మీరు ఏ వయసు వాళ్లయినా సరే ఎప్పుడో ఓసారి ఏదో ఓ సినిమా.. థియేటర్‌లో చూసే ఉంటారు కదా! అలానే ప్రతి శుక్రవారం టాలీవుడ్‌లో కావొచ్చు బాలీవుడ్‌లో కావొచ్చు.. కొత్త మూవీస్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. అయితే ప్రతిసారీ శుక్రవారమే ఎందుకు రిలీజ్ చేస్తున్నారనని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కారణం ఏంటి? లేదంటే మరేదైనా నమ్మకాలు ఉన్నాయా?
(ఇదీ చదవండి: పైరసీ ఎప్పుడు మొదలైంది? ఎందుకు దీన్ని ఆపలేకపోతున్నారు?)
మన దేశంలో శుక్రవారమే సినిమాలని విడుదల చేయాలనే ఆచారం మొదటి నుంచి ఏం లేదు. 1940-50ల్లో వారంలో ఎప్పుడు పడితే అప్పుడు రిలీజ్ చేసేవారు. కానీ 1960లో 'మొఘల్ ఏ ఆజం' అనే హిందీ సినిమా.. ఆగస్టు 5న విడుదలై అద్భుతమైన ప్రేక్షకాదరణ దక్కించుకుంది. దీంతో అప్పటినుంచి చాలామంది నిర్మాతలు.. శుక్రవారం కొత్త చిత్రాలని విడుదల చేస్తూ వచ్చారు. అలా అదో అలవాటుగా మారిపోయింది. శుక్రవారం అనే కాదు.. గురువారం, శనివారం కూడా కొన్నిసార్లు సినిమాల్ని రిలీజ్ చేస్తుంటారు. తెలుగులో ఇలాంటి సందర్భాలు ప్రస్తుతం అప్పడప్పుడు కనిపిస్తుంటాయి.
శుక్రవారమే రిలీజ్ చేయడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది వీకెండ్ కలిసొస్తుందని. చాలా కంపెనీల్లో శుక్రవారంతో వర్క్ పూర్తవుతుంది. శని, ఆదివారాలు సెలవులు ఉంటాయి. వరసగా సెలవులు కావడం వల్ల చాలామంది ఫ్రెండ్స్, ఫ్యామిలీస్.. సినిమాల్ని చూసేందుకు ఇష్టపడతారు. మిగతా రోజుల్లో వీళ్లకు సినిమాలు చూసేంత తీరిక ఉండదు. అలా కూడా శుక్రవారం ట్రెండ్ పాతుకుపోయింది.
స్వాతంత్ర్యం వచ్చాక చాలా ఏళ్ల పాటు మన దేశంలో కలర్ టీవీలు అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రజలు.. సినిమాలని థియేటర్‌కి వెళ్లి మాత్రమే చూసేవారు. దీంతో అప్పట్లో కంపెనీలన్నీ శుక్రవారం.. సగం రోజు తర్వాత సెలవుగా ప్రకటించేవి. తద్వారా ఉద్యోగులు.. తమ కుటుంబ సభ్యుల్ని తీసుకుని థియేటర్లకు వెళ్లేవారని కూడా అంటుండేవారు.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన 20 మూవీస్)
ఇవన్నీ సాధారణంగా అనుకునేవి. కానీ శుక్రవారం రిలీజ్ విషయంలో మతపరమైన కారణాలు ఉన్నాయనేది మరికొందరి వాదన. లక్ష‍్మీ దేవికి శుక్రవారం చాలా ఇష్టమైన రోజు. హిందూ సంప్రదాయంలో శుక్రవారం నాడు చాలామంది కొత్త పనిని ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలా సినిమాలని కూడా ఇదేరోజున విడుదల చేస్తే మంచి కలెక్షన్స్, లాభాలు వస్తాయనేది చాలామంది నిర్మాతల నమ్మకం.
జ్యోతిష్యంలోనూ శుక్రవారానికి మంచి సంబంధం ఉంది. సినిమా, నిర్మాణం, వినోదం, ఇవన్నీ శుక్ర గ్రహానికి సంబంధించినవి. శుక్రుడు సంపద, ఆనందం, శ్రేయస్సుకు కారకంగా కూడా పరిగణిస్తుంటారు. అందుకే శుక్రవారం సినిమాలని విడుదల చేయడం మరింత పుణ్యమని భావిస్తుంటారు. శుక్రవారం.. శుక్ర గ్రహానికి సంబంధించిన పనులు చేయడం వల్ల కూడా విజయం చేకూరుతుందని చాలామంది నమ్ముతుంటారు. ఇలా చాలా కారణాల దృష్ట్యా.. ఇండస్ట్రీలో 'శుక్రవారం'కి చాలా ప్రాధాన్యం పెరిగిపోయింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హారర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)


