
అమ్మమ్మ... నానమ్మ... ఇప్పుడు అంతగా పట్టని మనుషులు. వాళ్ల చేతికో ఫోన్ ఇచ్చేసి, గది ఇచ్చేస్తే ఎవరూ మాట్లాడాల్సిన పని లేదని అనుకునే కుటుంబాలు ఉన్నాయి. పెద్దవయసులో ఒంటరితనం ఫీలవుతున్న స్త్రీలు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని తిరిగి స్కూలుకు పంపితే చదువుకు చదువు, స్నేహానికి స్నేహం దక్కుతాయి. మహారాష్ట్రలో పదేళ్ల క్రితం మొదలైన ఇలాంటి బడి నేటికీ కొనసాగుతూ ప్రతి ఊరికి ఇలాంటిది అవసరమని చాటుతోంది. ‘ఆజిబైచి శాల’ అంటే ‘అమ్మమ్మల బడి’ గురించి...
ఇది అద్భుతం. మొన్నటి మార్చి 8న మహారాష్ట్రలోని ఆ చిన్న పల్లెలో, ముంబైకి 120 కిలోమీటర్ల దూరాన ఉన్న ఆ గ్రామంలో పెద్ద ఉత్సవం జరిగింది. అదేమిటో తెలుసా? ‘ఆజిబైచి శాల’ దశాబ్ది ఉత్సవం. అంటే ఆ స్కూల్ పెట్టి సరిగ్గా పదేళ్లయిన సందర్భంగా ఆ స్కూలు స్టూడెంట్లు, పెద్దమనుషులు, గ్రామస్తులు... ఆ స్కూల్‌ని స్థాపించిన యోగేంద్ర బంగార్ అనే ఉపాధ్యాయుడు ... అందరూ వేడుక చేసుకున్నారు. బహుశా ప్రపంచంలో ఇలాంటి స్కూల్ ఏర్పాటయ్యి ఇలా పదేళ్లపాటు కొనసాగి, ఇంకా కొనసాగుతూ ఉండటం ఎంత గొప్ప. ‘ఆజిబైచి శాల’ అంటే ‘అవ్వల బడి’. అందులో స్టూడెంట్స్ అందరూ అవ్వలే.
మలుపు తిప్పిన ఆలోచన
ఒక ఆలోచన వెలిగితే అది చరిత్ర సృష్టిస్తుంది. పదేళ్ల క్రితం ఫంగణె అనే ఆ పల్లెలో ఛత్రపతి శివాజీ గాథను ఊరి వారికి ఏర్పాటు చేశారు. వచ్చిన గాయకులు శివాజీ గాథను పాడుతూ ఉంటే ఊళ్లోని వారందరూ ఒకవైపు; ఊళ్లోని అవ్వలందరూ ఒకవైపూ కూచున్నారు. వారి సంఖ్య 36. శివాజీ గాథను ఊరి వారందరూ ఉత్సాహంగా వింటుంటే అవ్వలకు ఆ కథ సరిగ్గా అర్థమయ్యీ అర్థం కాక ఇబ్బందిగా అనిపించింది. కథ ముగిశాక ఆ ఊరి ఉపాధ్యాయుడైన యోగేంద్ర బంగార్ దగ్గరకు వెళ్లిన వారందరూ ‘సారూ... మీరంతా కథ మస్తు ఎంజాయ్ చేశారు.
మేం కూడా చదువుకుని ఉంటే మీలాగే ఎంజాయ్ చేద్దుము’ అన్నారు. యోగేంద్ర బంగార్‌కు మనసు కలుక్కుమంది. ఇంట్లో ఉండే అవ్వలు చదువు లేక పోవడం వల్ల, వయసు రీత్యా, మారిన కాలం వల్ల ఒంటరితనం అనుభవిస్తున్నారని, వీరికి ఒక ఉపయోగపడే కాలక్షేపం కల్పిస్తే మేలవుతుందని ఆయన అనుకున్నాడు. అదే సంవత్సరం అంటే 2016 మార్చి 8 మహిళా దినోత్సవం రోజున ఊళ్లోని చిన్న స్థలంలో షెడ్డు వేసి ‘అవ్వల బడి’ని ప్రారంభించాడు. అవ్వలు ముందు కంగారు పడ్డా ఆ నిర్ణయాన్ని స్వాగతించారు. ఊరి వాళ్లు మెచ్చుకుని మద్దతు ఇచ్చారు. అలా మొదలైన ఆ స్కూలు ఆ నాటి నుంచి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది.
పెద్ద సమూహం, ఎంతో మేలు
గ్రామంలో అంతవరకూ ఎవరికీ పట్టని ఈ అవ్వలు ఇప్పుడు కొత్త ఉనికిలోకి వచ్చారు. గౌరవం పొందారు. అంతేకాదు ఇంట్లో వీరు తమ మనవలతో, మనవరాళ్లతో పాటుగా చదవడం మొదలుపెట్టారు. అవ్వల హోమ్‌వర్కులో మనవలు సాయం పట్టారు. దాంతో వాతావరణమే మారి పోయింది. ఈ అవ్వలందరూ కలిసి యాత్రలకు వెళుతున్నారు. అలాగే వీరికోసం హెల్త్ క్యాంపులు ఏర్పాటు అవుతున్నాయి. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ ఎప్పటికప్పుడు తెలియచేస్తుంటారు. ఇవన్నీ వారికి ఆత్మవిశ్వాసం కలిగిస్తున్నాయి.
‘ఈ బంధుగణం కావాలి’
‘మన దేశంలో చిన్న వయసులో పెళ్లిళ్ల వల్ల అరవై ఏళ్లు వచ్చేసరికి స్త్రీలు ఒంటరితనాన్ని, నిరాసక్తతను అనుభవిస్తున్నారు. వీరికి చదువు లేక పోతే చాలా విషయాలకు మరింత దూరమవుతున్నారు. కనీసం ఫోను వాడకం కూడా రావడం లేదు. వీరి కోసం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం కంటే ఇలాంటి బడులు ప్రతి ఊళ్లో ప్రతి ఏరియాలో ఏర్పాటు చేయాలి. దీనివల్ల వీరికి మనం కూడా ఎంచదగ్గ మనుషులమే అనే భావన కలుగుతుంది. అవ్వల అనుభవం, వారి చిరునవ్వు ప్రతి ఇంటా ఉండాలంటే వారిని గౌరవించి పట్టించుకోవడం అవసరం‘ అంటాడు ఈ స్కూలు స్థాపకుడు యోగేంద్ర బంగార్.
నిజమే... ప్రతి ఊరూ పూనుకుని ఇలాంటి స్కూలు ఏర్పాటు చేస్తే నిరక్షరాస్యత పోవడం మాత్రమే కాదు వృద్ధుల మనోవికాసం వారికి కొత్త జవసత్వాలను ఇస్తుంది. వారి ఉదాసీనత పోగొడుతుంది.
పింక్ రంగు చీరల్లో ‘స్టూడెంట్స్’
ఊరిలోని వాళ్ల ఫండ్స్‌తో మొదలైన ఈ స్కూలుకు అవ్వలందరికీ పింక్ రంగు చీరలు యూనిఫామ్‌గా ఇచ్చారు. స్కూల్ బ్యాగులు, పలకలు, బలపాలు అన్నీ ఇచ్చారు. స్కూలు మొదలైన రోజున ‘చేతికర్రతో తిరిగే ఆ స్త్రీలు బలపం పట్టుకోవడానికి విద్యార్థుల్లా’ బడికి వచ్చారు. ఆ దృశ్యం అందరినీ కదిలించింది. స్కూలు గంటలు వారికి సౌకర్యంగా ఏర్పాటు చేశారు. రోజువారీ పనులన్నీ అయ్యి, గొడ్లకు మేత వేసి, మధ్యాహ్నం భోజనం చేసి అప్పుడు బడికి రావాలి. రోజూ బడి మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు రెండు గంటలు మాత్రమే జరుగుతుంది. మరాఠీ లిపి, కొద్దిపాటి లెక్కలు, ఆర్ట్స్, క్రాఫ్ట్స్... అన్నీ నేర్పిస్తారు. సిలబస్ ఉంటుంది. అన్నింటికీ మించి తమదంటూ ఒక చోటు.. తమకంటూ కొందరు మనుషులు వారికి దొరుకుతారు.