నిరుపేదల డాక్టరమ్మ.. ఈ అపర్ణ

Doctor Aparna Hegde Name In Fortune World's 50 Greatest Leaders - Sakshi

ఫార్చ్యూన్‌ గ్రేటెస్ట్‌ లీడర్‌ ఆర్మాన్‌ అపర్ణ..!

అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో డాక్టర్‌ అపర్ణకు ఒక ఎమర్జెన్సీ కాల్‌ వచ్చింది 25 ఏళ్ల గర్భిణి అరుణకు ప్రసవం చేయడానికి వెంటనే రావాలని. హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు అపర్ణ. కానీ అప్పటికే గర్భంలో ఉన్న శిశువు మరణించింది. కనీసం తల్లినైనా కాపాడాలనుకున్నారామె. కానీ మూడు రోజుల తరవాత తల్లి కూడా మరణించింది. ఈ దుర్ఘటనను అపర్ణ మర్చిపోలేకపోయారు.

ఇలాంటి పరిస్థితి మరెవ్వరికి రాకూడదన్న ఉద్దేశ్యంతో ఆమె ‘ఆర్మాన్‌’ పేరిట 2008లో ఎన్జీవోను స్థాపించారు. నిరుపేద, అణగారిన వర్గాలకు చెందిన గర్భిణులు, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా... దేశంలోని మారుమూల ప్రాంతాల్లో మొబైల్‌ ఆధారిత వైద్యాన్ని ఆర్మాన్‌ ద్వారా అందిస్తున్నారు. కోవిడ్‌ సమయంలోనూ ప్రభుత్వ ఆసుపత్రులు, ఇతర ఎన్జీవోలతో కలిసి ఆర్మాన్‌ అనేక సేవలందించింది. ఆర్మాన్‌ కృషిని గుర్తించిన ఫార్చ్యూన్‌ సంస్థ.. తాజాగా ఈ ఏడాది ప్రకటించిన ‘వరల్డ్స్‌ 50 గ్రేటెస్ట్‌ లీడర్స్‌’ జాబితాలో డాక్టర్‌ అపర్ణ హెగ్డే పేరును చేర్చింది. 

ప్రతిష్టాత్మక ఫార్చ్యున్‌ 50 గ్రేటెస్ట్‌ లీడర్స్‌ జాబితాలో ఇద్దరు భారతీయులకు చోటు దక్కగా.. వారిలో ఒకరైన డాక్టర్‌ అపర్ణ హెగ్డే 15వ స్థానంలో నిలిచారు. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, క్లీవ్స్‌లాండ్‌ క్లినిక్‌లో చదువుకున్న డాక్టర్‌ అపర్ణ హెగ్డేకు అంతర్జాతీయ యూరో గైనకాలజిస్టుగా మంచి పేరుంది. ఆర్మాన్‌ ఎన్జీవో వ్యవస్థాపక మేనేజింగ్‌ ట్రస్టీగా వ్యవహరిస్తూ మరోపక్క ముంబైలోని కామా ఆసుపత్రిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. 

దాదాపు రెండున్నర కోట్లమందికి..
ఆర్మాన్‌.. లెవరేజ్‌ టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో తల్లి పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని అందించే పరిష్కారాలను చూపుతుంది. కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో పనిచేస్తూ.. మొబైల్‌ ఆధారిత ‘మెటర్నల్‌ మెస్సేజింగ్‌ ప్రోగ్రామ్‌(కిల్‌కరీ), ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు ట్రైనింగ్‌ ఇచ్చేందుకు మొబైల్‌ అకాడమీని నిర్వహిస్తోంది. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో దాదాపు 2.40 కోట్ల మంది మహిళలు పిల్లలు, 17 వేల మంది ఫ్రంట్‌లైన్‌ హెల్త్‌ కార్యకర్తలకు అర్మాన్‌ సేవలందించింది. ఆర్మాన్‌ సేవలను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, బ్రిటీష్‌ మెడికల్‌ జర్నల్, జీఎస్‌కే సేవ్‌ ది చిల్డ్రన్‌ వంటి సంస్థలు అవార్డులతో సత్కరించాయి. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 700 సంస్థలు ప్రతిష్టాత్మక ‘స్కోల్‌’ అవార్డుకు పోటీపడగా.. ఆసియా నుంచి ఆర్మాన్‌ ఈ అవార్డును దక్కించుకుంది. 

లాక్‌డౌన్‌లోనూ..
 ‘ద ప్యాన్‌ ఇండియా ఫ్రీ వర్చువల్‌ ఓపీడి క్లినిక్‌ల ద్వారా 14వేలకు పైగా గర్భిణులు, పిల్లలకు ఉచితంగా వైద్యసాయం చేసింది. 24 గంటలు అందుబాటులో ఉండే ఫ్రీ కాల్‌ సెంటర్‌ ద్వారా 60 వేలమందికి పైగా గర్భిణులు, పిల్లలకు సేవల్ని అందించారు. ముంబైలోని మురికివాడల్లో నివసించే మూడు లక్షలమంది మహిళలకు వారం వారం ‘ఆటోమేటెడ్‌ వాయిస్‌ కాల్స్‌’ ద్వారా కోవిడ్‌–19కు సంబంధించిన సమాచారాన్ని అందించారు. ఫోన్‌కాల్స్, ఎస్‌ఎమ్‌ఎస్‌ సదుపాయాలతో లక్షలాది మంది గర్భిణులకు చేరువైంది. ఆర్మాన్‌ తరపున వర్చువల్‌ వైద్య సేవలు, వీడియోకాల్స్‌ ద్వారా అపర్ణతోపాటు మరికొందరు డాక్టర్లు గర్భిణులకు వైద్యం అందిస్తున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top