సాక్షి, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: మలికిపురం మండలం ఇరుసుమండ ఓఎన్జీసీ మోరి బావి నంబరు ఐదులో సంభవించిన బ్లో అవుట్ కొనసాగుతోంది. భూగర్భం నుంచి వచ్చే గ్యాస్ ఒత్తిడి తగ్గడం వల్ల మంటల తీవ్రత మంగళవారం మధ్యాహా్ననికి చాలా వరకూ తగ్గింది. అయితే గ్యాస్ ఒత్తిడి పెరిగినప్పుడు మళ్లీ మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఈ బావికి పూర్తి స్థాయిలో వెల్ క్యాపింగ్ (మూసేయడం) చేయడంపై అధికారులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు.
పన్నెండేళ్ల క్రితం కూడా ఇలాగే డ్రిల్లింగ్ సమయంలో గ్యాస్ ఒత్తిడి నిలకడగా లేక ఇబ్బంది పడిన ఇంజినీర్లు ఈ బావిని అప్పట్లో మూసివేశారు. ఇప్పుడు కూడా నిలకడ లేకుండా గ్యాస్ ఉబికి వస్తుండటంతో వారు తలలు పట్టుకుంటున్నారు.రాజమహేంద్రవరం, నరసాపురం, తూర్పుపాలెం గ్యాస్ కలెక్షన్ స్టేషన్ల (జీసీఎస్) నుంచి విపత్తు నివారణ బృందాలు ఘటన ప్రాంతానికి చేరుకున్నాయి. గ్యాస్, చమురు కలిసి మండుతున్నందున మంటల తీవ్రత, చుట్టూ అలముకున్న వేడిని తగ్గించేందుకు ఫైర్ ఇంజిన్ల ద్వారా నీటిని జల్లుతున్నారు.
మంటల తీవ్రతకు బావి వద్ద రిగ్ పడిపోవడంతో పాటు, పైపులూ కరిగిపోయాయి. మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో అధికారులు, ఇంజినీర్లు దూరం నుంచే పర్యవేక్షిస్తున్నారు. ఈ బావిలో సుమారు 40 వేల మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉందని భావిస్తున్నారు. భూగర్భంలో పరిస్థితిని అంచనా వేయడంలో ఇంజినీరింగ్ నిపుణులు నిమగ్నమయ్యారు. ఎన్ని మీటర్ల లోతు నుంచి పైప్‌లైన్ దెబ్బ తిందనే దానిపై అంచనా వేస్తున్నారు. ఈలోపు ప్రత్యేక జాకెట్లతో నిపుణులు మంటల్లోనే బావి వద్దకు వెళ్లే అవకాశం ఉంది. బావి వద్ద కరిగిపోయిన ఐరన్ పైపులు, రిగ్ మెటీరియల్ తొలగించి, వెల్‌కు సరిపడే క్యాప్ డిజైన్ చేయాల్సి ఉంది. దీనికి అణుగుణంగా ఘటన స్థలానికి వెల్‌క్యాప్, భారీ క్రేన్‌లను తరలించారు.
ఒకేసారి అదుపు చేయడం వల్ల ఇబ్బందులు
ఒకేసారి మంటలు అదుపు చేయడం వల్ల శాస్త్రీయంగా, పర్యావరణపరంగా ఇబ్బందులు తలెత్తుతాయని, ఈ నేపథ్యంలో క్రమక్రమంగా నాలుగు రోజుల్లో మంటలను అదుపు చేయనున్నట్టు ఓఎన్జీసీ వర్గాలు చెబుతున్నాయి. బోరు బావికి వారం రోజుల్లో క్యాపింగు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు పేర్కొంటున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రత్యేక నిపుణులతో కూడిన గ్యాస్ లీకేజీ నియంత్రణ బృందాలు రెండు ముంబై నుంచి డ్రిల్లింగ్ ప్రాంతానికి చేరుకున్నాయి.
పునరావాస కేంద్రాల్లోనే రెండు గ్రామాల ప్రజలు
మరోవైపు సమీపంలోని రెండు గ్రామాల ప్రజలు చాలా మంది ఇంకా పునరావాస కేంద్రాల్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇళ్లకు తాళాలు వేసుకుని వస్తే రాత్రి దొంగలు పడి దోచేశారని ఒకరు, తమ పెంపుడు మేకలను దొంగలు ఎత్తుకు పోయారని మరొకరు చెప్పారు. ప్రాణాలు అర చేతుల్లో పట్టుకుని కట్టుబట్టలతో వస్తే పునరావాస కేంద్రాల్లో అరకొర సౌకర్యాలు ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. బ్లో అవుట్ జరిగిన ప్రాంతాన్ని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలోని బృందం పరిశీలించింది. బ్లో అవుట్ జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకుంది. పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ), పార్టీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ప్రైవేట్ కంపెనీలతోనే ముప్పు
ఓఎన్జీసీ పరిధిలోని బావుల డ్రిల్లింగ్‌ను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం వల్లే తరచూ కోనసీమలో బ్లో అవుట్లు చోటుచేసుకుంటున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఇరుసుమండ ఓఎన్జీసీ మోరి బావి–5లో జరిగిన ప్రమాదంతో ఈ వాదన తెర మీదకు వచి్చంది. ఇక్కడ డ్రిల్లింగ్ పనులను గుజరాత్‌కు చెందిన డీప్ ఇండస్ట్రీకి ఓఎన్జీసీ అప్పగించింది. ప్రమాదం జరిగే అవకాశముందని పన్నెండేళ్ల క్రితం మూసివేసిన ఈ బావిలో తిరిగి డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో భయపడినట్టుగానే మంటలు ఎగసిపడ్డాయి. గతంలో కాట్రేనికోన మండలం ఉప్పూడిలోనూ కోల్‌కతాకు చెందిన పీఎఫ్‌హెచ్ సంస్థ లీజుకు తీసుకుని డ్రిల్లింగ్ చేస్తున్న బావి వద్దనే బ్లో అవుట్ చెలరేగింది.
48 గంటల పాటు శ్రమిస్తేనే కానీ మంటలను అదుపు చేయలేకపోయారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఓఎన్జీసీ సంస్థ బావుల్లో సుమారు 2,600 మీటర్ల వరకూ డ్రిల్లింగ్ చేసి, ఆ పరిధిలో ఉన్న చమురు, సహజ వాయువులు వెలికితీస్తోంది. ఆ తరువాత వాటిని మూసివేస్తోంది. కొంత కాలం తరువాత వాటిని ప్రైవేట్ కంపెనీలకు లీజుకు ఇస్తోంది. పెద్దగా అనుభవం లేని ఆ సంస్థలు మరింత లోతుగా డ్రిల్లింగ్ చేపడుతున్న సమయంలో సాంకేతిక కారణాల వల్ల బ్లో అవుట్లతో మంటలు రేగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.


