
ఇది ఏఐ ఆధారిత ప్రతీకాత్మక చిత్రం
వైవాహిక బంధానికి సంబంధించిన కేసుల్లో ఈ మధ్య ఆసక్తికరమైన తీర్పులు వెలువడుతుండడం చూస్తున్నదే. తాజాగా.. బాంబే హైకోర్టు ఓ ఆసక్తికరమైన తీర్పు ఇచ్చింది. భర్త, అతని కుటుంబ సభ్యులపై ఓ భార్య పెట్టిన క్రిమినల్ కేసును సరైన సాక్ష్యాలు లేవన్న కారణంతో కొట్టేసింది. ఈ క్రమంలో భార్య వంట బాగా లేదని, సరైన దుస్తులు ధరించడం లేదని అనడం వేధింపుల కింద రాదని పేర్కొంది.
2022 మార్చిలో ఆ జంటకు వివాహం జరిగింది. ఏడాది తర్వాత.. ఆమె భర్త నుంచి దూరంగా ఉంటూ వచ్చింది. ఈ తరుణంలో తన భర్త, అత్తమామలు, భర్త తరఫు బంధువులపై 498A కింద కేసు పెట్టింది. ఈ కేసు చివరకు బాంబే హైకోర్టుకు చేరింది. వివాహం జరిగిన నెల నుంచే తాను అత్తింట్లో వేధింపులు ఎదుర్కొన్నానని.. తన భర్త తాను వంట బాగా చేయడం లేదని, దుస్తులు సరైనవి ధరించడం లేదని సూటిపోటి మాటలతో వేధించాడని ఆమె కోర్టులో వాపోయింది. పైగా భర్తకు శారీరక, మానసిక సమస్యలు ఉన్న విషయం తన దగ్గర దాచారని, ఇంటి కొనుగోలు కోసం రూ.15 లక్షలు తేవాలని అతని కుటుంబ సభ్యులు.. బంధువులు హింసించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
అయితే ఈ పిటిషన్‌ను విచారణ జరిపిన బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్.. శుక్రవారం కీలక తీర్పు వెల్లడించింది. తనపై వేధింపులను ఆమె ఏరకంగానూ నిరూపించలేకపోయిందని తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. ‘‘భార్య దుస్తులు సరిగా వేసుకోలేదని.. వంట సరిగా చేయలేదని తిడుతుంటాడని కొందరు భార్యలు భర్తలపై ఫిర్యాదు చేస్తుంటారు. అయితే వీటిని మేం తీవ్రమైన క్రూరత్వంగా, వేధింపులుగా పరిగణించలేం’’ అని జస్టిస్ విభా కంకన్‌వాడి, జస్టిస్ సంజయ్ ఏ. దేశ్ముఖ్‌లతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది.
ఆమెకు ఇది రెండో వివాహం. 2013లో విడాకులు తీసుకున్న పిటిషనర్.. 2022లో మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన నెలకే వైవాహిక జీవితంలో వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె చెబుతున్నారు. అయితే ఆమె చేసిన ఆరోపణలు "ఓమ్నిబస్" (సారవంతం లేని) విధంగా ఉన్నాయి. తగిన సాక్ష్యాలు లేకపోగా.. ఆమెవన్నీ అతిశయోక్తితో కూడిన ఆరోపణలనే అనే విషయం ఆధారాలతో సహా కనిపిస్తున్నాయి.
వివాహానికి ముందు భర్త ఆరోగ్య స్థితి గురించి చెప్పలేదని ఈమె చెబుతోంది. కానీ, ఇద్దరి మధ్య జరిగిన చాట్ రికార్డులు అసలు విషయాన్ని బయటపెట్టాయి. అలాగే ఇల్లు కొనుగోలు కోసం డబ్బుకై వేధించారని చెబుతోంది. కానీ, అప్పటికే అతనికి ఓ ఇల్లు ఉంది. అలాంటప్పుడ ఇంటి కోసం వేధించాల్సిన అవసరం ఆ భర్తకు ఏముంది?.. వివాహ సంబంధం బలహీనపడినప్పుడే ‘వంట, దుస్తులు బాగోలేవనే..’ అతిశయోక్తులు జోడించబడతాయి. ఇలాంటి సందర్భాల్లో కేసులు వేయడం అంటే.. చట్టాన్ని అడ్డుపెట్టకుని భర్త, అతని కుటుంబాన్ని వేధించడమే అవుతుంది అని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే సదరు భర్తపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.