సాక్షి, హైదరాబాద్: కర్నూలులో చోటుచేసుకున్న కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బస్సులపై ప్రతీరోజు రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపడితే వేధింపులు అంటున్నారు. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అని వ్యాఖ్యలు చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా ట్విట్టర్ వేదికగా వీడియోలో మాట్లాడుతూ..‘కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరం.. చాలా బాధ కలుగుతుంది. మృతులకు సంతాపం వ్యక్తం చేస్తున్నా. బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుండి తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఉంటే రవాణా శాఖ నుండి ఆదేశించాం.
కర్నూల్ లో జరిగిన బస్సు సంఘటన దురదృష్టకరం.. చాలా బాధ కలుగుతుంది
మృతులకు సంతాపం వ్యక్తం చేస్తున్న..
బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి గారు వివరాలు తెలుసుకోవడం జరిగింది
తెలంగాణ ప్రభుత్వం నుండి తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఉంటే రవాణా శాఖ నుండి ఆదేశించాం
ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి,… pic.twitter.com/LrveQHLJsO— Ponnam Prabhakar (@Ponnam_INC) October 24, 2025
ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మధ్య ప్రతిరోజు వేలాది మంది ప్రయాణం చేస్తుంటారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. త్వరలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ మంత్రులు, రవాణా శాఖ కమిషనర్లతో సమావేశం ఏర్పాటు చేస్తాం. స్పీడ్ లిమిట్ ప్రమాదాలను నివారిస్తుంది. ఇలాంటి నిబంధనలు కచ్చితత్వం చేస్తాం. ప్రమాదం జరిగిన బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయింది. హైదరాబాద్ నుండి బెంగళూరు తిరుగుతుంది. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. క్షతగాత్రులకు మంచి చికిత్స అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరాం’ అని చెప్పుకొచ్చారు.


