
ముంబై: సైబర్ నేరాలపై ప్రభుత్వాలు, పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. సైబర్ మోసగాళ్ల చేతిలో అమాయకులు సులభంగా మోసపోతునే ఉన్నారు. దేశంలో రోజురోజుకు ఇలాంటివి అనేక ఘటనలు వెలుగుచూస్తున్నాయి. యువతే కాదు.. వృద్ధులు సైతం వలపు వలలో పడుతున్నారు. వారి బలహీనతల్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ముంబైలో 80 ఏళ్ల వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించి.. సైబర్ మోసానికి గురై రూ.9 కోట్లు పోగొట్టుకున్నాడు.
ముంబైకి చెందిన వృద్ధుడు 2023 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఫేస్‌బుక్‌లో షార్వి అనే మహిళకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించగా.. ఆ రిక్వెస్ట్ అంగీకరించలేదు. అయితే, కొన్ని రోజుల తర్వాత షార్వి ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీంతో ఆ వృద్ధుడు అంగీకరించాడు. ఇద్దరూ చాటింగ్ ప్రారంభించారు. ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చి పుచ్చుకున్నారు.
అప్పుడే అసలు కథ మొదలైంది. తన భర్త నుంచి దూరమై పిల్లలతో ఉన్నట్లు నాటకానికి తెర తీసింది. ప్రస్తుతం తన పిల్లలు అనారోగ్యంతో ఉన్నారని.. తనకు కొంత డబ్బు అవసరం అంటూ వాపోయింది. దీంతో కరిగిపోయిన ఆ వృద్ధుడు నగదును పంపించాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత కవిత అనే మహిళ వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపడం ప్రారంభించింది. షార్వి స్నేహితురాలిగా పరిచయం చేసుకున్న ఆమె. ఆ వృద్ధుడికి అసభ్యకర సందేశాలు పంపడం ప్రారంభించింది. అనంతరం డబ్బు డిమాండ్ చేయడం మొదలుపెట్టింది.
ఇదిలా ఉండగా.. మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. షార్వి సోదరి నంటూ మరో మహిళా దివాజ్ సందేశాలు పంపించడం మొదలు పెట్టింది. షార్వి చనిపోయిందని.. ఆస్పత్రి బిల్లు చెల్లించాలని స్క్రీన్ షాట్‌లు కూడా పంపించింది. దీంతో ఆ వృద్ధుడు డబ్బులు పంపించాడు. అనంతరం తిరిగి దినాజ్‌ను డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఇదిలా సాగుతుండగా..
ఇంతలోనే జాస్మిన్ అనే మరో మహిళ మెసేజ్ పంపించింది. దినాజ్ స్నేహితురాలినంటూ సాయం చేయాలని అభ్యర్థించింది. దీంతో ఆమెకు కూడా ఆ వృద్ధుడు డబ్బు పంపించాడు. ఇలా ఏప్రిల్ 2023 నుంచి జనవరి 2025 వరకు రూ. 8.7 కోట్లు పంపించాడు. ఇంతటితో ఆ వృద్ధుడు ఆగలేదు.. ఇక ఖాతాలో నగదు అయిపోవడంతో కోడలి దగ్గర రూ.2లక్షలు అప్పుతీసుకున్నాడు. మరింత డబ్బు కావాలంటూ ఆ మహిళలు కోరడంతో కుమారుడి దగ్గర కూడా రూ. 5 లక్షలు అడిగాడు.
దీంతో అనుమానం వచ్చి కొడుకు తండ్రిని నిలదీయగా.. ఆ డబ్బు ఎందుకు అవసరమో చెప్పాడు. దీంతో అసలు విషయం బయటపడింది. చివరికి మోసపోయానని తెలుసుకున్న ఆ వృద్ధుడు ఆస్పత్రి పాలయ్యాడు. మోసంపై జూలై 22న సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వృద్ధుడిని మోసం చేసిన నలుగురు మహిళలు తెలిసిన వారై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.