ప్రస్తుతం టాలీవుడ్‌లో పరిస్థితులు ఏం బాగోలేవు. భారీ బడ్జెట్ సినిమాల దగ్గర నుంచి చిన్న సినిమాల వరకు పెట్టుబడికి వచ్చిన కలెక్షన్స్‌కి అస్సలు సంబంధం ఉండటం లేదు. గత కొన్నాళ్ల నుంచి అయితే హీరోల రెమ్యునరేషన్ల విషయంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా రిలీజైన కొన్ని సినిమాలకు హీరోలు, పారితోషికం తీసుకోకుండానే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇదే టాపిక్‌పై మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పందించారు.
(ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)
మైత్రీ మూవీస్ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా 'ఆంధ్ర కింగ్ తాలూకా'. రామ్ హీరోగా నటించాడు. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న దృష్ట్యా.. మీడియా మీట్ నిర్వహించారు. నిర్మాత రవిశంకర్.. తెలుగు హీరోలు, వాళ్ల రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. 'ఆంధ్ర కింగ్ తాలూకా'లో నటించినందుకుగానూ రామ్ రెమ్యునరేషన్ తీసుకోలేదని, బదులుగా నైజాం, గుంటూరు డిస్ట్రిబ్యూషన్ హకుల్ని తీసుకున్నారని తెలిపారు. మిగతా హీరోల గురించి మీడియా నుంచి ప్రశ్న ఎదురవగా ఒక్కొక్కరి గురించి చెప్పుకొచ్చారు.
'రెమ్యునరేషన్ విషయంలో ఎన్టీఆర్ అయినా, ప్రభాస్ అయినా ఎప్పుడుంటే అప్పుడివ్వండనే టైపు.. 'మీకు మిగిలితేనే ఇవ్వండి లేకపోతే లేదు' అని పవన్ కల్యాణ్ అన్నారు. 'పుష్ప' రిలీజ్ అయిన ఏడాది వరకూ అల్లు అర్జున్‌కు పూర్తి రెమ్యూనరేషన్ మేం ఇవ్వలేదు. 'రంగస్థలం' సినిమాకు రామ్ చరణ్ రెమ్యునరేషన్ నాలుగు కోట్లు ఎంతో మేం బ్యాలెన్స్ ఉన్నాం. నాకు అవసరం అయినప్పుడు తీసుకుంటా అని, అప్పుడొక ఇరవై, అప్పుడొక పాతిక లక్షల చొప్పున రెండేళ్లు తీసుకున్నారు. మా వరకూ అందరు హీరోలూ సహకరించారు' అని నిర్మాత రవిశంకర్.. తెలుగు హీరోలతో తమ బాండింగ్ గురించి వెల్లడించారు.
(ఇదీ చదవండి: 'ఆంధ్ర కింగ్ తాలూకా' మొదటి రోజు కలెక్షన్ ఎంత?)


