సరకు విలువ రూ.13.80 లక్షలు
ఆలమూరు: నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న రేషన్ బియ్యం, లారీని స్థానిక పోలీసులు సీజ్ చేశారు. స్థానిక ఎంఎస్‌ఓ పి.వెంకటేశ్వరరావు, ఎస్సై జి.నరేష్ కథనం ప్రకారం విజయవాడ పరిసర ప్రాంతాలలో కొనుగోలు చేసిన 600 రేషన్ బియ్యం బస్తాలలోని 30 టన్నుల బియ్యాన్ని లారీలో కాకినాడకు తరలిస్తున్నారు. అయితే మండలంలోని జొన్నాడ ఏటిగట్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు ఈ సరకును గుర్తించారు. దీనిపై పోలీసులు ఆరా తీయగా లారీ యజమాని కాకినాడకు చెందిన కె.చంద్రశేఖర్ అని డ్రైవర్ ఎ.శివకృష్ణ మణికంఠ తెలిపారు. సీజ్ చేసిన బియ్యం విలువ రూ.13.8 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ బియ్యాన్ని మండపేట మండలంలోని వేములపల్లి గోడౌన్ లో దిగుమతి చేసి, లారీని ఆలమూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు ఎస్సై నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
దేవరపల్లి: విద్యుదాఘాతానికి గురై గోపాలపురంలో ఓ వ్యక్తి బుధవారం దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన చింతలపూడి శ్రీనివాస్ (35) స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో విద్యుత్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ విద్యుత్ తీగల మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ ప్రవహించడంతో స్తంభం పైనే అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కొన ఊపిరితో ఉన్న అతడిని చికిత్స కోసం గోపాలపురంలోని సామాజిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. శ్రీనివాస్‌కు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. పని చేస్తున్న ప్రదేశంలో నాలుగు లైన్లను అసిస్టెంట్ లైన్‌మెన్ ఎల్‌సీ(లైన్ క్లియరెన్స్) తీసుకుని, పనులు చేశారని, తీగలకు సరఫరా ఏలా వచ్చిందో తెలియడం లేదని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. శ్రీనివాస్ ప్రైవేటు కార్మికుడిగా పనిచేస్తున్నాడని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పి.మనోహర్ చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
శంఖవరం: కత్తిపూడి జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలయ్యాయి. అన్నవరం పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్నా తమ్మయ్యదొర పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు దాటుతుండగా రాజమండ్రి నుంచి తుని వైపు వెళ్తున్న బోలెరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. అన్నవరం పోలీసులు చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్సై శ్రీహరిబాబు కేసు నమోదుచేశారు.
రోడ్డు ప్రమాదం కేసులో ఆరు నెలల జైలు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): రోడ్డు ప్రమాదం కేసులో రాజమహేంద్రవరం ఆర్యాపురానికి చెందిన మామిడి శ్రీనాఽథ్ అనే వ్యక్తికి ఆరు నెలలు జైలుశిక్ష విఽధిస్తూ ఐదో ఏజేఎఫ్‌సీఎం మెజిస్ట్రేట్ జి.శ్రీనివాసరెడ్డి బుధవారం తీర్పునిచ్చారు. కొప్పిశెట్టి సునీల్‌కుమార్ 2020 ఆగస్టు 25న పొలం పని మీద బయటికి వెళ్లి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంటికి వస్తున్నాడు. అప్సర థియేటర్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న శ్రీనాఽథ్ తన ఆటోతో వేగంగా ఢీకొట్టాడు. దీంతో సునీల్‌కుమార్ తన మోటార్ సైకిల్‌తో సహా కింద పడిపోయి కుడికాలుకు బలమైన గాయమై స్పృహతప్పాడు. అతడిని స్థానిక ఆర్థోపెటిక్ హాస్పిటల్‌లో చేర్పించి వైద్య చికిత్స అందించారు. కేసు విచారణలో నిజనిర్ధారణ కావడంతో న్యాయమూర్తి పై తీర్పు వెలువరించారు. కేసును అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ మోహన్‌రావు వాదించారు. త్రీటౌన్ ఎస్సై భీమరాజు సాక్షులను ప్రవేశపెట్టి, కేసుకు సహాయ సహకారాలు అందించారు.


