రాయ్‌పూర్: పేపర్ లీకేజ్‌ల కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలను లీక్ చేయడం అనేది హత్య కంటే మరింత ఘోరమైన నేరం అని మండిపడింది. ఆ అంశం లక్షలాది మంది పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల భవిష్యత్తును నాశనం చేస్తుందని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీవన్ కిశోర్ ధ్రువ్ కు ఛత్తీస్‌గఢ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది.
ఏం జరిగింది?
2020–2022 మధ్య జరిగిన ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామక ప్రక్రియలో అక్రమాలకు అక్రమాలకు పాల్పడ్డాడడని అప్పటి కమిషన్ కార్యదర్శిగా పనిచేసిన జీవన్ కిశోర్ ధ్రువ్ ను 2025 సెప్టెంబర్‌లో సీబీఐ అరెస్టు చేసింది. ఈ నియామక పరీక్షలో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికైన ఆయన కుమారుడు సుమిత్ ధ్రువ్ కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
"ఈ కేసులో ఇతర నిందితుల బెయిల్ దరఖాస్తులను పరిశీలించినప్పుడు చేసిన వ్యాఖ్యలను మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం. పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్‌కు పాల్పడే వ్యక్తి, ఆ పరీక్షల కోసం రాత్రింబవళ్లు కష్టపడి సిద్ధమవుతున్న లక్షలాది మంది యువ అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకుంటాడు. అలాంటి చర్య హత్య నేరం కంటే కూడా ఘోరమైనది. ఒక వ్యక్తిని హత్య చేస్తే ఒక కుటుంబం మాత్రమే నష్టపోతుంది. కానీ లక్షలాది మంది అభ్యర్థుల కెరీర్‌ను నాశనం చేస్తే మొత్తం సమాజమే తీవ్రంగా ప్రభావితమవుతుంది."అందువల్ల ఈ కేసులో నిందితులపై ఉన్న ఆరోపణలను సాధారణ నేరాలుగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది.
ప్రాసిక్యూషన్ సమర్పించిన ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన హైకోర్టు, 2021 మెయిన్ పరీక్ష ప్రశ్నాపత్రాలను జీవన్ కిశోర్ ధ్రువ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి గోప్యంగా తన వద్ద ఉంచుకున్నారని, అనంతరం వాటిని తన కుమారుడికి అందించినట్లు సూచించే ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. అదేవిధంగా సుమిత్ ధ్రువ్ పరీక్షకు ముందు ప్రత్యేకంగా నాలుగు అంశాలను మాత్రమే సిద్ధం చేశాడని, అవే అంశాలు పరీక్షలో ప్రశ్నలుగా వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపింది. జీవన్ కిశోర్ ధ్రువ్ నివాసంలో స్వాధీనం చేసుకున్న వస్తువులు, సాక్షుల వాంగ్మూలాలు, పత్రాధారాలు కూడా ఈ కుట్రలో ఆయన ప్రమేయాన్ని ప్రాథమికంగా సూచిస్తున్నాయని కోర్టు పేర్కొంది.
అయితే విచారణ సందర్భంగా జీవన్ కిశోర్ ధ్రువ్ తరఫున న్యాయవాది దేవర్షి ఠాకూర్ వాదనలు వినిపించారు. CGPSC కార్యదర్శిగా పనిచేసిన కారణంగానే తన క్లయింట్ కిషోర్ ధృవ్‌ను తప్పుడు కేసులో ఇరికించారని, అసలు ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు కూడా లేదని తెలిపారు.అతని వద్ద నుంచి మొబైల్ ఫోన్ తప్ప ఎలాంటి అభ్యంతరకర పత్రాలు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం కాలేదని, ప్రశ్నాపత్రాలను లీక్ చేశారని లేదా తన పిల్లలకు అందించారని నిరూపించే ప్రత్యక్ష ఆధారాలు లేవని ఆయన వాదించారు.జీవన్ కిశోర్ ధ్రువ్ కుమారుల్లో ఒకరు పరీక్షలో అర్హత సాధించలేదని, మరో కుమారుడు కూడా మొదటి ర్యాంకు కాకుండా చాలా తక్కువ ర్యాంకు సాధించాడని తెలిపారు.
సీబీఐ వాదన
జీవన్ కిశోర్ ధ్రువ్, అప్పటి CGPSC చైర్మన్, పరీక్షల నియంత్రణాధికారి (కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్)తో పాటు ఇతర నిందితులతో కలిసి నేరపూరిత కుట్ర పన్ని, 2021 మెయిన్ పరీక్ష గోప్యమైన ప్రశ్నాపత్రాలను లీక్ చేసి, తన కుమారుడికి అక్రమ ప్రయోజనం కల్పించినట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ పేర్కొంది.ధ్రువ్ నివాసంలో నిర్వహించిన సోదాల్లో జనరల్ స్టడీస్ పేపర్–VIIకు సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలు, అలాగే ఎస్సే పేపర్ ప్రశ్న-సమాధాన బుక్‌లెట్ ప్రతులు స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది.
ఇతర సహ నిందితుడికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినందున తన క్లయింట్‌కు కూడా అదే వర్తించాలని రక్షణ పక్షం చేసిన వాదనను సీబీఐ ఖండించింది. బెయిల్ పొందిన వ్యక్తి ఒక ప్రైవేట్ వ్యక్తి కాగా, జీవన్ కిశోర్ ధ్రువ్ మాత్రం పరీక్షల గోప్యత, సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత కలిగిన సీనియర్ ప్రభుత్వ అధికారి అని స్పష్టం చేసింది.
ఈ కేసులో అరెస్టైన వారిలో మాజీ CGPSC చైర్మన్ తమన్ సింగ్ సోన్‌వానీ, ఆయన మేనల్లుళ్లు నితేష్ సోన్‌వానీ, సాహిల్ సోన్‌వానీ, మాజీ డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లలిత్ గన్వీర్, పారిశ్రామికవేత్త శ్రవణ్ కుమార్ గోయల్, ఆయన కుమారుడు శశాంక్ గోయల్, కోడలు భూమిక కటియార్ తదితరులు ఉన్నారు.


