
మనదేశం నుంచి 1,756 కోట్ల విజిట్స్ నమోదు
ఇటీవల హైదరాబాద్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద సినీ పైరసీ గుట్టు రట్టు చేశారు. ఐదేళ్లలో 1,050 సినిమాలను పైరసీ చేసిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పైరసీపై చర్చ మొదలైంది. భారత వినోద పరిశ్రమకు పైరసీ ‘బొమ్మ’ చూపిస్తోంది. విడుదలైన రోజే పైరసీ వెబ్‌సైట్లలో సినిమా దర్శనమిస్తోంది. అంతేకాదు పైరసీ భూతం చట్టానికే సవాల్ విసురుతోంది. పైరసీ సమస్య (Piracy Problem) ఒక్క సినిమా పరిశ్రమకే కాదు.. టీవీ, మ్యూజిక్, సాఫ్ట్‌వేర్, పబ్లిషింగ్ రంగాలకూ విస్తరించింది.
ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది పైరసీ వెబ్‌సైట్ల విజిట్స్ 21,630 కోట్లు నమోదయ్యాయి. 2024లో మొత్తం పైరసీ ట్రాఫిక్‌లో మనదేశ వాటా 8.12%. అంటే మన దేశం నుంచి 1,756 కోట్ల విజిట్స్ నమోదయ్యాయన్నమాట. పబ్లిక్, ప్రైవేట్ టొరెంట్స్, వెబ్ ఆధారంగా ఫిల్మ్, టీవీ, మ్యూజిక్ స్ట్రీమింగ్; సాఫ్ట్‌వేర్, పబ్లిషింగ్ రంగాలలో ప్రపంచ పైరసీ ట్రెండ్స్‌ను పర్యవేక్షిస్తున్న డేటా కంపెనీ ‘మ్యూసో’.. ‘పైరసీ ట్రెండ్స్ అండ్ ఇన్ సైట్ రిపోర్ట్ 2024’ అనే నివేదిక రూపొందించింది. దీని ప్రకారం పైరసీ వెబ్‌సైట్ల వీక్షకుల సంఖ్యలో 12% వాటాతో అమెరికా (America) తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో భారత్ ఉంది. మొదటి స్థానం మనదే
మొదటి స్థానం మనదే
మ్యూసో 2023 నివేదిక ప్రకారం ప్రపంచ చలనచిత్ర పైరసీలో మనదే పైచేయి. మొత్తం పైరసీలో 30.58% వాటా మన దేశానిదే. యూఎస్ 6.26%, టర్కీ 5.75% వాటాతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. పైరసీ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని చూసేవారితో (49.6 శాతం) పోలిస్తే.. అప్పటికప్పుడే చూసే (స్ట్రీమింగ్) వాళ్లు కాస్త ఎక్కువ ఉండటం (50.4 శాతం) గమనార్హం. వినోదం ఇప్పటికీ ఖరీదుగా ఉండడం, అందుబాటు విషయంలో కస్టమర్ల అంచనాలను అందుకోలేకపోవడం వల్లే పైరసీ కొనసాగుతోందని నివేదిక వెల్లడించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా 2023తో పోలిస్తే గత ఏడాది ఈ–బుక్స్, ఆడియో బుక్స్, పేపర్స్, మ్యాగజైన్స్ వంటి పబ్లిషింగ్ రంగంలో పైరసీ 4.3% పెరిగింది.

జీఎస్టీ నష్టం రూ.4,313 కోట్లు
ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ‘ద రాబ్ రిపోర్ట్ 2024’ ప్రకారం.. 2023లో భారత వినోద పరిశ్రమ పైరసీ కారణంగా రూ.22,400 కోట్ల నష్టాన్ని చవి చూసింది. ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లకు రూ.8,700 కోట్లు, థియేటర్లకు రూ.13,700 కోట్ల నష్టం వాటిల్లింది. మొత్తంగా ప్రభుత్వానికి జరిగిన జీఎస్టీ నష్టం రూ.4,313 కోట్లు.
- సాక్షి, స్పెషల్ డెస్క్