ఆది, సంయుక్త, బోయపాటి శ్రీను, బాలకృష్ణ, తమన్, రామ్ ఆచంట, గోపి ఆచంట
‘‘నేను పాదరసంలాంటివాణ్ణి.. ఏ పాత్రలో అయినా ఒదిగి పోతా. నా సినిమా ఉగాది పచ్చడిలాంటిది.. అన్ని రుచులు ఉంటాయి. డిసెంబరు 5న థియేటర్లలో అఖండ తాండవం చూస్తారు’’ అని బాలకృష్ణ చెప్పారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ, సంయుక్త జంటగా నటించిన చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఆది పినిశెట్టి విలన్‌గా నటించారు. ఎం. తేజస్విని సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 5న విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘నేను, బోయపాటి సినిమా చేయాలనుకుంటే మూడే నిమిషాలు మాట్లాడుకుంటాం.. నాలుగో నిమిషం ఆ మహాయజ్ఞంలోకి దిగి పోతాం. రామ్, గోపీగార్లు కానీ, నేను కానీ విజయాలకు పొంగి పోం.. అపజయాలకు కృంగి పోం.. నా అభిమానులూ అంతే. మన సినిమా విడుదల సందర్భంగా జీవహింస చేయొద్దని నా అభిమానులను కోరుతున్నా. వాటికి కూడా జీవించే హక్కు ఉంది’’ అని తెలిపారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘‘చిత్ర పరిశ్రమ ఒక్కరిది కాదు.. అందరిది. ఇక్కడ కుల, మత, భేదాలు లేవు. ప్రజలకు మంచి చెప్పాలి, వినోదం పంచాలన్నది మాత్రమే ఉంటుంది. మన ‘అఖండ 2’ సక్సెస్ కొట్టాలి. ‘ది రాజా సాబ్’ కూడా విజయం సాధించాలి. ఆ తర్వాత వచ్చే చిరంజీవిగారి ‘మన శంకర వరప్రసాద్‌గారు’ కూడా హిట్ కావాలి. ఇలా పరిశ్రమ బాగుండాలి. అప్పుడే అందరూ బాగుంటారు’’ అని తెలిపారు.
గోపి ఆచంట మాట్లాడుతూ– ‘‘బోయపాటి, బాలకృష్ణగారి కాంబినేషన్‌లో వచ్చిన మూడు చిత్రాల కంటే ‘అఖండ 2’ బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు. తమన్ మాట్లాడుతూ– ‘‘రామ్ ఆచంట, గోపి ఆచంట, అనీల్ సుంకరగార్లతో ‘దూకుడు, ఆగడు’ వంటి సినిమాలు చేశాను. ఆ చిత్రాల తర్వాత ‘అఖండ 2’ కోసం పనిచేయడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు.


