‘‘మన జీవితాల్లో మహిళలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నా జీవితాన్ని మా అమ్మ, మా టీచర్స్ ఎంతో ప్రభావితం చేశారు. ఇప్పుడు హీరోయిన్లకు బలమైనపాత్రలు లభిస్తుండటం సంతోషంగా ఉంది. నేను కూడా బలమైనపాత్రలే చేయాలనుకుంటున్నాను. హీరోయిన్ల మధ్యపోటీ గురించి ఆలోచించను.పోటీ అనేది ప్రతిచోటా ఉంటుంది. నా వరకు క్రమశిక్షణతో కష్టపడుతుంటాను. నా స్కూల్, కాలేజీ, మిస్ ఇండియా కాంపిటీషన్.. ఇలా ప్రతిచోట నేనుపోటీ చూశాను’’ అని చెప్పారు హీరోయిన్ మీనాక్షీ చౌదరి. నవీన్ పొలిశెట్టి, మీనాక్షీ చౌదరి జోడీగా నటించిన సినిమా ‘అనగనగా ఒకరాజు’.
మారి దర్శకత్వంలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీనాక్షీ చౌదరి మాట్లాడుతూ–‘‘2024 సంక్రాంతికి ‘గుంటూరు కారం’, 2025 సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాను. ఈ ఏడాది సంక్రాంతికి ‘అనగనగా ఒకరాజు’తో ఆడియ న్స్ ముందుకు వస్తున్నాను. అయితే నేను ఏదీప్లాన్ చేయలేదు. ‘అనగనగా ఒకరాజు’ చిత్రంలో సంపన్న కుటుంబంలో పుట్టిన చారులత అనేపాత్రలో నటించాను. నవీన్గారితో వర్క్ చేయడం అనేది సినిమా టీచింగ్ స్కూల్‌లా ఉంది.
‘గుంటూరు కారం, లక్కీభాస్కర్’ తర్వాత ఇప్పుడు ‘అనగనగా ఒకరాజు’ సినిమాలు సితార బ్యానర్‌లో చేశాను. మారి మంచి ప్రతిభగల దర్శకుడు. ఇండస్ట్రీలో నటిగా సెటిల్ అవ్వడం అంటూ ఏమీ ఉండదు. ఎప్పటికప్పుడు నూతన నటీనటులు వస్తూనే ఉంటారు. దీంతో ప్రతి రోజూ పరుగే. నటిగా ‘ఔట్ ఆఫ్ లవ్’ అనేది నా తొలి సిరీస్ (టీవీ సిరీస్). ఈ షూట్‌లోపాల్గొన్న తొలిరోజే నాకు ఇబ్బందిగా అనిపించి, నా మేనేజర్‌కి కాల్ చేసి, ‘యాక్టింగ్ వద్దు. సినిమాలు వదిలేద్దామనుకున్నాను’ అని చెప్పాను. మనం కాంట్రాక్ట్ సైన్ చేశామని చెప్పి నన్ను కన్వి న్స్ చేశారు. ఆ తర్వాత యాక్టర్‌గా నేను మెరుగై రాణిస్తున్నాను. ఇక సోషల్ మీడియా ట్రోల్స్ నన్ను బాధపెట్టాయి. నాకు పుస్తకాలు రాయడం ఇష్టం. నాగచైతన్యగారితో ‘వృషకర్మ’ సినిమా చేస్తున్నాను’’ అన్నారు.


