21న థియేటర్లలో 21 సినిమాలు రిలీజ్.. ఏది హిట్? ఏది ఫట్? | November 21st Movie Releases Telugu And Result | Sakshi
Sakshi News home page

Theatre Movies: ఒకేసారి ఇన్ని మూవీస్.. ఒక్కటి తప్పితే మిగిలినవన్నీ అంతే

Nov 22 2025 8:06 PM | Updated on Nov 22 2025 8:13 PM

November 21st Movie Releases Telugu And Result

'ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదు'.. టాలీవుడ్ నిర్మాతలు పదేపదే చెప్పే మాట. ప్రతిదానికి ప్రేక్షకుడినే నిందిస్తుంటారు తప్పితే తప్పు ఎక్కడ జరుగుతుందో చూసుకోరు. ఎందుకంటే ప్రేక్షకుడు అంటే అంత అలుసు. ఈ వారమే తీసుకుందాం. ఏకంగా 21 సినిమాలు థియేటర్లలో రిలీజైతే వీటిలో తెలుగు చిత్రాలు 16 ఉన్నాయి. పోనీ వీటిలో ఏమైనా బాగున్నాయా అంటే లేదు! ఉన్నంతలో ఒక్కదానికే పాజిటివ్ టాక్ వచ్చింది. మరి మిగతా వాటి సంగతేంటి? వాటి గురించి ఆడియెన్స్ ఏమనుకుంటున్నారు?

(ఇదీ చదవండి: 'వార్ 2' ఫలితంపై హీరో సెల్ఫ్ ట్రోలింగ్.. వీడియో వైరల్)

చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా పడే కష్టం ఒకటే. ఎందుకంటే ఒక మూవీ తీయాలంటే వందలాది మంది కష్టపడాలి. కష్టపడితే సరిపోదు దాన్ని ప్రేక్షకుడి వరకు చేరేలా చూడాలి. కానీ టాలీవుడ్‌లో కొందరి తీరు చూస్తుంటే జాలేస్తుంది. ఈ వారమే తీసుకోండి. 20కి పైగా మూవీస్ థియేటర్లలో రిలీజయ్యాయి. వీటిలో తెలుగువి కూడా చాలానే ఉన్నాయి. కానీ ప్రేక్షకులకు రెండు మూడింటివి తప్పితే మిగతా వాటి పేర్లు కూడా తెలీదు. కనీసం తెలిసేలా చేయనప్పుడు రిలీజ్ చేయడం ఎందుకనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న.

ఈ వారం వచ్చిన వాటిలో కాస్తోకూస్తో పబ్లిసిటీతో వచ్చినవి మూడో నాలుగు సినిమాలు మాత్రమే ఉన్నాయి. వీటిలో 'రాజు వెడ్స్ రాంబాయి'కి మాత్రమే పాజిటివ్ టాక్ వచ్చింది. ఉన్నంతలో దీన్ని చూసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. మిగతా వాటి విషయానికొస్తే అల్లరి నరేశ్ హీరోగా చేసిన '12ఏ రైల్వే కాలనీ' మూవీని థ్రిల్లర్ జానర్‌లో తీశారు. కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర తేలిపోయేలా కనిపిస్తుంది. ప్రియదర్శి 'ప్రేమంటే' కూడా రిలీజ్‌కి ముందు ఇదో ప్రేమకథ అన్నట్లు ప్రచారం చేశారు. తీరాచూస్తే ఇదో దొంగలైన భార్యభర్త కథ. దీని కంటెంట్ కూడా అంతంత మాత్రమే ఉంది. ఇది కూడా నిలబడటం కష్టమే.

(ఇదీ చదవండి: 'రాజు వెడ్స్ రాంబాయి' తొలిరోజు కలెక్షన్ ఎంత?)

ఈ మూడు కాకుండా రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్' ఓ కామెడీ మూవీ. అసలు ఇదొకటి వచ్చిన సంగతి కూడా జనాలకు తెలియదు. వీటితో పాటు కలివనం, శ్రీమతి 21 ఎఫ్, జనతా బార్, ఇట్లు మీ ఎదవ, క్షమాపణ గాధ, మఫ్టీ పోలీస్, హ్యాపీ జర్నీ, ఫేస్ టూ ఫియర్ లెస్, ప్రేమలో రెండోసారి, డ్యూయల్, కొదమ సింహం రీ రిలీజ్, ఆవారా రీ రిలీజ్.. ఇలా బోలెడన్ని చిత్రాలు వచ్చాయి. వీటిలో ఒక్కటైనా హిట్ అయిందా అంటే లేదు. అసలు ఇవి రిలీజ్ అయ్యాయనే సంగతి కూడా ప్రేక్షకులకు చేరువ చేయలేకపోయారు.

చిన్నదా పెద్దదా అనే సంగతి పక్కనబెడితే.. ఇంతా కష్టపడి ఓ సినిమా తీసి, దాన్ని పోటీలో రిలీజ్ చేయడం అవసరమా? లేదంటే ఖాళీగా ఉండే వారంలో విడుదల చేయడం మంచిదా అనేది నిర్మాతలే ఆలోచించుకోవాలి. అలా చేస్తే ఒకరో ఇద్దరో ప్రేక్షకులైనా మీ చిత్రాలకు వస్తారు. చిన్న చిత్రాలు తీసే నిర్మాతలందరూ ఈ విషయంలో కాస్త దృష్టి పెట్టాలి. ఏదో తీశామా, థియేటర్లలో రిలీజ్ చేశామా అని వదిలేయకుండా కాస్త కంటెంట్‌పై కూడా దృష్టి పెడితే మంచిది. అలానే సరైన తేదీన రిలీజ్ కూడా ముఖ్యమే. ఇలాంటివేం చేయకుండా ప్రేక్షకుల్ని నిందించడం మాత్రం సరికాదు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9: అనుకున్నట్లే ఈ వారం ఆమెనే ఎలిమినేట్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement