష్టం చేశారు. తనను అరెస్టు చేయడం కావేరి, మేకెదాటు అంశాలపై ప్రశ్నలు లేవనెత్తకుండా చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని ఆయన ఆరోపించారు.

మేకెదాటు ప్రాజెక్టుపై పాత వివాదం
కర్ణాటక కావేరి నదిపై మేకెదాటు వద్ద భారీ జలాశయం నిర్మించాలని ప్రతిపాదిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే తమిళనాడుకు రావాల్సిన నీటి ప్రవాహంపై ప్రభావం పడుతుందని తమిళనాడు వాదిస్తోంది. ఈ అంశంపై రెండు రాష్ట్రాల మధ్య చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. తాజా పరిణామాలతో కావేరి జల వివాదం మరోసారి తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. సీఎం విజయ్‌ అఖిలపక్ష భేటీకి నిరాకరించడం, ఉదయనిధి ప్రభుత్వం తీరుపై ప్రశ్నలు లేవనెత్తడంతో అసెంబ్లీలో రాజకీయ వేడి మరింత పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement