పి. మహేశ్‌బాబు, ఉపేంద్ర, వై. రవిశంకర్
‘‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా కథ విన్నప్పుడు థ్రిల్ అయ్యాను. ఎమోషనల్‌గా అద్భుతంగా అనిపించింది. కానీ ఈ సినిమా టైటిల్ చెప్పినప్పుడు కాస్త టెన్షన్ గా అనిపించింది. నేనెలా ఆంధ్ర కింగ్ అవుతానని అనిపించింది. కానీ ఇప్పుడు అనిపిస్తోంది. ఇక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా ఆంధ్ర కింగ్స్. నేను కింగ్‌లా ఫీల్ అవుతున్నాను అంటే అది మీ (ప్రేక్షకులు, అభిమానులను ఉద్దేశించి) గొప్పతనం’’ అని ఉపేంద్ర అన్నారు. రామ్, భాగ్యశ్రీ భోర్సే హీరో హీరోయిన్లుగా, ఉపేంద్ర ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలైంది.
తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన థ్యాంక్స్ మీట్‌లో ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకు ఇంత మంచి స్పందన ఇస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. మహేశ్‌గారు అద్భుతమైన సినిమా తీశారు. హీరో, ఆ హీరో అభిమాని మధ్య ఉన్న డివైన్ ఎమోషన్ ని చక్కగా చూపించారు. నా ఫ్యాన్ సాగర్ (సినిమాలో రామ్ పాత్ర), మహాలక్ష్మి (భాగ్యశ్రీ) ఈ సినిమాను అమెరికాలో ప్రమోట్ చేస్తున్నారు’’ అన్నారు.
‘‘ఈ చిత్రంలో రామ్, ఉపేంద్రగార్లు ఓ మ్యాజిక్ చేశారు. మంచి టీమ్‌తో పని చేసినప్పుడు వండర్స్ జరుగుతాయి. అలాంటి వండర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. నన్నో బ్రదర్‌లా చూసుకున్న నిర్మాతలు నవీన్ , రవిశంకర్‌గార్లకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను’’ అని తెలిపారు పి. మహేశ్‌బాబు. ‘‘ఈ చిత్రంలోని రామ్, ఉపేంద్రగార్ల కాంబినేషన్ సీన్స్, వారి నటన గురించి అభినందనలు వస్తున్నాయి. దర్శకుడిగా మహేశ్‌కి మంచి పేరు వచ్చింది. ఇది చాలా లాంగ్ రన్ ఉన్న సినిమా’’ అని అన్నారు వై. రవిశంకర్. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్‌కేఎన్ , మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్–మెర్విన్ మాట్లాడారు.


