థియేటర్‌లో రిలీజైన సినిమాలు నాలుగైదు వారాల తర్వాత కానీ ఓటీటీలోకి రావు. కానీ ఓ తెలుగు మూవీ మాత్రం కేవలం వారానికే ఓటీటీలోకి వచ్చి షాకిచ్చింది. ఆ సినిమాయే పాంచ్ మినార్. రాజ్‌తరుణ్ హీరోగా, రాశీ సింగ్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ పాంచ్ మినార్. రామ్ కడుముల దర్శకత్వం వహించిన ఈ మూవీలో బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు.
గోవిందరాజు సమర్పణలో మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి నిర్మించారు. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజ్ తరుణ్ గత సినిమాలకంటే ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది. అయినప్పటికీ కేవలం వారం రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సడన్ సర్‌ప్రైజ్‌గా స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చారు.
కథేంటంటే..
కిట్టు (రాజ్ తరుణ్) నిరుద్యోగి. ఉద్యోగం సంపాదించే క్రమంలో ఈజీగా డబ్బులు సంపాదించాలనుకుంటాడు. బిట్‌కాయిన్ స్కామ్ ఐదు లక్షలు పోగొట్టుకుంటాడు. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు క్యాబ్ డ్రైవర్‌గా మారతాడు. ఒకసారి ఇద్దరు హంతకులు కిట్టు క్యాబ్ బుక్ చేసుకుని అతడి ముందే ఓ హత్య చేస్తారు. వాళ్ల ముందు చెవిటివాడిగా నటించి తప్పుకున్న కిట్టు తర్వాత ఏం చేశాడు? అదేరోజు కిట్టుకు కోట్ల రూపాయల డబ్బు ఎలా వచ్చింది? దాంతో ఏం చేశాడు? అన్నది ఓటీటీలో చూడాల్సిందే!


