ఆర్టీసీ బస్సు ఎక్కేందుకు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
స్త్రీశక్తి పథకం అమల్లో నిర్లక్ష్యం
డిపోల్లో ప్రయాణికుల రద్దీ
పెరగని ఆర్టీసీ బస్సులు
ఉచిత ప్రయాణం.. అవస్థల మయం
బెంబేలెత్తుతున్న మహిళలు
అమలాపురం రూరల్: స్త్రీశక్తి పథకం పేరుతో చంద్రబాబు ప్రభుత్వం మహిళల కోసం తీసుకువచ్చిన ఉచిత బస్సు ప్రయాణం అటు ప్రయాణికులను అవస్థల పాలు చేస్తుండగా ఇటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను అనారోగ్యానికి గురి చేస్తోంది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ పథకం అబాసుపాలు అవుతోంది. ముఖ్యంగా దీని అమలులో చిత్తశుద్ధి లోపించడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చివరకు మహిళలకూ బస్సుల్లో ప్రయాణంపై ఆ‘శక్తి’ లేకుండా పోయింది.
బస్సులే ఆధారం
జిల్లాలో రైలు మార్గం లేకపోవడంతో ప్రజలందరికీ బస్సు ప్రయాణమే ఆధారం. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టిన తర్వాత ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయ్యింది. కానీ దానికి తగినట్టు బస్సు సర్వీసులు పెంచకపోవడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం నరకప్రాయంగా మారిందని వాపోతున్నారు.
నాలుగు డిపోలు
జిల్లాలో అమలాపురం, రాజోలు, రావులపాలెం, రామచంద్రపురం ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. వీటిలో మొత్తం 295 బస్సులు ఉండగా, వాటిలో 158 బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. ఈ నాలుగు డిపోల్లో సాధారణంగా బస్సుల్లో సగటున ఓఆర్ శాతం 60 శాతం నుంచి 65 శాతం వరకూ మాత్రమే ఉండేది. ఉచిత ప్రయాణం మొదలైనప్పటికీ నుంచి ఓఆర్ శాతం 82కి పెరిగింది. సుమారు 50 మంది వెళ్లాల్సిన పల్లె వెలుగు బస్సుల్లో సుమారు 100 నుంచి 130 మంది ప్రయాణం చేస్తున్నారు.
సీట్ల కోసం పోట్లాట
ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం మహిళలు పోట్లాడుకునే పరిస్థితిని చంద్రబాబు తీసుకొచ్చారు. ఉచిత ప్రయాణం గొప్పదని, మహిళా సంక్షేమ కోసం చేపట్టామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. బస్సుల సంఖ్యను మాత్రం పెంచడం లేదు. మహిళలు పడుతున్న ఇబ్బందులను అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రద్దీ కారణంగా డ్రైవర్లు, కండకర్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్సుల్లో జనం కిక్కిరిసిపోవడంతో టిక్కెట్టు ఇవ్వడానికి కూడా కండక్టర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక మగవారికి బస్సుల్లో చోటు దొరకడం లేదు. డబ్బులు చెల్లించి ప్రయాణం చేద్దామన్నా వీలు ఉండడం లేదు.
బస్సుల్లో రద్దీ
వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రతి శనివారం ఉభయ గోదావరి జిల్లాతో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి సుమారు లక్ష మంది భక్తులు వస్తున్నారని అంచనా. ఈ క్షేత్రానికి జిల్లాలో నాలుగు డిపోల నుంచి కేవలం 25 బస్సులు మాత్రమే నడుపుతున్నారు. ఇతర డిపోల నుంచి దాదాపు 70 బస్సులు వస్తున్నాయి. కానీ ఇవి ప్రయాణికులకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో ఆ రోజు బస్సుల్లో విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. అంతర్వేది, ద్రాక్షారామ, అయినవిల్లి, మురమళ్ల ఆలయాల వెళ్లేందుకు కూడా బస్సుల్లో రద్దీ నెలకొంటోంది. ఈ రూట్లలో బస్సుల సంఖ్యను పెంచాలని భక్తులు కోరుతున్నారు.
డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు
అమలాపురం నుంచి కాకినాడ వెళుతున్న ఆర్టీసీ బస్సుపై ఓ యువతి బంధువులు ఇటీవల దాడి చేశారు. అమలాపురంలోని కిమ్స్ హాస్పిటల్ వద్ద మురమళ్ల గ్రామానికి చెందిన ఒక యువతి బస్సు ఎక్కి టిక్కెట్ తీసుకోకపోవడంతో కండక్టర్‌తో వాగ్వాదం జరిగింది. దీనితో డ్రైవర్, కండక్టర్ ఆమెను అనాతవరం రోడ్డుపై దింపి వెళ్లిపోయారు. దీంతో ఆ యువతి బంధువులు ఆగ్రహంతో మురమళ్ల వద్ద బస్సును ఆపి అద్దాలు ధ్వంసం చేసి డ్రైవర్, కండక్టర్‌పై దాడి చేసేందుకు యత్నించారు. అలాగే రావులపాలెం, రామచంద్రపురంలో డైవర్లు, కండక్టర్లపై దాడులు జరిగియి. దీనిపై ఉద్యోగులు జిల్లా వ్యాప్తంగా డిపోల్లో ధర్నాలు నిర్వహించి తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల తిప్పలు
జల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో సుమారు 50 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లో విద్యాలయాలకు వెళతారు. వీరిలో విద్యార్థినులకు సీ్త్రశక్తి పథకంలో ఉచితమే అయినప్పటికీ ప్రయాణం ప్రమాదంగా మారింది. ఆర్టీసీ డిపోల్లోనే బస్సులు ప్రయాణికులతో నిండిపోవడంతో ఇక విద్యార్థులకు ఎక్కే అవకాశం ఉండడం లేదు. ముఖ్యంగా గ్రామాల్లో వేచి ఉండే విద్యార్థులు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు.
ప్రత్యేక బస్సులు వేయాలి
ఆర్టీసీ డిపోల్లోనే ప్రయాణికులతో బస్సులు నిండిపోతున్నాయి. ఆ తర్వాత ప్రధాన కూడళ్లలో వేచి ఉన్న విద్యార్థులకు బస్సు ఎక్కే వీలు ఉండడం లేదు. దీంతో వారందరూ అవస్థలు పడుతున్నారు. సమయానికి కళాశాలలకు వెళ్లలేకపోతున్నారు. త్వరలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలి.
– పొలమూరి మోహన్‌బాబు, బీఎస్‌పీ నియోజకవర్గ అధ్యక్షుడు
కొత్త బస్సులు కొనుగోలు చేయాలి
ఎన్నికల సమయంలో మహిళలకు రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక ఆంక్షలు పెట్టి కేవలం పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కొత్త బస్సులను కొనుగోలు చేయాలి.
– దొమ్మేటి ఆదిలక్ష్మి, ఐద్వా జిల్లా కార్యదర్శి


