పుస్తక సమీక్షలు, సినిమా రివ్యూలు, ఇంకా చెప్పుకోవాలంటే నిర్ణీత కాలవ్యవధిలో చేసే ‘వ్యాపార సమీక్ష’ల గురించి మనకు తెలుసు. అయితే ‘మ్యారేజ్ రివ్యూ’ అనేది మనం ఎప్పుడూ విని ఉండలేదు. బెంగళూరుకు చెందిన టెక్ ప్రొఫెషనల్ ప్రతీమ్ భోస్లే, ఫ్రెంచ్ యువకుడు సచా ఎర్‌బోనెల్‌ను వివాహం చేసుకొని ఆమ్‌స్టర్‌డామ్‌లో స్థిరపడింది.
ఇటీవల ఆమె ‘మంత్లీ మ్యారేజ్ పెర్‌ఫార్మెన్స్ రివ్యూ’ పేరుతో ‘ఎక్స్’లో షేర్ చేసిన పోస్ట్ నెటిజనులను నవ్వుల్లో ముంచెత్తడమే కాదు ఆలోచింపజేస్తోంది. ఈ పనులు సజావుగా జరుగుతున్నాయి, ఈ పనుల్లో ఇబ్బంది ఏర్పడుతుంది, మెరుగు పరుచుకోవాల్సిన విషయాలు... ఇలా రకరకాల కోణాలలో మ్యారేజ్ మంత్లీ రివ్యూ రాసింది ప్రతీమ్. రివ్యూలో భాగంగా కొన్ని తీర్మానాలు కూడా రాసింది.
అనవసర సలహాలు ఇవ్వకూడదు.
ఒకరి పనుల్లో ఒకరు సహాయం చేసుకోవాలి.
'నీకు ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను కదా’ ఇలాంటి మాటలతో తగాదాలకు ఆస్కారం ఇవ్వకూడదు.
అనుకోకుండా తగాదా జరిగితే దాని గురించి సోషల్ మీడియాలో రాయకూడదు.
‘నవ దంపతులు ప్రతీమ్–సచా ఎర్‌బోనెల్ మ్యారేజ్ రివ్యూను అనుసరించి తప్పొప్పులను బేరీజు వేసుకుంటే వారి సంసారంలో ఎలాంటి సమస్యలూ ఉండవు’ అని రాశాడు ఒక నెటిజనుడు. నిజమే కదా!
(చదవండి: Prabhas Diet: హీరో ప్రభాస్ అన్ని గుడ్లు తినేవాడా? బాహుబలి డైట్ అలా ఉండేదా..?)


