
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జీ కూతురు విద్ది ముఖర్జీ సంచలన ఆరోపణలకు దిగారు. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో తన పేరుతో ఉన్న స్టేట్‌మెంట్లు తనవి కాదని.. అవి నకిలీవని పేర్కొన్నారు. దీంతో ప్రాసిక్యూషన్‌కు ఎదురు దెబ్బ తగిలినట్లైంది.
ఈ కేసులో ప్రధాన నిందితులైన ఇంద్రాణీ ముఖర్జీ, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా కూతురే విద్ధి ముఖర్జీ. మంగళవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో జడ్జి జేపీ దరేకర్ ఎదుట సాక్ష్యాన్ని నమోదు చేసే క్రమంలో ఆమె కీలక విషయాలను వెల్లడించారు. ఏ దర్యాప్తు సంస్థ తన వాంగ్మూలం నమోదు చేయలేదని, తన పేరిట నమోదైన ప్రకటనలు నకిలీవని అన్నారామె.
ఇంద్రాణీ అరెస్టు తర్వాత.. పీటర్ ముఖర్జీ, ఆయన కుటుంబ సభ్యులు ఆమె ఆస్తులపై గొడవపడినట్టు విద్ది తెలిపారు. పీటర్ కొడుకులు రాహుల్, రబిన్‌లు ఇంద్రాణికి చెందిన కోట్ల విలువైన ఆభరణాలను, రూ.7 కోట్ల నగదు దోచుకున్నారని ఆమె ఆరోపించారు. చివరకు ఆ కుటుంబ సభ్యులు ఇంద్రాణి వాడిన పర్‌ఫ్యూమ్‌లు, బ్యాగులు, చీరల కోసం కూడా కొట్టుకున్నారని తెలిపారు. దీంతో తన తల్లి దగ్గర చిల్లిగవ్వ లేకుండా అయ్యిందని వాపోయారామె. అంతేకాదు.. ఆస్తులను ఎక్కడ అప్పగించాల్సి వస్తుందోనని ఉద్దేశపూర్వకంగానే తన తల్లి ఇంద్రాణి ముఖర్జీని ఈ కేసులో ఇరికించారని ఆరోపించారామె.
తన తల్లి అరెస్ట్ అయిన సమయంలో తాను మైనర్‌గా ఉన్నానని, ఆ సమయంలో తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని విద్ధి ప్రత్యేక న్యాయమూర్తికి తెలిపారు. ఈ కేసు విచారణలో ముంబై పోలీసులు తొలుత తనను సంప్రదించారని, ఆ తర్వాత సీబీఐ తనను ప్రశ్నించాలనుకుందని తెలిపారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానాలు ఇచ్చానని విద్ధి తెలిపారు. అయితే.. పోలీసులుగానీ, సీబీఐగానీ తన స్టేట్‌మెంట్‌ను ఎక్కడా అధికారికంగా నమోదు చేయలేదని అన్నారామె. అలాగే..
సీబీఐ కార్యాలయంలో తనను ఖాళీ పత్రాలపై, కొన్ని ఈమెయిల్ ప్రతులపై సంతకం చేయమని ఒత్తిడి చేశారని, ఛార్జ్‌షీట్‌లో ఉన్న ప్రకటనలు తనవిగా చూపించడంలో దురుద్దేశం కనిపిస్తోందని అన్నారామె. తన తల్లిదండ్రుల్ని ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందన్న అనుమానాలను ఆమె వ్యక్తం చేశారు.
బోరాను తన తల్లి ఇంద్రాణి ముఖర్జీ సోదరిగానే ప్రపంచానికి పరిచయం చేసింది. ఒకానొక టైంలో ఇద్దరూ అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఎప్పుడైతే పీటర్ ముఖర్జీ పెద్ద కొడుకు రాహుల్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడో అప్పుడే పరిస్థితి మారిపోయింది. అతను తరచూ సెంట్రల్ ముంబై వోర్లీలో ఉన్న బోరా ప్లాట్‌కు వెళ్లడం ప్రారంభించాడో.. అప్పటి నుంచి మనస్పర్థలు మొదలయ్యాయి. రాహుల్, షీనాకు సన్నిహితంగా ఉండడం మాత్రమే కాదు.. డ్రగ్స్ అలవాటు చేయడంతో పరిస్థితి మరింత దిగజారింది.
చివరిసారిగా.. బోరాను 2011లో గోవాలో జరిగిన ఓ వివాహ వేడుకలో చూశాను. కానీ, 2013 దాకా ఆమె ఈమెయిల్స్‌తో టచ్‌లో ఉండేది అని విద్ధీ కోర్టుకు తెలిపింది.
2015 ఆగస్టులో తన తల్లి అరెస్ట్ అయ్యేదాకా అంతా బాగానే ఉండేది. ఆ టైంలో పీటర్ కొడుకులు రాహుల్ ఏ పనీ పాట లేకుండా ఖాళీగా ఉన్నాడు. రాహుల్ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. అందుకే డబ్బు కోసం వాళ్లిద్దరూ తెగించారు. పీటర్ ముఖర్జీ అరెస్ట్ కంటే ముందే వాళ్లిద్దరూ ఇంద్రాణికి చెందిన నగలు దొంగిలించారు. వాటిని కొత్తగా ఓ బ్యాంక్ లాకర్ తెరిచి దాచారని అన్నారామె. తద్వారా వాళ్లిద్దరూ ఇంద్రాణిని కావానే ఇరికించినట్లు స్పష్టమవుతోందని అన్నారు. తల్లి కావాలా? ముఖర్జీ వారసత్వం కావాలా? ఎంచుకోవాలని రబిన్ తనను బెదిరించాడని, ఒకవేళ తల్లి వైపు నిలవడితే ఆస్తులను వదులుకోవాల్సి ఉంటుందని బెదిరించాడని కోర్టుకు తెలిపింది. బుధవారం కూడా విద్ధి సాక్ష్యాన్ని కోర్టు నమోదు చేయాల్సి ఉంది.
షీనా బోరా.. ఇంద్రాణీ ముఖర్జీ, ఆమె మొదటి భర్త సిద్దార్థ్ దాస్‌లకు పుట్టిన సంతానం. 2012లో షీనా బోరా అనుమానాస్పద రీతిలో అదృశ్యమైంది. అయితే ఆమె అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిందని ఇంద్రాణీ అందరికీ చెబుతూ వచ్చింది. 2015లో ఇంద్రాణీ డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్ ఓ కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. అతన్ని విచారించే క్రమంలో.. షీనా బోరా హత్య కేసు బయటకు వచ్చింది.
ఈ కేసులో ఇంద్రాణీ, ఆమె మాజీ భర్తలు, సంజీవ్ ఖన్నా, పీటర్ ముఖర్జీలను పోలీసులు అరెస్ట్ చేసింది. ఇంద్రాణీ, సంజీవ్, డ్రైవర్ శ్యామ్‌వర్‌లు షీనాను కారులో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు ప్రాసిక్యూషన్ వాదిస్తోంది. హత్య అనంతరం ఆమె శరీరాన్ని రాయగడ్ అడవిలో తగలబెట్టి పారేసినట్టు ఆరోపణ ఉంది. అంతేకాదు.. షీనా మరణించాక కూడా బతికే ఉందని నమ్మించేందుకు ఆమె పేరిట అందరికీ మెయిల్స్ పంపిందని అంటోంది. ఈ కేసులో పీటర్, సంజీవ్‌లకు కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. ఆరున్నరేళ్లు జైలు జీవితం గడిపిన ఆమె.. 2022 మే 18న ముంబై బైకులా మహిళా జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు.