కొత్త దుస్తులు కొనడం, కొత్త స్టైల్‌లో కనిపించడం ట్రెండ్‌ను ఫాలో అవడం... ఇవే ఫ్యాషన్ అని మనలో చాలామంది అనుకుంటారు. కానీ బాలీవుడ్ స్టార్ అలియా భట్ ఆ ధోరణిని మార్చేసింది. ఇటీవల నటి కరీనాకపూర్ ఇచ్చిన దీపావళి పార్టీకి 30 ఏళ్ల నాటి వింటేజ్ సిల్క్ శారీ ధరించి అందరినీ ఆశ్చర్యపరించింది. ‘రీస్టైల్ ఫ్యాషన్‘ ద్వారా సస్టెయినబుల్ లివింగ్ కూడా గ్లామరే అనే సందేశాన్ని ఇస్తోంది. అదే నయా ట్రెండ్‌గా మన కళ్లకు కడుతోంది.
ఆధునిక భారతీయ ఫ్యాషన్ గురించి చెప్పాలంటే చాలా మంది సెలబ్రిటీలు తమ దుస్తులను రీ క్రియేట్ చేస్తూ సోషల్‌మీడియాలో అందంగా... అబ్బురంగా చూపుతున్నారు. ఇది ఒక స్ఫూర్తిని కలిగించే మార్పు. ఈ మార్పు పర్యావరణ అనుకూలమైనది మాత్రమే కాదు. తరాల వారసత్వాన్ని కూడా పరిచయం చేయడం. సెలబ్రిటీల జీవనవిధానం సమాజాన్ని మార్చగలదనే విషయాన్ని అలియాభట్ తన దుస్తుల ద్వారా తెలియజేస్తుంది. లుంగీ స్టైల్ స్కర్ట్, పింక్ చికంకారీ కుర్తీని ధరించి వేడుకలు జరుపుకుంది. ఆ తర్వాత కరీనాకపూర్ ముంబైలోని తన నివాసం లో నిర్వహించిన దీ΄ావళి వేడుకలకు హాజరయ్యింది.
సంగీత్ లెహంగా.. దీపావళి పార్టీలో...
కిందటేడాది దీపావళి సమయంలో బాలీవుడ్ గ్లామ్ వేడుకలకు ఆలియాభట్ హాజరయ్యింది. తన పెళ్లి సమయంలో మెహెందీ వేడుకలో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన పింక్ లెహంగాను ఈ గ్లామ్ పార్టీకి రీ స్టైల్ చేసి తిరిగి ధరించింది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ లెహంగాను రీ–స్టైల్ చేసి ధరించింది. ఈ లెహంగా సుమారు 180 టెక్స్‌టైల్ ప్యాచ్‌లతో, రియల్ గోల్డ్, సిల్వర్ నక్షీ, కోరా పూలు, వింటేజ్ సీక్వెన్సెస్‌తో తయారైంది. పార్టీకి కొత్త డ్రెస్ కొనకుండా, ఆమె ఆ లెహంగానే డిజైనర్ టాప్, జువెలరీ, హెయిర్‌స్టైల్‌తో రీ–స్టైల్ చేసింది.
పర్యావరణ హితం
పర్యావరణ స్పృహ కలిగిన దుస్తుల బ్రాండ్ ఎడ్–ఎ–మమ్మాను స్థాపించింది. ఇది పిల్లల, బాలింతలకు అవసరమయ్యే ఆర్గానిక్ దుస్తుల బ్రాండ్. ఫ్యాషన్ వ్యర్థాలను తగ్గించడానికి చేనేతలను ప్రోత్సహించడానికి కృషి చేస్తుంది. తన పెళ్లి సమయంలో ఉపయోగించిన లెహంగాతో సహా వివిధ రకాల తన దుస్తులను రీ క్రియేషన్ చేయడంలో అలియా ప్రసిద్ధురాలుగా పేరొందింది. అంతేకాదు పర్యావరణ అనుకూల బ్రాండ్లకు మద్దతు ఇస్తుంది.
30 ఏళ్ల క్రితం చీర కొత్తగా...
ఈ సందర్భంగా అలియాభట్ బంగారు రంగు చీరను ధరించింది. ఇండియన్ డిజైనర్ రీతుకుమార్ 30 ఏళ్ల క్రితం ఈ చీరను డిజైన్ చేశారు. ఈ చీరను స్లీవ్‌లెస్ బస్టియర్ స్టైల్ బ్లౌజ్‌తో జత చేసింది. బంగారు చోకర్ నెక్లెస్, ఉంగరాలు, మాంగ్ టిక్కా, బ్రేస్‌లెట్‌ను ధరించింది.
పాత దుస్తులను కొత్తగా తీర్చిదిద్దడం. ఆ దుస్తులు కూడా కొత్తగా కనిపించేలా మార్చడం అలియా భట్ చూపుతున్న మార్గం. ఆమె స్టైలింగ్ ఫిలాసఫీ కూడా ఇదే. ‘ఫ్యాషన్ అంటే కేవలం లుక్ కాదు, అది మన విలువల ప్రతిబింబం’ అంటుంది ఆలియా. ‘రీ–స్టైల్ ఫ్యాషన్ ’ కేవలం ట్రెండ్ కాదు ఒక సందేశం కూడా!
(చదవండి: మంత్లీ మ్యారేజ్ రివ్యూ!)


