భవిష్యత్తు బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పిలుపు
న్యూఢిల్లీ: గత ఎనిమిది దశాబ్దాల్లో మనదేశం అనేక కఠినమైన సవాళ్లను అధిగమించిందని, అయితే ఇంకా సాధించాల్సింది చాలా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. భవిష్యత్తు బాధ్యతలను స్వీకరించడానికి యువ న్యాయ పట్టభద్రులు, న్యాయవాదులు సిద్ధంగా ఉండాలని సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన శనివారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేశారు.
దేశ ప్రస్థానం అది సాధించిన విజయాలతోనే ముగిసిపోదని అన్నారు. ప్రతి విజయంతోపాటు నూతన బాధ్యత, కర్తవ్య భావన కూడా కలుగుతుందని వివరించారు. ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని, మన ముందున్న ప్రయాణంలో ఇంకా ఎన్నో మైళ్లు ప్రయాణించాల్సి ఉందని ఉద్ఘాటించారు. యువ న్యాయవాదులను ఉద్దేశించి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాట రోజుల నుంచి బార్ అసోసియేషన్ మోస్తున్న బాధ్యత త్వరలోనే వారి భుజాలపై పడుతుందని అన్నారు.
ముందు తరాల వారు నిర్మించి, బలోపేతం చేసిన న్యాయ సంస్థలను ఇప్పుడు రక్షించి, ముందుకు తీసుకెళ్లాలని యువ లాయర్లకు సూచించారు. తాము మార్గనిర్దేశం చేస్తామని అన్నారు. స్వాతంత్య్ర పోరాటానికి, చట్టంతో లోతైన, శాశ్వతమైన సంబంధం ఉందని గుర్తుచేశారు. ఆ తరంలోని అత్యుత్తమ న్యాయ నిపుణుల దార్శనికత, కృషి ద్వారానే చట్టం నిజమైన ఉద్దేశం కేవలం ఆజ్ఞాపించడం లేదా నియంత్రించడం మాత్రమే కాదని.. న్యాయాన్ని అందించడం, స్వేచ్ఛను పరిరక్షించడం, మానవ గౌరవాన్ని నిలబెట్టడం అని మనం తెలుసుకోవడం ప్రారంభించామని వివరించారు.


