యోధులొస్తున్నారు.. రణరంగంలోకి దిగండి, గెలిచి చూపించండి అని వీర లెవల్లో బిల్డప్ ఇచ్చాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9). మొదటిరోజు నిజంగానే గట్టి పోటీనిస్తూ ఆడారు. కానీ తర్వాత వచ్చినవాళ్లంతా హౌస్‌మేట్స్‌ను గెలిపించడానికే ఓడిపోయినట్లుగా కనిపించింది. మరికొందరేమో ఈ ఆటలన్నీ మా వాళ్ల కాదు, చిల్ అవడానికే వచ్చామన్నట్లుగా ఉన్నారు. ఇంతకీ హౌస్‌లో ఏం జరిగిందో గురువారం (నవంబర్ 27వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..
అతి చేసిన యావర్
బిగ్‌బాస్ 7 నుంచి ప్రిన్స్ యావర్ వచ్చాడు. వచ్చీరావడంతోనే తనూజ నీకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా? అని సూటిగా అడిగాడు. ఆమె లేదని చెప్పగానే తనతో కలిసి రొమాంటిక్ పాటకు స్టెప్పులేశాడు. కాకపోతే సాల్సా డ్యాన్స్ చేసి తనను ఇబ్బందిపెట్టినట్లుగానే కనిపించింది. ఆ తర్వాత ఆమె కోసం ప్రేమ పాట పాడాడు. అనంతరం ఇమ్మాన్యుయేల్‌తో కలిసి గేమ్ ఆడాడు. ఈ ఆటలో ఇమ్మూ గెలిచాడు.
భరణి వర్సెస్ దివ్య
కొన్నివారాలుగా తన ఆట కనిపించడం లేదని నామినేట్ చేసేసరికి బాగా హర్టయింది సంజన (Sanjana Galrani). అందరికీ కనిపించాలి, అంతేగా.. అని భరణి ట్యాబ్లెట్లు దొంగిలించేసింది. దొంగతనాలు సంజనాకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి.. తీస్తే ఇచ్చేయండి అని వెళ్లి ఆమెనే అడిగాడు భరణి. ఇమ్మాన్యుయేల్ కూడా ఇది సరదా విషయం కాదని చెప్తే ఆమె మాత్రం ఏం పర్లేదంది. మధ్యలో దివ్య కలగజేసుకుని సంజనా ఎలాగో వినది.. ఇమ్మాన్యుయేల్ పడుకో, లైట్ తీసుకో అంది.

శోభాపై గెలిచిన దివ్య
దీంతో భరణి.. దివ్యపై అరిచాడు. మధ్యలో ఎందుకు మాట్లాడతావ్? ఆరిందలా దిగుతావ్.. అన్నాడు. అలా ఇద్దరూ గొడవపడ్డారు. అప్పటికీ అదంతా సైలెంట్‌గా చూస్తూ ఉండిపోయిన సంజనా.. ఉదయానికి టాబ్లెట్స్ ఇచ్చేసింది. అనంతరం బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ శోభా శెట్టి హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. శోభాతో పోటీపడి దివ్య గెలిచి కంటెండరయింది. తర్వాత బిగ్‌బాస్ 4 ఫైనలిస్ట్ సోహైల్ అడుగుపెట్టాడు. అతడి ఎంట్రీతో హౌస్‌లో కొత్త ఎనర్జీ వచ్చింది.
అతడే చివరి కెప్టెన్
కిలో చికెన్, రెండు పాల ప్యాకెట్స్, కాఫీ పౌడర్ పంపించమని బిగ్‌బాస్‌కే ఆర్డరేశాడు సోహైల్. కాసేపు అతడిని ఆటాడుకున్నప్పటికీ చివరకు సోహైల్ అడిగినవన్నీ పంపించాడు. తర్వాత రీతూ, సంజనాతో కలిసి సోహైల్ గేమ్ ఆడాడు. ఈ ఆటలో సంజన, రీతూ గెలిచారు. అలా చివరి కెప్టెన్సీ కోసం కల్యాణ్, పవన్, దివ్య, ఇమ్మాన్యుయేల్, సంజన, రీతూ పోటీపడనున్నారు. సోషల్ మీడియా లీక్స్ ప్రకారం కెప్టెన్సీ గేమ్‌లో చివరి రౌండ్‌లో పవన్, ఇమ్మాన్యుయేల్ నిలిచారు. ఇమ్మూని ఓడించి డిమాన్ పవన్ చిట్టచివరి కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది.


