అమలాపురం రూరల్: పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నకానుకలు సరిపోవడం లేదని అదనపు కట్నం కోసం వేధిస్తున్న అత్తమామలు, భర్తపై బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమలాపురం రూరల్ మండలం కామనగరువు బాలయోగి కాలనీకి చెందిన మహమ్మద్ షకీలా (22)ను 2022లో కొవ్వూరు మండలం చాగల్లు గ్రామానికి చెందిన మహమ్మద్ ఇస్మాయిల్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆ సమయంలో రూ.15 లక్షల నగదుతో పాటు 15 కాసుల బంగారాన్ని కట్నంగా ఇచ్చారు. పైళ్లెన నాటి నుంచి అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారని మహమ్మద్ షకీలా అమలాపురం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్తమామలు అబ్దుల్ ఆయుబ్, రషీద్‌లతో పాటు భర్త ఇస్మాయిల్ శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని ఇచ్చిన ఫిర్యాదుతో తాలూకా హెచ్‌సీ బీఎం కృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
కొబ్బరి గోదాంలో అగ్నిప్రమాదం
రూ.90 లక్షల ఆస్తి నష్టం
ముమ్మిడివరం: మండలంలోని కొత్తలంకలో బుధవారం షార్ట్‌సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో కొబ్బరి గోదాం దగ్ధమై రూ.90 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ఆ గ్రామానికి చెందిన గుత్తుల మల్లికార్జునరావుకు చెందిన కొబ్బరి గోదాంలో అదే గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి సత్యనారాయణ 2.50 లక్షల కురిడీ కొబ్బరికాయలను నిల్వ చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి కొబ్బరికాయలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.80 లక్షల విలువైన కొబ్బరికాయలు కాలి బూడిద కాగా రూ.10 లక్షల విలువైన గోదాం ధ్వంసమైంది. ముమ్మిడివరం అగ్నిమాపక అధికారి ఎస్.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. స్థానిక తహసీల్దార్ టి.సుభాష్, వీఆర్‌ఓ రెడ్డి సుబ్రహ్మణ్యం క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించి నష్టాలను నమోదు చేశారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
పిఠాపురం రూరల్: స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లప్రోలు టోల్ ప్లాజా సమీపాన గొరిఖండి కాలువలో బుధవారం గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. అతడు జీన్స్ ఫ్యాంటు, ఫుల్ హ్యాండ్ షర్ట్ ధరించి, ఫ్యాంటుకు బెల్టు ధరించి ఉన్నట్లు గుర్తించారు. మృతుడి కుడి చేతిపై ‘ఎస్‌ఆర్’ అని ఇంగ్లీషులో టాటూ, అలాగే ఎడమ చేతిపై ‘అమ్మ నాన్న‘ అని తెలుగులో, ‘శిరీషా‘ అని ఇంగ్లీషులో టాటూ గుర్తులు ఉన్నట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా అతని ఆచూకీ గుర్తించగలిగిన వారు పిఠాపురం సీఐ–9440796523 లేదా పిఠాపురం రూరల్ పోలీస్ ఎస్సై 9490760765 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.
సత్యదేవుని దర్శించుకున్న జిల్లా జడ్జి అహ్మద్
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామిని బుధవారం తూర్పుగోదావరి జిల్లా (రాజమహేంద్రవరం) ప్రిన్సిపల్ జడ్జి మౌలానా జునైద్ అహ్మద్ కుటుంబ సభ్యులతో కలసి దర్శనం చేసుకుని పూజలు చేశారు. ఆలయం వద్ద వారికి పండితులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీస్సులు అందజేసి స్వామివారి ఫొటో, ప్రసాదాలు అందజేశారు.


