భారత డిజిటల్ పరిధిలో సామాజిక మాధ్యమ దిగ్గజాల బాధ్యతారాహిత్య వైఖరిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్) వేదికలపై కంటెంట్ నియంత్రణ, మార్గదర్శకాల అమలుపై ఐటీ మంత్రిత్వ శాఖ నిఘాను కఠినతరం చేసింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కార్యదర్శి ఎస్.కృష్ణన్‌లు మెటా ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో డిజిటల్ వేదికల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇటీవల విద్యార్థులతో సంభాషిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంచుకున్న వీడియో పోస్ట్‌ను మెటా ఆల్గోరిథమ్ సాంకేతిక లోపం నెపంతో తొలగించడం పెను దుమారం రేపింది. ఈ ఘటనపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీవ్రంగా పరిగణించి హెచ్చరించడంతో మెటా గ్లోబల్ అఫైర్స్ హెడ్ జోయెల్ కాప్లాన్, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తరఫున ప్రతినిధులు కేంద్రానికి అధికారికంగా క్షమాపణలు తెలియజేశారు.
కేవలం క్షమాపణలతో వ్యవహారం ముగియదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మెటాను ఇకపై తటస్థ మధ్యవర్తిగా (Neutral Intermediary) భావించలేమని, ఐటీ చట్టం సెక్షన్ 79 కింద లభించే చట్టపరమైన రక్షణ మినహాయింపులు అన్నీ వేళలా వర్తించవని కేంద్రం హెచ్చరించింది.
బాలల లైంగిక వేధింపుల సమాచారం (సీసామ్), డీప్‌ఫేక్ వీడియోలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాల నియంత్రణలో మెటా విఫలమైందని కేంద్రం ఆక్షేపించింది.
సామాజిక రుగ్మతలు పెంచే కంటెంట్‌ను ప్రచారం చేయడానికి పెద్ద ఎత్తున డబ్బు చెల్లించి బూస్ట్ చేస్తున్నారనే ప్రశ్నకు, తమ వ్యవస్థలు దీనిని పూర్తిగా అరికట్టడంలో విఫలమవుతున్నాయని మెటా ప్రతినిధులు అంగీకరించినట్లు సమాచారం.
సాంకేతిక సమీక్షకు ఆదేశం
భారత్‌లో వ్యాపారం చేసే విదేశీ కంపెనీలు అక్కడి చట్టాల ప్రకారం కాకుండా, ఇక్కడి భూభాగ చట్టాలకు కట్టుబడి తీరాల్సిందేనని ప్రభుత్వం తేల్చిచెప్పింది. రాబోయే 3-4 రోజుల్లో మెటా సాంకేతిక బృందాలతో మరో విడత సమీక్ష జరగనుంది. ఇందులో మెటా ఆల్గోరిథమ్‌ల పనితీరు, కంటెంట్ తొలగింపు నిర్ణయాల వెనుక ఉన్న సాంకేతికతను కేంద్ర నిపుణులు ప్రత్యక్షంగా తనిఖీ చేయనున్నారు. బాధ్యతాయుతమైన డిజిటల్ పాలనను విస్మరిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం గట్టి సంకేతాలిచ్చింది.
ఇదీ చదవండి: మీ EPF డబ్బు సురక్షితంగా ఉండాలా?


