రజనీకాంత్‌ని సత్కరిస్తున్న ప్రమోద్ సావంత్
‘‘సినిమాను సెలబ్రేట్ చేసుకోవడం కోసం మనందరం ఈ రోజు ఇక్కడ సమావేశమయ్యాం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కథలను సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ రోజు ఈ వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుతో ఈ ఫెస్టివల్ ముగినట్లు కాదు... సృజనాత్మక ఆలోచనలు, ప్రపంచవ్యాప్త సినీ కళాకారుల సమ్మేళనానికి ఓ నిదర్శనం. ఇఫీలోని మరో కొత్త అధ్యాయానికి మరో ముందడుగు’’ అని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. గోవా వేదికగా ఈ నెల 20న మొదలైన ‘ఇఫీ’ (ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకలు శుక్రవారం (నవంబరు 28)తో ముగిశాయి. సినీ పరిశ్రమలో నటుడిగా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు రజనీకాంత్‌ని ఈ వేడుక చివరి రోజున గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సత్కరించారు.
ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ – ‘‘యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు సత్కరించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ‘ఇఫీ’ వేడుకలను నిర్వహిస్తున్న గోవా ప్రభుత్వానికి శుభాకాంక్షలు. సినిమాల్లో నాకు యాభై సంత్సరాలు పూర్తయ్యాయి. కానీ నాకు మాత్రం పదో–పదిహేనో సంవత్సరాలు పూర్తయినట్లుగా ఉంది. నటనను, సినిమాను ప్రేమిస్తున్నందువల్లే ఇలా అనిపిస్తోంది. నాకు వంద జన్మలున్నా నేను ప్రతి జన్మలోనూ నటుడిగానే, రజనీకాంత్‌గానే పుట్టాలనుకుంటాను. దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, టెక్నిషియన్స్... ఇలా ఇండస్ట్రీతో పాటుగా నా జర్నీలో కూడా భాగమైన వారందరికీ నా ఈ 50 ఏళ్ల సత్కారం దక్కుతుంది’’ అని రజనీకాంత్ అన్నారు.
భారత సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎల్. మురుగన్ మాట్లాడుతూ – ‘‘ఇండియన్ సినిమాను గ్లోబల్ స్టేజ్‌కి తీసుకెళ్లడమే ‘ఇఫీ’ లక్ష్యం. గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోదీగారి నేతృత్వంలో ఈ ఏడాది మేలో తొలిసారిగా ‘వేవ్స్ – 2025’ (వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్ మెంట్ సమ్మిట్) జరిగింది. ఇఫీలో ‘వేవ్స్ బజార్ –2025’ను ఏర్పాటు చేశాం. ఈ ఏడాది రూ. 1000 కోట్ల బిజినెస్ జరిగిందని గర్వంగా చెప్పగలను. నరేంద్ర మోదీగారు మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తారు. ఈ ఏడాది ‘ఇఫీ’లో మహిళా దర్శకులు తీసిన యాభై సినిమాలు ప్రదర్శితమయ్యాయి’’ అని చెప్పారు.
ఈ చిత్రోత్సవాల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌కి అందించే ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డును వియత్నాం ఫిల్మ్ మేకర్ యాష్ మేఫెయిర్ డైరెక్ట్ చేసిన ‘స్కిన్ ఆఫ్ యూత్’ దక్కించుకుంది. ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు విభాగంలో కరణ్ సింగ్ త్యాగి (‘కేసరి చాప్టర్ 2’)కి దక్కింది. ఇక ‘ఇఫీ’ వేడుక చివరి రోజున ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ఇండియన్ పనోరమా విభాగం) స్క్రీనింగ్ అయింది. ఇందులో భాగంగా చిత్రనిర్మాత ‘దిల్’ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఇంకా రణ్‌వీర్ సింగ్, రిషబ్ శెట్టి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.


