వంశీ పూజిత్, ప్రీతి, ప్రణవ్
‘‘కొత్తవాళ్లంతా కలిసి ఎంతో రిచ్‌గా ‘పతంగ్’ సినిమా చేశారు. నాని బండ్రెడ్డి క్రియేటివిటీ ఉన్న వ్యక్తి. ఈ సినిమా కోసం ఎంతో ఖర్చు పెట్టి ఓ స్టేడియంలో పతంగుల పోటీ పెట్టి భారీగా పతాక సన్నివేశాలు తీశారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది’’ అని నిర్మాత సురేష్‌బాబు తెలిపారు. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, ఎస్పీ చరణ్‌లతో ముఖ్య తారలుగా నూతన నటీనటులతో రూ పొందిన చిత్రం ‘పతంగ్’. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించారు.
డి. సురేష్‌బాబు సమర్పణలో విజయ్‌శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. జోస్ జిమ్మి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘ఎమోషనల్ డ్రామా...’ అంటూ సాగే పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ పాటని సురేష్‌బాబు విడుదల చేశారు. నాని బండ్రెడ్డి మాట్లాడుతూ– ‘‘పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’’ అన్నారు. ‘‘ఎమోషనల్ డ్రామా..’ పాటలో శ్రీమణిగారి లిరిక్స్ ఆకట్టుకుంటాయి’’ అన్నారు ప్రణవ్ కౌశిక్. ‘‘మా సినిమాలోని పతంగుల పోటీ ప్రేక్షకుల్లో ఉత్సుకతను కలిగిస్తుంది’’ అని నిర్మాతలు తెలిపారు.


