సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని రూ.2.65 లక్షల స్వాహా
పి.గన్నవరం: సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.2.65 లక్షలు స్వాహా చేసిన ఓ యువతిపై పి.గన్నవరం పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. ఎస్సై బి.శివకృష్ణ కథనం ప్రకారం.. మండలంలోని ఎల్.గన్నవరం గ్రామానికి చెందిన అంకాని సత్యనారాయణ కుమార్తె లక్ష్మీ ప్రసన్న బీటెక్ పూర్తి చేసింది. ఉద్యోగం రాకపోవడంతో మేనల్లుడు మణికంఠ తెనాలికి చెందిన ఎన్.యువాంజలిన్ అనే యువతిని పరిచయం చేశాడు. ప్రసన్నకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వేయిస్తానని, ఇందుకు రూ.2.65 లక్షలివ్వాలని ఆమె అడిగింది. దీంతో గత ఏడాది ఆగస్టులో రూ.25 వేల నగదు, రూ.2.45 లక్షలు ఫోన్ పే ద్వారా యువాంజలిన్‌కు సత్యనారాయణ చెల్లించాడు. అదే నెలలో సైమాన్‌టెక్ అనే కంపెనీ పేరుతో లక్ష్మీ ప్రసన్నకు ఉద్యోగం వచ్చినట్టు కాల్ లెటర్ వచ్చింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆనందించారు. అయితే ఆరు నెలలు గడచినా కంపెనీ ప్రతినిధులు ఫోన్ చెయ్యకపోవడంతో హైదరాబాద్ వెళ్లి ఆరా తీశారు. కాల్ లెటర్‌లో ఉన్న అడ్రస్‌లో ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీ లేదు. దీంతో, తాము మోసపోయామని నిర్ధారించుకున్న సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శివకృష్ణ వివరించారు.
అభిప్రాయ వ్యక్తీకరణలో
మాతృ భాషదే పై చేయి
అమలాపురం టౌన్: వ్యక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడంతో మాతృ భాషదే పై చేయిగా ఉంటుందని డీఈవో పి.నాగేశ్వరావు, సమగ్ర శిక్షా ఏపీసీ జి.మమ్మీ తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన జిల్లా స్థాయి లాంగ్వేజ్ ఫెస్టివల్ బహుమతి ప్రదానోత్సవ సభలో వారు ముఖ్య అతిథులుగా ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ మాతృ భాషలోనే సరళంగా భావ వ్యక్తీకరణ చేయగలుగుతారని ఏపీసీ మమ్మీ పేర్కొన్నారు. మాతృ భాషపై అభిమానం పెంచేందుకు, ఆ భాషపై పట్టు సాధించేందుకు జిల్లాలోని పలు పాఠశాలల్లో సమగ్ర శిక్షా ద్వారా లాంగ్వేజ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నామని డీఈవో అన్నారు. ఈ కార్యక్రమానికి ముందు విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లిషు భాషల్లో కథారచన, పద్య పఠనం, వక్తృత్వం, నాటకాలు, రోల్ ప్లే, స్పెల్లింగ్, రీడింగ్ తదితర అంశాలపై పోటీలు నిర్వహించారు. పోటీల్లోని విజేతలకు డీఈవో, ఏపీసీలు బహుమతులు అందజేశారు. ఈ ఫెస్టివల్‌లో సమగ్ర శిక్షా సెక్టోరల్ అధికారులు బీవీవీ సుబ్రహ్మణ్యం, ఎంవీవీ సత్యనారాయణ, డీవైఈవో గుబ్బల సూర్య ప్రకాశం, జిల్లా ప్రభుత్వ పరీక్షల అధికారి బి.హనుమంతరావు, జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం, పాఠశాల హెచ్‌ఎం బీహెచ్ రామకృష్ణ పాల్గొన్నారు.
కనీస వేతనం
రూ.26 వేలు ఇవ్వండి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, తమకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు మూడు రోజుల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ఈ దీక్షలను కలెక్టరేట్ వద్ద సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్, కోశాధికారి మలకా రమణ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుబండి చంద్రావతి, కోశాధికారి రామలక్ష్మి మాట్లాడుతూ, అంగన్‌వాడీ కార్యకర్తలకు ఏడేళ్లుగా వేతనాలు పెంచలేదని అన్నారు. ఇదే సమయంలో ధరలు వందల రెట్లు పెరిగాయని, ఈ నేపథ్యంలో అంగన్‌వాడీలకు రూ.26 వేల కనీస వేతనం తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయాకు రూ.7 వేలు, టీచర్‌కు రూ.11,500 మాత్రమే చెల్లిస్తూ, ప్రభుత్వ వెబ్‌సైట్‌లో మాత్రం ప్రభుత్వోద్యోగులుగా నమోదు చేశారని, ఆ సాకుతో తమకు అన్ని సంక్షేమ పథకాలనూ తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ, పాండిచ్చేరి రాష్ట్రాల మాదిరిగా అంగన్‌వాడీలకు కూడా పీఆర్‌సీ వర్తింపజేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు ఆటపాటలతో విద్యనందించే అవకాశం లేకుండా ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌ఎస్ తీసుకువచ్చి పని ఒత్తిడి పెంచిందన్నారు. ఐసీడీఎస్ నిధులు తగ్గిస్తూంటే, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి, లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నించడం మానుకోవాలని, 2019లో నిర్ణయించిన మెనూ చార్జీలను నేటి ధరలకు అనుగుణంగా పెంచాలని, పెండింగులో పెట్టిన 168 సూపర్‌వైజర్ పోస్టులను తక్షణం భర్తీ చేయాలని, బాలింతలకు ఇచ్చే బియ్యం, పప్పు, ఆయిల్ నాణ్యతను పెంచాలని డిమాండ్ చేశారు.


