అల్లవరం: దేవగుప్తం పంచాయతీ పరిధిలోని బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎదురుగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి హైఓల్టేజీ రావడంతో బుధవారం పద్మనాభం సూరిబాబు ఇంట్లోని ఇన్వర్టర్ పేలి రేకుల షెడ్డు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సూరిబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. కిచెన్‌లో వంట చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇన్వర్టర్ పేలి షెడ్డలో మంటలు వ్యాపించడంతో సూరిబాబు మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. ఆ మంటల ధాటికి అతడికి గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో షెడ్డులోని గృహోపకరణాలు కరిగిపోయాయి. మంటల వేడికి పైకప్పు రేకులు ధ్వంసం కాగా, కిటీకి అద్దాలు, డోర్లు కాలి బూడిదగా మిగిలాయి. అమలాపురం ఫైర్ ఇంజిన్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. అగ్ని ప్రమాదంతో రూ.2 లక్షల వరకు నష్టం ఉంటుందని బాధితుడు వాపోయాడు. సూరిబాబు భార్య అనారోగ్యంతో మరణించగా, ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. ఇంట్లో ఆయనొక్కరే నివాసం ఉంటున్నారు. చిన్నపాటి కిరాణాషాపుతో జీవనం సాగిస్తున్నారు. అగ్నిప్రమాదంలో గాయపడిన సూరిబాబుని పలువురు పరామర్శించారు. బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్‌కు ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌తో పలుమార్లు గృహోపకరణాలు ధ్వంసమయ్యాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
బాఽధితుడికి వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ
ఇన్వర్టర్ పేలి గాయాల పాలై అల్లవరం సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న సూరిబాబుని వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, మాజీ ఎంపీ చింతా అనురాధ బుధవారం పరామర్శించారు. సూరిబాబు ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడి చికిత్స అందించాలని కోరారు. వారి వెంట ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, జెడ్పీటీసీ కొనుకు గౌతమి, జిల్లా ఉపాధ్యక్షుడు యల్లమిల్లి బోసు, మండల పార్టీ అధ్యక్షులు కొనుకు బాపూజీ, వాసంశెట్టి వెంకటేశ్వరరావు, బర్రే సీతారత్నం తదితరులు పరామర్శించారు.


