అందం, అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు మహానటి సావిత్రి. డిసెంబరు 6న ఆమె 90వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డిసెంబరు 1 నుంచి 6వ తేదీ వరకు ‘సావిత్రి మహోత్సవ్’ పేరిట ఉత్సవాలు నిర్వహించనున్నట్లుగా సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘మా మాతృమూర్తి సావిత్రిగారి 90వ జయంతి వేడుకలను హైదరాబాద్ రవీంద్రభారతిలో ‘సావిత్రి మహోత్సవ్’ పేరిట నిర్వహించనున్నాం.
సంగమం ఫౌండేషన్‌తో కలిసి నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో డిసెంబరు 1 నుంచి 5 వరకు సావిత్రిగారి సినిమాల ప్రదర్శన, పాటల పోటీలు ఉంటాయి. డిసెంబరు 6న జరిగే జయంతి సభలో ‘మహానటి’ చిత్రదర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్‌లను, ‘సావిత్రి క్లాసిక్స్’ పుస్తక రచయిత సంజయ్ కిశోర్, ప్రచురణకర్త బొల్లినేని కృష్ణయ్యలను సత్కరిస్తాం’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


